Fact Check On Ethanol News: ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల తమ వాహనాలు దెబ్బతింటున్నాయని, ఫ్యూయల్ ట్యాంక్‌లో నీరు చేరడం వల్ల తీవ్రమైన సమస్యలు వస్తున్నాయని చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం తన నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నట్లు చూపిస్తున్న ఒక పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీని వెనుక ఉన్న పూర్తి వాస్తవాలను ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అసలు విషయం ఏమిటి?
వైరల్ అవుతున్న పోస్టర్‌లో నితిన్ గడ్కరీ ఫోటోతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపులు ఇప్పుడు పెట్రోల్‌లో 15 నుంచి 20 శాతం ఇథనాల్‌ను కలుపుతున్నాయని పేర్కొన్నారు. ఇథనాల్ నీటిలో కరుగుతుంది, కాబట్టి ఫ్యూయల్ ట్యాంక్‌లో నీరు, తేమ చేరితే సమస్యలు తలెత్తవచ్చు. ఈ సమస్యను నివారించడానికి, ట్యాంక్‌ను క్లీన్ చేసేటప్పుడు మీ వాహనాన్ని కడిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి; లేకపోతే, బాధ్యత మాది కాదు. ఈ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల జర్క్స్ కూడా వస్తున్నాయని కూడా ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు.
ట్వీట్ వైరల్ అవుతోంది.
ఈ పోస్టర్‌తో పాటు, ఒక X అకౌంట్ యూజర్ చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. అందులో, ఇకపై ప్రయాణికుడే తన బైక్ రిపేర్‌కు బాధ్యత వహించాలని రాసి ఉంది. ఇథనాల్‌పై రోజూ వస్తున్న ఫిర్యాదులతో విసిగిపోయిన గడ్కరీజీ, చివరకు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అన్ని పెట్రోల్ పంపుల వద్ద ఈ-20 కలిపిన పెట్రోల్ వాడకంపై హెచ్చరికలు పెట్టారు. ఇప్పుడు చెప్పండి, ఇథనాల్ వాహనాలను దెబ్బతీస్తోందని ప్రభుత్వానికి తెలుసు, అయినా దానిని బలవంతంగా విధించింది. ప్రజల పట్ల ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదా? అని ఉంది.
వాస్తవం ఏంటంటే?
అధికారిక X హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన ఒక ప్యాక్ట్ చెక్‌లో, రిటైల్ పెట్రోల్ అవుట్‌లెట్ల వద్ద ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయలేదని PIB పేర్కొంది. ఆ వార్త, పోస్టర్ అవాస్తవమని స్పష్టం చేసింది. ఇథనాల్-మిశ్రిత పెట్రోల్ BIS ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని, ఇథనాల్, పెట్రోల్ పూర్తిగా కరుగుతాయని, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఇంధనం విడిపోదని లేదా పొరగా ఏర్పడదని కూడా PIB తన పోస్ట్‌లో పేర్కొంది.
జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
PIB ప్రకారం, ఈ ఆధునిక వాహనాలలో ఇంధన ట్యాంక్‌లోకి నీరు ప్రవేశించకుండా నిరోధించే ఫీచర్లు, భద్రతా చర్యలు అమర్చి ఉన్నాయి. E20 పెట్రోల్ విడుదలైనప్పటి నుంచి, ఇథనాల్ కలపడం వల్ల ఇంజిన్ వైఫల్యం లేదా వాహనం ఆగిపోయిన కేసులు ఏవీ నమోదు కాలేదు.
వాహనదారులు ఈ విషయంలో ఎలాంటి టెన్షన్ పడొద్దని, జరుగుతున్నది తప్పుడు ప్రచారమని కేంద్రం స్పష్టం చేసింది. E20 ఇంధనం వల్ల మీ వాహనానికి వచ్చిన ప్రమాదం ఏం లేదని తేల్చి చెప్పింది. నిరభ్యంతరంగా ఆ పెట్రోల్‌ను ఫిల్ చేసుకోవచ్చని కూడా భరోసా ఇచ్చింది. సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి విషయాన్ని నమ్మొద్దని ఏదైనా ఉంటే అధికారికంగా తెలియజేస్తామని వెల్లడించింది.
