Traveller Covers 13 States Using Rs 3000 Annual Toll Pass: ఒక యువ ట్రావెలర్‌ చేసిన రోడ్ ట్రిప్‌ ఇప్పుడు దేశమంతా చర్చనీయాంశమైంది, ముఖ్యంగా సోషల్‌ మీడియా మొత్తం కోడై కూస్తోంది. ఆ ట్రావెలర్‌, 25 రోజుల్లో 13 రాష్ట్రాలు తిరిగి, 12 జ్యోతిర్లింగాలు, 4 ధామాలు సందర్శించాడు. కేవలం రూ. 3,000 విలువైన వార్షిక టోల్ పాస్‌తో తన ఆధ్యాత్మిక సాహసయాత్రను పూర్తి చేశాడు. అంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును 100 కు 200 శాతం ఉపయోగించుకున్నాడు.

వార్షిక టోల్‌ పాస్‌ను ఉపయోగించుకుని, ప్రైవేట్ వాహనాలు నేషనల్ హైవే (NH) & నేషనల్ ఎక్స్‌ప్రెస్‌ వే (NE) ఫీజ్‌ ప్లాజాల్లో మళ్లీ టోల్‌ ఫీజ్‌ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచిత ప్రయాణం చేయవచ్చు - ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్స్‌ వరకు, ఏది ముందయితే అది వర్తిస్తుంది. అంటే, ఎవరు ఎక్కువగా రోడ్లపై ప్రయాణిస్తారో, వారికి ఇది ఒక బంగారు అవకాశం. ఆ అవకాశాన్ని సదరు ట్రావెలర్‌ బాగా ఉపయోగించుకుని, వాడకం అంటే ఏంటో చూపించాడు.

ఈ ట్రావెలర్‌, తన ప్రయాణం ప్రారంభించినప్పుడు పాస్‌లో 199 ట్రిప్స్‌ మిగిలి ఉన్నాయి. 25 రోజుల తర్వాత 119 ట్రిప్స్‌ తగ్గిపోయాయి అని అతను వెల్లడించాడు. ఇంకా 80 ట్రిప్స్‌ మిగిలి ఉన్నాయని కూడా అతను చెప్పాడు. ఈ 13 రాష్ట్రాల  ప్రయాణంలో అతను మొత్తం 11,000 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేశాడు.

వార్షిక పాస్‌ తీసుకోకపోతే ఎంత ఖర్చు అవుతుంది?సాధారణంగా, వార్షిక టోల్‌ పాస్‌ తీసుకోకుండా ఇంత దూరం ప్రయాణించాలంటే టోల్‌ ఖర్చు దాదాపు రూ. 15,000 నుంచి రూ. 17,000 మధ్య ఉండేది. కానీ, వార్షిక  పాస్‌ వల్ల అతని ఖర్చు చాలా వరకు తగ్గింది. అయితే, కొన్ని రోడ్లను ఈ పాస్‌ కవర్‌ చేయకపోవడంతో (వర్తించకపోవడంతో) రూ. 2,439 అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఉదాహరణకు, “సీనిక్ రూట్‌” ‍‌(scenic route) అందాలను ఆస్వాదించే ఉద్దేశంతో అతను ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రయాణించినప్పుడు అదనంగా రూ. 1,200 టోల్‌ ఫీజ్‌ చెల్లించాడు, డీజిల్‌ కోసం మరో రూ. 2,000 ఖర్చు చేశాడు.

ఇతర టోల్స్‌:

తమిళనాడులో ఓషో రోడ్‌ - రూ. 300

సమృద్ధి మార్గ్‌ - రూ. 240

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే - రూ. 250

“25 రోజుల్లో నా టోల్ పాస్ నుంచి 119 ట్రిప్స్ మైనస్! 12 జ్యోతిర్లింగాలు, 4 ధామాలు. సొలో రోడ్‌ ట్రిప్‌!” అని ఆ ట్రావెలర్‌, తన ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌లో క్యాప్షన్‌ రాశాడు.

సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ అయింది. యూజర్ల నుంచి ప్రశంశల జల్లు, కామెంట్ల వర్షం కురిసింది. “25 రోజుల్లో 11,000 కిలోమీటర్లు కవర్ చేయడం నిజంగా అద్భుతమని, ఇది కేవలం ప్రయాణం కాదు, ఆధ్యాత్మిక యాత్ర" అని చాలా మంది మెచ్చుకున్నారు.

మన దేశంలో, వార్షిక టోల్ పాస్‌ను కేంద్ర మంత్రి మంత్రి నితిన్ గడ్కరీ గత నెలలో ప్రారంభించారు. తరచూ హైవేలపై ప్రయాణం చేసే ప్రైవేటు కార్లు, జీపులు, వ్యాన్‌ యజమానులకు టోల్‌ ఫీజుల్లో డబ్బు ఆదా చేసుకునేందుకు వార్షిక టోల్ పాస్‌ను ప్రవేశపెట్టారు. 

ఈ యువ ట్రావెలర్‌ చూపించిన విధంగా సరైన ప్రణాళిక, తక్కువ ఖర్చుతో, దేశంలోని ఆధ్యాత్మిక & సాంస్కృతిక ప్రదేశాలను ఒకే రోడ్ ట్రిప్‌లో ఎంజాయ్‌ చేయడం సాధ్యమే. మరి, మీరు కూడా వచ్చే సెలవుల్లో “మీ టోల్ పాస్ ట్రిప్” ప్లాన్‌ చేస్తారా?.