Bajaj Pulsar N125 discontinued in India: బజాజ్ ఆటో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆశించిన స్థాయిలో అమ్మకాలు నమోదు కాకపోవడంతో బజాజ్ పల్సర్ N125ను భారత మార్కెట్‌లో అధికారికంగా నిలిపివేసింది. 2024 అక్టోబర్‌లో ఘనంగా విడుదలైన ఈ 125cc స్పోర్ట్స్ బైక్ రెండేళ్లు కూడా పూర్తి కాకముందే భారత మార్కెట్‌కు గుడ్‌బై చెప్పడం బైక్ ప్రేమికులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ మోడల్‌కు విదేశీ మార్కెట్లలో మాత్రం విక్రయాలు కొనసాగుతుండటం విశేషం.

Continues below advertisement

కొత్త ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా డిజైన్‌పల్సర్ N125 సాధారణ పల్సర్ మోడల్ కాదు. దీని కోసం బజాజ్ పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది. కొత్త చాసిస్, కొత్త ఇంజిన్, కొత్త డిజైన్‌తో ఈ బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం 125 కిలోల కర్బ్ వెయిట్‌తో రూపొందించడం వల్ల నగర రహదారులపై చురుకైన పనితీరు అందించాలనే లక్ష్యంతో దీనిని తయారు చేశారు. తక్కువ బరువు కారణంగా హ్యాండ్లింగ్ కూడా మరింత మెరుగ్గా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

డిజైన్ పరంగా పల్సర్ N125 ఇతర బైక్‌లతో పోలిస్తే భిన్నంగా కనిపించింది. సన్నగా & పొడవుగా ఉండే స్టైలింగ్‌ను బజాజ్ ఎంచుకుంది. అయితే ఇదే అంశం భారత వినియోగదారులను పెద్దగా ఆకట్టుకోలేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా హీరో ఎక్స్‌ట్రీమ్ 125R, హోండా CB125 హార్నెట్ వంటి ప్రత్యర్థి బైక్‌లు భారీ ఆకృతి & స్పోర్టీ లుక్‌తో యువతను ఆకర్షించడంతో పల్సర్ N125 వెనుకబడింది.

Continues below advertisement

ఇది కూడా చదవండి: జులై 2026 కార్ లాంచ్‌లు ఇవే - మారుతి, హోండా, స్కోడా, MG కొత్త కార్లపై భారీ అంచనాలు

ఈ బైక్‌లో 124.59cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 12 PS పవర్ & 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకారం ఈ బైక్ 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ఠ వేగం 97 కిలోమీటర్లుగా ప్రకటించినప్పటికీ స్పీడోమీటర్‌పై 110 కిలోమీటర్లకు పైగా వేగం కనిపిస్తుందని యూజర్ల అనుభవాలు సూచిస్తున్నాయి. లీటరుకు సుమారు 60 కిలోమీటర్ల మైలేజ్ అందించడం కూడా దీని ప్రత్యేకతల్లో ఒకటి.

రైడర్ల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని 795 మిల్లీమీటర్ల సీటు ఎత్తు & 198 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్‌ను బజాజ్ అందించింది. దీంతో స్పీడ్ బ్రేకర్లు, గుంతలు ఉన్న నగర రహదారులపై కూడా సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం లభిస్తుంది.

ఎందుకు నిలిపేస్తున్నారు?ఫీచర్ల విషయంలో పల్సర్ N125 ప్రత్యర్థుల కంటే వెనుకబడింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని 125cc బైక్‌లలో TFT డిస్‌ప్లే, ABS వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉండగా, పల్సర్ N125లో ఇవి లేకపోవడం కూడా అమ్మకాలపై ప్రభావం చూపిందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ బైక్ వివరాలు బజాజ్ భారత వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నప్పటికీ డీలర్లకు కొత్త స్టాక్ పంపిణీని కంపెనీ నిలిపివేసినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: ఏ కాంపాక్ట్ SUVకి లేని శక్తితో వచ్చిన టాటా సియరా EV!బేసిక్‌, టాప్‌ వేరియంట్‌ ధరలు ఎలా ఉన్నాయి?

పల్సర్ N125ను రెండు వేరియంట్‌లలో విక్రయించారు. LED Disc BT వేరియంట్ & LED Disc వేరియంట్‌ల ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.91,690 నుంచి రూ.93,160 మధ్య ఉన్నాయి. ఆన్‌రోడ్ ధర రాష్ట్రాన్ని బట్టి సుమారు రూ.1.03 లక్షల నుంచి రూ.1.14 లక్షల వరకు ఉండేది.

భారత్‌లో విక్రయాలు నిలిచిపోయినప్పటికీ నేపాల్, పెరూ, కొలంబియా & మొరాకో వంటి పలు అంతర్జాతీయ మార్కెట్లలో పల్సర్ N125 అందుబాటులోనే ఉంటుంది. భవిష్యత్తులో కొత్త డిజైన్, మరిన్ని ఆధునిక ఫీచర్లతో ఇదే ప్లాట్‌ఫారమ్‌పై మరో కొత్త మోడల్‌ను బజాజ్ భారత్‌లో ప్రవేశపెడుతుందా లేదా అన్నది మాత్రం ఇప్పటికి స్పష్టత లేదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.