Dreadnought SUV for Call Of Duty game: ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ అభిమానులకు 'ఆస్టన్ మార్టిన్' (Aston Martin) అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రముఖ వీడియో గేమ్ ‘కాల్ ఆఫ్ డ్యూటీ: మోడ్రన్ వార్‌ఫేర్ 4’ ‍‌(Call of Duty: Modern Warfare 4) కోసం ప్రత్యేకంగా రూపొందించిన డ్రెడ్‌నాట్ (Dreadnought) పేరుతో మిలిటరీ స్టైల్ 4x4 SUVని కంపెనీ ఆవిష్కరించింది. ఇది నిజ జీవితంలో రోడ్లపై నడిచే కారు కాదు. పూర్తిగా డిజిటల్ ప్రపంచం కోసం రూపొందించిన వర్చువల్ SUV. అక్టోబర్ 23న గేమ్ విడుదలైన తర్వాత ‘DMZ’ & ‘Warzone’ మోడ్‌లలో ఈ వాహనాన్ని గేమర్లు డ్రైవ్‌ చేయవచ్చు.

Continues below advertisement

ఈ ప్రత్యేక SUVని కాల్ ఆఫ్ డ్యూటీ డెవలపర్లు & పబ్లిషర్లతో కలిసి ఆస్టన్ మార్టిన్ రూపొందించింది. ప్రస్తుతం దీని పూర్తి పరిమాణ మోడల్‌ను (డమ్మీ మోడల్‌) అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరుగుతున్న Fanatics Festలో ప్రజల ప్రదర్శన కోసం ఉంచారు.

‘డ్రెడ్‌నాట్’ అనే పేరు బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన చారిత్రాత్మక HMS Dreadnought యుద్ధనౌక నుంచి స్ఫూర్తితో తీసుకున్నారు. ఈ పదానికి "ఏదికీ భయపడని వ్యక్తి" అని అర్థం. అదే భావనకు అనుగుణంగా ఈ SUVకి పూర్తిగా మిలిటరీ లుక్‌ అందించారు.

Continues below advertisement

బయటి డిజైన్ పరంగా చూస్తే డ్రెడ్‌నాట్ చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. చిల్టెర్న్ గ్రీన్ రంగుతో రూపొందించిన ఈ రెండు డోర్ల SUVలో మిలిటరీ గ్రేడ్ ఆర్మర్ ప్లేటింగ్, భారీ ఆఫ్ రోడ్ టైర్లు, పెద్ద డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, చతురస్రాకార వీల్ ఆర్చ్‌లు & ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఇది కూడా చదవండి: కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష

ముందు భాగంలో ఫ్యూచరిస్టిక్ LED హెడ్‌లైట్లు, పిక్సెల్ డిజైన్ గ్రిల్, LED ఫాగ్ ల్యాంప్స్, సిల్వర్ టో హుక్స్ & స్కిడ్ ప్లేట్ ఉన్నాయి. పక్క భాగంలో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, కెమెరా ఆధారిత ORVMలు, సిల్వర్ సైడ్ స్టెప్స్ కనిపిస్తాయి. వెనుక భాగంలో Valour మోడల్‌ను గుర్తు చేసే ఏరోడైనమిక్ ఫిన్స్, మల్టిపుల్ LED టెయిల్ ల్యాంప్స్, క్వాడ్ ఎగ్జాస్ట్ సెటప్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ & టో హుక్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.

Autocar UK వివరాల ప్రకారం, ఈ SUV పొడవు 5 మీటర్ల కంటే కొద్దిగా తక్కువగా ఉండగా, వెడల్పు 2.1 మీటర్లు ఉంటుంది. ఇది ఆస్టన్ మార్టిన్ DBX కంటే కొద్దిగా చిన్నదిగా ఉంటుంది.

లోపలి భాగంలో కూడా ఆఫ్ రోడ్ & మిలిటరీ థీమ్‌ను కొనసాగించారు. గ్రీన్ & బ్లాక్ కలర్ కాంబినేషన్‌తో పాటు గోల్డెన్ హైలైట్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. రెండు స్పోక్ స్టీరింగ్ వీల్‌పై ఫిజికల్ బటన్లు ఉన్నాయి. డ్రైవర్ ముందు రెండు వృత్తాకార డిజిటల్ డిస్‌ప్లేలు స్పీడోమీటర్ & RPM వివరాలను చూపిస్తాయి.

డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఉన్న పెద్ద టచ్‌స్క్రీన్ ప్రయాణికుడి వైపు వరకు విస్తరించి ఉంటుంది. ఇందులో ఆఫ్ రోడ్ గణాంకాలతో పాటు గేమ్‌లో ఉపయోగించే వెపన్స్ & కిల్ స్ట్రీక్స్ మెనూలు కూడా కనిపిస్తాయి. కార్బన్ ఫైబర్ సెంటర్ కన్సోల్, గోల్డెన్ గేర్ లీవర్, కప్ హోల్డర్లు, ఫిజికల్ కంట్రోల్స్ & ఆకుపచ్చ లెదర్ సీట్లు ఇంటీరియర్‌కు ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త అప్‌డేట్‌ - కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన 6 విషయాలు ఇవే!

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇది వర్చువల్ వాహనం అయినప్పటికీ, Vanquish GTలో ఉపయోగించే 5.2 లీటర్ ట్విన్ టర్బో V12 ఇంజిన్‌ను ఆధారంగా తీసుకుని రూపొందించారు. ఈ ఇంజిన్ 835hp పవర్‌ & 1,000Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.3 సెకన్లలో అందుకోగలదని, గరిష్ట వేగం గంటకు 345 కిలోమీటర్లని కంపెనీ పేర్కొంది.

ప్రస్తుతం డ్రెడ్‌నాట్ పూర్తిగా వర్చువల్ వాహనంగానే అందుబాటులోకి రానున్నప్పటికీ, భవిష్యత్తులో దీనిని నిజ జీవిత రోడ్ల కోసం కూడా తయారు చేసే అవకాశం ఉందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆస్టన్ మార్టిన్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ మారెక్ రైచ్‌మన్ మాట్లాడుతూ, దీన్ని కేవలం డిజిటల్ కాన్సెప్ట్‌గా కాకుండా వాస్తవ ప్రపంచంలో కూడా ఉపయోగించగల వాహనంగా ఊహించి రూపొందించినట్లు చెప్పారు. వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తే కంపెనీ ప్రత్యేక ఆర్డర్‌పై నిజమైన డ్రెడ్‌నాట్‌ను కూడా తయారు చేసే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఈ ప్రత్యేక SUVని అక్టోబర్ 23 నుంచి 'కాల్ ఆఫ్ డ్యూటీ: మోడ్రన్ వార్‌ఫేర్ 4'లో మాత్రమే ఆస్వాదించవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.