Bajaj Dominar 400 Vs Triumph Speed 400: ఇండియాలో 350సీసీ మోటార్ సైకిల్ విభాగం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. బజాజ్ ఆటో తన పాపులర్ మోడల్ డోమినార్ 400ను 350సీసీ ఇంజిన్‌తో లాంచ్ చేయగా, బజాజ్ భాగస్వామ్యంతో నడుస్తున్న ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ కూడా తన 350సీసీ లైనప్‌ను మార్కెట్లోకి తెచ్చింది. రూ. 2 లక్షల బడ్జెట్‌లో బైక్ కొనాలనుకునే వారికి ఇప్పుడు డోమినార్ 400, ట్రయంఫ్ స్పీడ్ 400 రూపంలో రెండు అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే డోమినార్ పక్కా టూరింగ్ బైక్ కాగా, ట్రయంఫ్ స్పీడ్ 400 ఒక రెట్రో రోడ్‌స్టర్ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రెండింటిలో ఏది మీకు సెట్ అవుతుందో తెలుసుకుందాం.
ఇంజిన్ - పర్ఫార్మెన్స్..బజాజ్ డోమినార్ 400 ఇప్పుడు 349 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 40.6 హెచ్‌పి పవర్, 33.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు ట్రయంఫ్ స్పీడ్ 400లోని 350సీసీ పవర్‌హౌస్ 37 హెచ్‌పి పవర్, 32 ఎన్ఎమ్ టార్క్‌ను ఆఫర్ చేస్తోంది. పవర్ విషయంలో డోమినార్ కొంచెం పైచేయి సాధించింది. రెండు బైక్‌లు కూడా 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్మూత్ రైడింగ్ అనుభవాన్ని ఇస్తాయి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
హార్డ్‌వేర్ - ఫీచర్లు..ఇంజిన్ సీసీ తగ్గించినప్పటికీ, డోమినార్ 400 తన పాత హార్డ్‌వేర్‌ను అలాగే కొనసాగిస్తోంది. ఇందులో 43 మిమీ యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపు అడ్జస్టబుల్ మోనో-షాక్ ఉన్నాయి. 193 కేజీల బరువుతో ఉండే ఈ బైక్ హైవేలపై లాంగ్ రైడ్స్ వెళ్లే వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా భారీగా కనిపిస్తుంది. దీనికి భిన్నంగా ట్రయంఫ్ స్పీడ్ 400 తేలికపాటి ఛాసిస్‌తో వస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 164 మిమీ ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్‌లో నడపడం చాలా సులభం. దీని రెట్రో లుక్ క్లాసిక్ బైక్స్ ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ధరల వివరాలు..ధర విషయంలో బజాజ్ డోమినార్ 400 చాలా అగ్రెసివ్‌గా ఉంది. దీని ధర రూ. 2.03 లక్షల (ఎక్స్‌షోరూమ్) వద్ద లభిస్తోంది. అదే సమయంలో ట్రయంఫ్ స్పీడ్ 400 ప్రారంభ ధర రూ. 2.31 లక్షల (ఎక్స్ షోరూమ్) గా ఉంది. అంటే డోమినార్ కంటే ట్రయంఫ్ సుమారు రూ. 28,000 ఖరీదైనది.
మీకు ఏది బెస్ట్?మీరు తరచుగా లాంగ్ ట్రిప్స్ వెళ్లే వారైతే, హైవేపై స్టెబిలిటీ కావాలనుకుంటే తక్కువ ధరలో లభించే బజాజ్ డోమినార్ 400 ఉత్తమమైన ఎంపిక. దీని టూరింగ్ సెటప్ లాంగ్ ప్రయాణాల్లో అలసట లేకుండా చూస్తుంది. అలాకాకుండా మీకు ఒక ప్రీమియం బ్రాండ్ కావాలి, సిటీలో రోజూ వాడటానికి తేలికగా ఉండే బైక్ కావాలి అనుకుంటే ట్రయంఫ్ స్పీడ్ 400 వైపు మొగ్గు చూపవచ్చు. కాగా, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ (Pulsar NS400Z) లో కూడా త్వరలో ఈ 350సీసీ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. బజాజ్ తన లైనప్‌ను అప్‌డేట్ చేస్తున్న వేగం చూస్తుంటే ఈ అప్‌డేట్ అనుకున్నదానికంటే ముందే రావచ్చని విశ్లేషకులు అంటున్నారు.
