Best CNG Cars Under Rs 10 lakhs Budget In 2025: అధిక పెట్రోల్ & డీజిల్ ధరలు మోతను తట్టుకోలేకపోతున్న ప్రజలు, ముఖ్యంగా సామాన్య జనం CNG కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ & డీజిల్ వేరియంట్లతో పోలిస్తే CNG కార్లు ప్రజల డబ్బును ఆదా చేస్తాయి, పైగా పర్యావరణహితంగానూ పని చేస్తాయి. రూ. 10 లక్షల బడ్జెట్‌లో ఒక మంచి CNG కారు కొనాలని మీరు ప్లాన్‌ చేస్తుంటే, భారతీయ మార్కెట్లో మీ కోసం చాలా అద్భుతమైన ఆప్షన్లు ఎదురు చూస్తున్నాయి.        

రూ.10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్‌ CNG కార్లు     

మారుతి సుజుకి ఆల్టో K10 CNGఆల్టో K10 ను భారత మార్కెట్లో అత్యంత తక్కువ ధర CNG కారుగా కొనుగోలు చేయవచ్చు. ఆల్టో K10లో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది CNG మోడ్‌లో 56 hp & 82.1 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. CNG మోడ్‌లో ఈ కారు కిలోగ్రాముకు 33.85 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వగలదని రిపోర్ట్స్‌ చెబుతున్నాయి.          

టాటా పంచ్ CNG  నాణ్యమైన నిర్మాణానికి కేరాఫ్‌ అడ్రస్‌ టాటా బ్రాండ్‌ కార్లు. ఈ బ్రాండ్‌లోని టాటా పంచ్ కారు.. పెట్రోల్, ఎలక్ట్రిక్ & CNG వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. పంచ్ iCNGని, అత్యుత్తమ భద్రత సాంకేతికతలకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ ALFA ఆర్కిటెక్చర్‌పై డిజైన్‌ చేశారు. ఈ కారులో iCNG కిట్ ఉంటుంది, కారులో ఎలాంటి లీకేజీ ప్రమాదం రాకుండా ఇది రక్షిస్తుంది. కారు CNG ట్యాంక్‌ నుంచి గ్యాస్ లీక్ అయితే, ఈ టెక్నాలజీ సహాయంతో కారు ఆటోమేటిక్‌గా CNG మోడ్ నుంచి పెట్రోల్ మోడ్‌లోకి మారుతుంది, ప్రమాదం జరగకుండా నివారిస్తుంది.          

మారుతి స్విఫ్ట్  కస్టమర్‌ను నిరుత్సాహపరచని మైలేజ్‌ ఇచ్చే మారుతి సుజుకీ స్విఫ్ట్, ఇటీవల CNG వేరియంట్‌లో మార్కెట్లోకి విడుదలైంది. ఈ కారులో Z-సిరీస్ ఇంజిన్ & S-CNG మేటి కలయిక ఉంది. ఈ కారణంగా ఈ కారు ఒక కిలో CNGకి దాదాపు 33 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వగలదు. మారుతి స్విఫ్ట్ CNG మార్కెట్లో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని బేస్ & మిడ్ వేరియంట్లలో స్టీల్ వీల్స్ ఉపయోగించారు, టాప్-వేరియంట్‌లో పెయింట్ చేసిన అల్లాయ్ వీల్స్ బిగించారు.         

'మారుతి స్విఫ్ట్ స్మార్ట్‌ప్లే ప్రో'లో 17.78 సెం.మీ. టచ్‌స్క్రీన్‌ ఉంది. ఈ కారులో USB & బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా అందించారు. ఈ కారు టాప్-వేరియంట్‌లో రియర్‌ AC వెంట్స్‌ కూడా బిగించారు. ఈ మారుతి కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.19 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.