Bajaj KTM Acquisition News: 800 మిలియన్‌ యూరోల విలువ గల భారీ గ్లోబల్‌ డీల్‌ను బజాజ్ ఆటో అధికారికంగా పూర్తి చేసింది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి అన్ని అనుమతులు వచ్చాక, KTM ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. ఈ నిర్ణయం భారతీయ ఆటోమొబైల్‌ రంగానికి మాత్రమే కాదు, గ్లోబల్‌ టూవీలర్‌ మార్కెట్‌ స్ట్రక్చర్‌కే పెద్ద మార్పులు తెస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Continues below advertisement

PBAG పై బజాజ్ పూర్తి ఆధిపత్యం

బజాజ్ ఆటో ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ BV (BAIH) ద్వారా, KTM హోల్డింగ్‌ కంపెనీ అయిన Pierer Bajaj AG (PBAG) లోని మొత్తం 50,100 షేర్లను బజాజ్ కొనుగోలు చేసింది. దీంతో PBAG పై బజాజ్‌కు 100 శాతం కంట్రోల్‌ లభించింది. PIAG షేర్‌హోల్డింగ్‌ పూర్తిగా ముగిసింది, అంటే Pierer గ్రూప్‌ సంస్థకు ఈ రంగంలో పాత్ర ముగిసినట్టే.

Continues below advertisement

PMAG & KTM లోనూ కూడా బజాజ్‌కు మెజారిటీ స్టేక్‌

PBAG పూర్తిగా బజాజ్‌ చేతికి వచ్చిన వెంటనే, Pierer Mobility AG (PMAG) & KTM AG రెండూ బజాజ్ ఆటోకు స్టెప్‌డౌన్‌ సబ్సిడరీలుగా మారాయి. ప్రస్తుతం బజాజ్‌కు ఈ రెండు కంపెనీలలో 74.9% మెజారిటీ వాటా ఉంది. టూవీలర్‌ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ఇది ఒక పవర్‌ఫుల్‌ కాంబినేషన్‌గా మారింది.

ప్రక్రియ ఎలా సాగింది?

Bajaj - KTM డీల్‌ జర్నీ 2025 మే నెలలో ప్రారంభమైంది. బజాజ్, PIAGతో ఒప్పందంపై సంతకం చేయడంతో ఇది మొదలైంది. ఆ తర్వాత బజాజ్ రెండు సార్లు కాల్‌ ఆప్షన్‌ని ఉపయోగించి షేర్లను చేజిక్కించుకునే ప్రక్రియను పూర్తి చేసింది. ఈ వ్యవహారంలో ముఖ్యంగా ఈ రెండు నిర్ణయాలు కీలకం అయ్యాయి, అవి:

ఆస్ట్రియన్‌ టేకోవర్‌ కమిషన్‌ - బజాజ్‌కు తప్పనిసరి టేకోవర్‌ ఆఫర్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని క్లియర్‌ చేసింది.

యూరోపియన్‌ కమిషన్‌ నోటిఫికేషన్ - డీల్‌కు పూర్తి అనుమతి ఇచ్చింది.

ఈ రెండు ఆమోదాల తర్వాత, 18 నవంబర్‌ 2025న Bajaj - KTM డీల్‌ అధికారికంగా పూర్తయింది.

కంపెనీ పేర్లు, బోర్డుల్లో మార్పులు

KTM ను స్వాధీనం తర్వాత బజాజ్ కీలక మార్పులు చేయడం ప్రారంభించింది:

PBAG కు కొత్త పేరు: Bajaj Auto International Holdings AG

PMAG కు కొత్త పేరు: Bajaj Mobility AG

PBAG, PMAG, KTM - ఈ మూడు కంపెనీల పర్యవేక్షణ & మేనేజ్‌మెంట్‌ బోర్డులు పూర్తిగా రీడిజైన్‌ అవుతున్నాయి. కొత్త యాజమాన్యానికి అనుగుణంగా వీటి యూరప్‌, ఇండియా ఆపరేషన్లు మరింత సమగ్రంగా మారనున్నాయి.

భారత్‌కు ఏంటి ప్రయోజనం?

బజాజ్-KTM భాగస్వామ్యం గత దశాబ్దంలో భారత మార్కెట్లో యువత రైడింగ్‌ కల్చర్‌కు పెద్ద ఊపు ఇచ్చింది. డ్యూక్‌ సిరీస్‌, RC సిరీస్‌ వంటి అనేక స్పోర్ట్స్‌ బైకులు ఈ సహకార ఫలితంగానే వచ్చాయి. ఇప్పుడు పూర్తి కంట్రోల్‌ బజాజ్ తీసుకోవడంతో... 

ఇండియాలోకి కొత్త KTM మోడల్స్‌ వేగంగా రావచ్చు

స్థానిక ఉత్పత్తి పెరగవచ్చు

ధరల్లో స్థిరత్వం ఉండే అవకాశం ఉంది

గ్లోబల్‌ మార్కెట్‌లో కూడా బజాజ్–KTM మరింత బలమైన ప్లేయర్స్‌గా ఎదగవచ్చు.

బజాజ్ ఆటో ఈ డీల్‌తో గ్లోబల్‌ టూవీలర్‌ మార్కెట్లో తన శక్తిని మరింత పెంచుకున్నట్టే. KTM పై పూర్తి నియంత్రణ సాధించడం భారతీయ ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి ఒక పెద్ద స్ట్రాటజిక్‌ విజయం. కొత్త పేర్లు, కొత్త బోర్డు, కొత్త దిశ.. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు బజాజ్‌ తీరుకు సరిగ్గా సరిపోయేలా మారుతోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.