Klein Vision AirCar Price And Launching Date: అప్పుడెప్పుడో 36 ఏళ్ల క్రితం, 1989 మార్చిలో, 'బామ్మ మాట బంగారు బాట' సినిమా రిలీజ్‌ అయింది. ఆ సినిమాలో చూపించిన కార్‌ రోడ్డుపై పరిగెడుతుంది, విమానంలా గాల్లోనూ ఎగురుతుంది. కారు గాల్లో ఎగురుతుంటే, కింద ఉన్న ప్రజలంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తుంటారు. ఇది పూర్తిగా కల్పితం & సినిమా కథ అయినప్పటికీ, కార్‌లను గాలిపటంలా గాల్లో ఎగిరించడంపై చాలా ఏళ్లుగా సీరియస్‌గా రీసెర్చ్‌ జరుగుతోంది.

టెక్నాలజీ మారిన తర్వాత, ఈ మధ్యకాలంలో, కార్‌లకు బదులు మనుషులను సులువుగా మోసుకెళ్లగల డ్రోన్‌లను తయారు చేయడం మొదలు పెట్టారు. డ్రోన్‌ల విషయంలో చాలావరకు విజయం సాధించినప్పటికీ, ఎగిరే కార్లపై జనంలో క్రేజ్ మాత్రం తగ్గలేదు. చాలా ఆటోమొబైల్ కంపెనీలు ఎగిరే కార్లపై ఇప్పటికీ నిరంతరం పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, స్లోవేకియాకు చెందిన స్టార్టప్ కంపెనీ "క్లైన్‌ విజన్‌", తన తొలి ఎగిరే కారు గురించి ప్రపంచానికి వెల్లడిచించింది. ఆ కారు పరీక్షల దశ దాటుకుని ఉత్పత్తికి సిద్ధంగా ఉందని చెబుతూ, కార్‌ నమూనాను విడుదల చేసింది. ఎగిరే కార్‌ను పూర్తి స్థాయిలో వచ్చే ఏడాది నాటికి మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు క్లైన్‌ విజన్‌ తెలిపింది. 

క్లైన్‌ విజన్‌, ఎయిర్ కార్‌ కలను నిజం చేయడానికి ఇది గత 30 సంవత్సరాలుగా తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రారంభం నుంచి ప్రొడక్షన్ రెడీ మోడల్ వరకు, 170కి పైగా ఫ్లయింగ్ అవర్స్ & 500కి పైగా టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు పూర్తి చేసింది. 2022 సంవత్సరంలో, ఈ ఎయిర్‌ కార్ మోడల్‌కు ఫ్లయింగ్ సర్టిఫికేట్ దక్కించుకుంది. అంటే, ఈ కార్‌ను విమానంలా గాల్లో నడపడానికి అనుమతులు పొందింది.

ఎయిర్ కార్ ధర ఎంత ఉంటుంది? క్లైన్‌ విజన్‌ ఎయిర్‌ కార్ వచ్చే ఏడాది గ్లోబల్‌ మార్కెట్లోకి విడుదల కానుంది. కంపెనీ ప్రతినిధి వెల్లడించిన ప్రకారం, ఎగిరే కారు ధర 8 లక్షల నుంచి 10 లక్షల అమెరికన్‌ డాలర్లు (USD) డాలర్లు ఉంటుంది. భారతీయ కరెన్సీలో మార్చి చెప్పుకుంటే, ఈ ధర దాదాపు రూ. 6.78 కోట్ల నుంచి రూ. 8.47 కోట్ల వరకు ఉంటుంది. 

 కన్వర్టబుల్ కారుఎయిర్‌ కార్‌ అంటే పూర్తిగా గాల్లో మాత్రమే ప్రయాణిస్తుందని కాదు. ఇది కన్వర్టబుల్ కారు. అంటే, దీనిని సాధారణ కారు తరహాలో రోడ్డుపై సులభంగా డ్రైవ్‌ చేయవచ్చు. అవసరమైన సమయంలో విమానంలా మార్చి రివ్వున ఎగిరిపోవచ్చు. ఇక్కడ చెప్పుకోవాల్సిన పెద్ద విశేషం ఏంటంటే.. ఈ కన్వర్టబుల్ వెహికల్‌ కార్‌ నుంచి విమానంలా మారడానికి కేవలం 2 నిమిషాల సమయం చాలు.

క్లైన్‌ విజన్‌ ఎయిర్‌ కార్ వేగం ఎంత? ఎయిర్‌ కార్ సిస్టమ్‌ మొత్తం ఆటోమేటిక్‌గా పని చేస్తుంది. క్లైన్‌ విజన్‌ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఎయిర్‌ కార్ తాజా వేరియంట్ రోడ్డు మీద గంటకు 200 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది విమానంలా గాల్లోకి లేచిందంటే కార్‌ను అంతకుమించిన వేగాన్ని అందుకుంటుంది. గాలిలో, గంటకు 250 కి.మీ. స్పీడ్‌తో రాకెట్‌లా రివ్వున దూసుకెళుతుంది & గాలితోనే పోటీ పడుతుంది. ఉదాహరణకు, తెలుగు రాష్ట్రాల్లో ఏ వ్యక్తయినా క్లైన్‌ విజన్‌ ఎయిర్‌ కార్‌ సొంతం చేసుకున్నాడంటే, ఆ కారులో వాయు మార్గంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లడానికి కేవలం గంట సమయం చాలు. గాల్లోకి ఎగిరిన తర్వాత ట్రాఫిక్‌ చిక్కుముళ్లు, రోడ్డు మలుపులతో సంబంధం లేకుండా ముక్కుసూటిగా ముందుకే దూసుకెళ్లవచ్చు కాబట్టి, గంటకు 250 కి.మీ. స్పీడ్‌తో గంటలోపే హైదరాబాద్‌ నుంచి విజయవాడ చేరుకునే అవకాశం కూడా ఉంది.