Best Electric Scooters in India : ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకూ పుంజుకుంటోంది. కొత్త స్టార్టప్‌లతో పాటు పాత దిగ్గజ కంపెనీలు కూడా ఈ రేసులోకి దూకుతున్నాయి. కస్టమర్లకు ఎన్నో ఆప్షన్లు అందుబాటులోకి రావడంతో ఏది కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే మీ శ్రమను తగ్గించడానికి టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో వంటి నమ్మకమైన బ్రాండ్ల నుండి బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం.
టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)..
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో టీవీఎస్ ఐక్యూబ్ ముందు వరుసలో ఉంటుంది. టీవీఎస్ బ్రాండ్ మీద ఉన్న నమ్మకం దీనికి పెద్ద ప్లస్ పాయింట్. ఇందులో ఐక్యూబ్, ఐక్యూబ్ S, ఐక్యూబ్ ST అనే మూడు వేరియంట్లు లభిస్తాయి. దీని ప్రారంభ ధర రూ. 94,999 (ఎక్స్-షోరూమ్) కాగా, హై-స్పెక్ మోడల్ ధర రూ. 1.61 లక్షల వరకు ఉంది. బ్యాటరీ ప్యాక్‌ను బట్టి ఇది 94 కిలోమీటర్ల నుండి గరిష్టంగా 212 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇందులో 5.3 kWh పెద్ద బ్యాటరీ యూనిట్ కూడా అందుబాటులో ఉంది.
ఏథర్ రిజ్వా (Ather Rizta):
కుటుంబ అవసరాలకు తగ్గట్లుగా రూపొందించిన ఏథర్ రిజ్వా ఇప్పుడు ఫ్యామిలీస్ ఫేవరెట్ ఛాయిస్ గా మారింది. దీని ఫంక్షనల్ డిజైన్, కంఫర్ట్ రైడింగ్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆధునిక టెక్నాలజీతో వచ్చే ఈ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 123 కిలోమీటర్ల నుండి 159 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని ధరలు రూ. 1.04 లక్షల నుండి రూ. 1.30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
బజాజ్ చేతక్ (Bajaj Chetak)
బజాజ్ చేతక్ ఈవీ తన ఆల్-మెటల్ బాడీతో మిగిలిన స్కూటర్ల కంటే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీ, డ్యూరబిలిటీ విషయంలో దీనికి తిరుగు లేదు. మార్కెట్లో లభిస్తున్న అత్యంత రిఫైన్డ్ స్కూటర్లలో ఇది ఒకటి. ఇందులో C2501, C3001, C35 సిరీస్ వంటి మోడళ్లు ఉన్నాయి. దీని రేంజ్ 113 కిలోమీటర్ల నుండి 151 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ప్రారంభ ధర రూ. 89,500 కాగా, ప్రీమియం వేరియంట్ రూ. 1.22 లక్షల వరకు పలుకుతోంది.
హీరో విడా (Hero Vida)
హీరో మోటోకార్ప్ నుండి వచ్చిన విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తున్నాయి. ఇందులో V2, VX2 అనే సిరీస్ మోడళ్లు ఉన్నాయి. పోర్టబుల్ ఛార్జింగ్ సదుపాయం ఉండటం దీనికి మరో అడ్వాంటేజ్. VX2 GO మోడల్ ధర రూ. 73,850 నుండి మొదలై V2 ప్రో రూ. 1.40 లక్షల వరకు ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 92 నుండి 165 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
సుజుకి ఈ-యాక్సెస్ (Suzuki e Access)
జపాన్ దిగ్గజం సుజుకి కూడా ఈవీ రేసులో నిలిచింది. సరికొత్త సుజుకి ఈ-యాక్సెస్ రూ. 1.88 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 3.072 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది ఒక సింగిల్ ఛార్జ్‌పై 95 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తోంది.
