Bajaj NS400Z vs KTM 390 Duke A Detailed Comparison: ఇండియ‌న్ మోటార్ సైకిల్ మార్కెట్లో ప్రస్తుతం 350 సీసీ లోపు బైక్‌లకు మంచి డిమాండ్ పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం 350 సీసీ లోపు ఇంజిన్ సామర్థ్యం ఉన్న వాహనాలపై జీఎస్‌టీ (GST) రేటును 18 శాతానికి తగ్గించడమే. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి బజాజ్ ఆటో తన పాపులర్ మోడల్స్ ఇంజిన్ సైజును మారుస్తోంది. ఇటీవలే బజాజ్ తన సరికొత్త 'ఎన్ఎస్400జెడ్' (NS400Z) ను మార్కెట్లోకి తీసుకురాగా, కేటీఎమ్ కూడా తన 390 డ్యూక్ లో 350 సీసీ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. మీరు ఈ రెండు బైక్‌లలో ఏదో ఒకటి కొనాలని ఆలోచిస్తుంటే, వాటి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు తెలుసుకోవడం చాలా అవసరం.

ఇంజిన్ - పర్ఫార్మెన్స్..బజాజ్ ఎన్ఎస్ 400జెడ్ ఇప్పుడు 349.13 సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది గతంలో ఉన్న 373 సీసీ యూనిట్ స్థానంలో వచ్చింది. ఈ ఇంజిన్ 9,000 rpm వద్ద 40 hp పవర్, 7,500 rpm వద్ద 33.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, కొత్త 350 సీసీ ఇంజిన్‌తో వస్తున్న కేటీఎమ్ 390 డ్యూక్ గరిష్టంగా 41.5 hp పవర్, 33.5 Nm టార్క్‌ను అందిస్తుంది. పవర్ విషయంలో కేటీఎమ్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

అత్యాధునిక ఫీచర్లు..ఫీచర్ల పరంగా చూస్తే బజాజ్ ఎన్ఎస్ 400జెడ్ లో రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్-రోడ్ అనే నాలుగు ఏబీఎస్ రైడ్ మోడ్స్ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్ ఫోర్-వే సెలక్షన్ స్విచ్ వంటి ఫీచర్లు దీని సొంతం. కేటీఎమ్ 390 డ్యూక్ విషయానికి వస్తే, ఇందులో 5-అంగుళాల టీఎఫ్‌టీ డ్యాష్ డిస్‌ప్లే ఉంటుంది. మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ (MTC), లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, రైడ్-బై-వైర్, క్విక్‌షిఫ్టర్+, సూపర్‌మోటో ఏబీఎస్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఇందులో లభిస్తాయి. ఫీచర్ల పరంగా కేటీఎమ్ కొంచెం ఎక్కువ అడ్వాన్స్‌డ్‌గా ఉంది.

హార్డ్‌వేర్ - బాడీ డిజైన్..బజాజ్ బైక్ 43 మిమీ యూఎస్‌డీ ఫ్రంట్ సస్పెన్షన్, ఆరు రకాల అడ్జస్ట్‌మెంట్ ఉన్న రియర్ మోనోషాక్ కలిగి ఉంటుంది. దీని బరువు 174 కిలోలు కాగా, సీటు ఎత్తు 807 మిమీ ఉంటుంది. 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ దీనికి అదనపు బలం. కేటీఎమ్ 390 డ్యూక్ లో 320 మిమీ ఫ్రంట్ డిస్క్, 240 మిమీ రియర్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 183 మిమీ ఉండటం వల్ల గుంతల రోడ్లపై కూడా సులభంగా వెళ్లవచ్చు. దీని బరువు కేవలం 168.3 కిలోలు మాత్రమే ఉండటం వల్ల డ్రైవింగ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. 15 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఉండటం వల్ల లాంగ్ రైడ్స్ కు ఇది అనుకూలంగా ఉంటుంది.

ప్రైస్ వేరియేష‌న్..ఈ రెండు బైక్‌ల మధ్య అసలైన తేడా ధర దగ్గరే కనిపిస్తుంది. బజాజ్ ఎన్ఎస్ 400జెడ్ ప్రారంభ ధర రూ. 1.94 లక్షలు (ఎక్స్‌షోరూమ్) గా ఉంది. అదే సమయంలో కేటీఎమ్ 390 డ్యూక్ 350 సీసీ వేరియంట్ ధర రూ. 2.77 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. అంటే కేటీఎమ్ తో పోలిస్తే బజాజ్ బైక్ దాదాపు రూ. 83,000 తక్కువ ధరకే లభిస్తోంది. కేటీఎమ్ తన 399 సీసీ మోడల్ కంటే ఈ కొత్త వెర్షన్ ధరను రూ. 62,000 వరకు తగ్గించడం విశేషం. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ పవర్ కావాలనుకునే వారికి బజాజ్ ఎన్ఎస్400జెడ్ బెస్ట్ ఆప్షన్ కాగా, ప్రీమియం ఫీచర్లు, బ్రాండ్ వాల్యూ కోరుకునే వారికి కేటీఎమ్ 390 డ్యూక్ సరైన ఎంపిక అని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.