Bajaj Platina 100 : భారతదేశం అంటేనే గ్రామీణ జనాభా ఎక్కువగా ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు ఇప్పటికీ ఒక సవాలుగానే ఉన్నాయి. కఠినమైన రోడ్లు, ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం, వీటన్నింటికీ మించి పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడిని అందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో గ్రామీణ రైతులు, చిన్న వ్యాపారుల పాలిట బజాజ్ ప్లాటినా 100 ఒక ఆశాకిరణంగా నిలుస్తోంది. తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వీలుండటమే ఈ బైక్ విజయ రహస్యం.
భారతీయ మోటార్ సైకిల్ మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా నగరాల శివార్లలో, గ్రామాల్లో నివసించే వారు ఒక బైక్ కొనేటప్పుడు ప్రధానంగా చూసేది ధర, మెయింటెనెన్స్. ఈ అవసరాలను గుర్తించిన బజాజ్ ఆటో సంస్థ, ఎన్నో ఏళ్లుగా ప్లాటినా సిరీస్‌ను నిలకడగా కొనసాగిస్తోంది.ఇది కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, లక్షలాది మంది రోజువారీ జీవనోపాధిని ఇచ్చే నమ్మకమైన భాగస్వామి.
పోటీని తట్టుకుని నిలకడగా....
ప్రస్తుతం 100సీసీ సెగ్మెంట్‌లో హీరో స్ప్లెండర్ ప్లస్, హోండా షైన్, టీవీఎస్ స్పోర్ట్ వంటి దిగ్గజ మోడళ్లు ప్లాటినాకు గట్టి పోటీ ఇస్తున్నాయి. అయినప్పటికీ, కేవలం మైలేజ్ అనే అంశాన్ని అస్త్రంగా చేసుకొని ప్లాటినా 100 తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గ్రామీణ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా దీనిని రూపొందించడం వల్ల, వినియోగదారులు దీనికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ధర, కలర్స్ ఎంపిక
సామాన్యుడికి అందుబాటులో ఉండేలా బజాజ్ ప్లాటినా 100 ఎక్స్-షోరూమ్ ధరను 65,407గా నిర్ణయించారు. అయితే ఆన్‌రోడ్ ధర విషయానికి వస్తే ఆర్టీవో ఛార్జీలు , ఇన్సూరెన్స్ వంటి అంశాల వల్ల ఇది 70000 నుంచి 75,000 మధ్యలో లభిస్తుంది. వినియోగదారల అభిరుచులకు అనుగుణంగా ఇది బ్లాక్, రెడ్ బ్లూ, సిల్వర్ రంగుల్లో లభ్యమవుతుంది.
సాంకేతిక సామర్థ్యం
ఈ బైక్‌లో 102 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇది 7.9 పీఎస్ గరిష్ట పవర్‌ను, 8.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ బైక్ వేగంగా వెళ్లడం కోసం తయారు చేయలేదు. స్థిరమైన ప్రయాణం, ఆర్థికంగా లాభదాయకమైన రైడింగ్ దీని ప్రధాన లక్ష్యం. నగరాల్లోని ట్రాఫిక్‌లో గానీ, గ్రామీణ మట్టి రోడ్లపైగానీ ఈ ఇంజిన్ పనితీరు చాలా సంతృప్తికరంగా ఉంటుంది.
రైడింగ్ అనుభవం- తేలికైన ప్రయాణం
కేవలం 117 కిలోగ్రాముల బరువు ఉండం వల్ల ప్లాటినా 100ను నడపడం చాలా సులభం. ట్రాఫిక్‌లో దూసుకుపోవాలన్నా, లేదా కొత్తగా బైక్ నేర్చుకునే వారికైనా ఈ తక్కువ బరువు ఒక వరంగా మారుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఎగుడుదిగుడు రోడ్లపై నియంత్రణ కోల్పోకుండా ప్రయాణించడానికి ఇది సహకరిస్తుంది.
భద్రత- గ్రౌండ్ క్లియరెన్స్
గ్రామీణ రోడ్లపై ప్రయాణించేటప్పుడు అకస్మాత్తుగా గుంతలు లేదా ఇతర ఆటంకాలు ఎదురవుతుంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని బజాజ్ ఈ బైక్‌కు 200mm గ్రౌండ్‌క్లియరెన్స్‌ను అందించింది. అలాగే భద్రత కోసం డ్రమ్ బ్రేక్ సెటప్‌తోపాటు యాంటీ స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. పెద్దగా హై టెక్ ఫీచర్లు లేకపోయినా, ప్రాథమిక భద్రత విషయంలో రాజీ పడలేదని స్పష్టమవుతుంది.
మైలేజ్ అద్భుతం
ఈ బైక్ అతి పెద్ద ఆకర్షణ దాని మైలేజ్. 11లీటర్ల ప్యూయల్ ట్యాంక్ సామర్థ్యం కలిగిన ప్లాటినా 100 ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే దాదాపు 800 కిలోమీటర్లు వరకు ప్రయాణించే అవకాశం ఉందని మార్కెట్ నివేదికలు చెబుతున్నాయి. పెట్రోల్ బంకలు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ఇది పెద్ద ఊరట. తక్కువ ఇంధన వినియోగం వల్ల నెలవారీ బడ్జెట్‌పై భారం తగ్గుతుంది.
ఫీచర్లు- సరళమైన డిజైన్
డిజైన్ పరంగా ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇందులో డే టైమ్ రన్నింగ్ లైట్, స్పీడో మీటర్, ఫ్యూయల్ గేజ్, టాకో మీటర్ వంటి అవసరమైన ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుడికి అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని ఇవి స్పష్టంగా అందిస్తాయి.
ప్రజలపై ప్రభావం- ఆర్థిక వెసులుబాటు
ప్లాటినా 100 అనేది కేవలం ఒక రవాణా సాధనం మాత్రమే కాదు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులకు, వ్యవసాయ పనులకు ఇదొక విలువై ఆస్తి, పెట్లోల్ ఖర్చులు పెరుగుతున్న ఈకాలంలో సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ఎక్కువ దూరం తీసుకెళ్లే శక్తి దీనికి ఉంది. ఒకేసారి డబ్బు చెల్లించలేని వారి కోసం సులభమైన ఈఎంఐ ఫైనాన్స్ ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఆధునిక ఫీచర్లు కంటే నమ్మకమైన ఇంజిన్, తక్కువ నిర్వహణ వైపే మొగ్గు చూపుతున్న వినియోగదారులకు ప్లాటినా 100 మంచి ఛాయిస్.