Electric Scooters With Low Cost | భారత్‌లో గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో పాటు పర్యావరణానికి హాని కలిగించక వాహనాల వైపు ప్రజలు ఫోకస్ చేయడం మరో కారణం. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు బైక్ నడపడం మరింత ఖరీదు అవుతోంది. జీతాలు పెరుగుతాయో లేదో కానీ పెట్రోల్ సహా ఇతరత్రా ఖర్చులు, ఇంటి ఖర్చులు పెరుగుతుంటాయి. దాంతో పెట్రోల్ సమస్య నుండి పర్మనెంట్ సొల్యూషన్ కోరుకుంటే.. ఇది మీకు నిజంగా గుడ్ న్యూస్.
భారత మార్కెట్లో కొన్ని అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని నడిపేందుకు మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. RTO ఆఫీసుల చుట్టూ తిరిగి రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో కొత్త వాహనదారులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. వీటి ధర ఎంత తక్కువగా ఉందంటే మీ బడ్జెట్‌లో సరిపోతాయి. ఎలాంటి చట్టపరమైన డాక్యుమెంట్లు లేకుండానే ఈ స్కూటర్లను రోడ్డుపై నడపవచ్చు. మరి ఆ స్కూటర్లు ఏంటి, వాటి ధర ఎంతో ఇక్కడ తెలుసుకోండి.
ఆంపియర్, ఒకినావా అద్భుతమైన స్కూటర్లు
పైన పేర్కొన్న స్కూటర్ల జాబితాలో మొదటగా 'ఆంపియర్ రియో ఎలైట్' (Ampere Reo Elite) వస్తుంది. తక్కువ బడ్జెట్‌లో ఇది చాలా నమ్మకమైన ఆప్షన్. హైదరాబాద్‌లో సుమారు రూ. 42,999 ధరతో వచ్చే ఈ స్కూటర్, ఫుల్ ఛార్జ్ చేస్తే 55 నుంచి 60 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. దీని బ్యాటరీపై కంపెనీ పూర్తి 2 సంవత్సరాల వారంటీని ఇస్తోంది. తక్కువ ధరతో పాటు రోజువారీ ఆఫీసు జర్నీ, చిన్న వ్యాపార పనుల మీద వెళ్లే వారికి తక్కువ ధరతో ఉపశమనాన్ని కలిగిస్తుంది.
Also Read: Honda Activa e vs Bajaj Chetak: హోండా యాక్టివా ఇ vs బజాజ్ చేతక్! అసలైన ఈవీ బాస్ ఎవరు?
మరోవైపు, కొంచెం స్పోర్టీగా, ప్రీమియం లుక్‌ను ఇష్టపడే వారికి 'ఒకినావా R30' ఒక మంచి ఆప్షన్ కానుంది. హైదరాబాద్‌లో సుమారు 58,992 ధరలో లభించే ఈ స్కూటర్‌లో ఎల్‌ఈడీ లైట్లు, డే-టైమ్ రన్నింగ్ లైట్లు, యాంటీ థెఫ్ట్ అలారమ్, సెంట్రల్ లాకింగ్ వంటి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఇచ్చారు.
లోహియా ఓమా స్టార్
ఒకవేళ మీ బడ్జెట్ తక్కువగా ఉండి, ఎక్కువ రేంజ్ కోరుకుంటే.. మీకోసం 'లోహియా ఓమా స్టార్' మీకు బెస్ట్ ఆప్షన్. దీని ప్రారంభ ధర కేవలం రూ. 40,850 మాత్రమే ఉంది. ఇది అత్యంత చౌకైన స్కూటర్లలో ఒకటి కావడంతో పాటు సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
మీకు బేసిక్ రైడింగ్ లైట్లు, షార్ప్ టర్న్ ఇండికేటర్లు, బ్యాటరీ స్థాయిని సరిగ్గా చూపే డిజిటల్ ఇండికేటర్ లభిస్తాయి. రోజువారీ ఆఫీసు జర్నీకి, ఇంటి పనుల కోసం, కూరగాయలు- రేషన్ తీసుకురావడానికి లేదా దగ్గర్లోని ప్రదేశాలకు వెళ్లడానికి ఈ స్కూటర్ సరిగ్గా సరిపోతుంది.
స్టూడెంట్స్ కోసం మంచి ఆప్షన్లు..
ఇవన్నీ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కావడంతో పాటు, ఇంకా 18 సంవత్సరాలు నిండని, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం లేని విద్యార్థులకు వరం లాంటివి. ఇంట్లోని వృద్ధులు, మహిళలు కూడా వీటిని ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. వీటి బరువు చాలా తక్కువగా ఉంటుంది. గంటకు 25 కిలోమీటర్లు వేగం ఉండటంతో రోడ్లపై ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.
ఈ స్కూటర్లను ఛార్జింగ్ చేయడానికి చాలా తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. మీ నెలవారీ పెట్రోల్ ఖర్చుల కంటే మంత్లీ ట్రావెలింగ్ ఖర్చు చాలా తగ్గుతుంది. కేవలం నగరం లోపలి లోకల్ కనెక్టివిటీ, తక్కువ దూరం ప్రయాణాలకు ఇవి సరిగ్గా సరిపోతాయి. పూర్తి వివరాలు తెలుసుకున్నాకే కొనడం మంచిది.
