మీరు ఇప్పటివరకూ రోబోలు, సెల్ఫ్-డ్రైవింగ్ కార్ల గురించి వినే ఉంటారు. కానీ త్వరలో పూర్తిగా AIతో నడిచే కారు మార్కెట్లోకి వస్తోంది. కాలిఫోర్నియాకు చెందిన టెన్సర్ అనే స్టార్టప్ కంపెనీ కొత్త టెన్సర్ రోబో కార్‌ (Robo Car)ను ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేకంగా వ్యక్తిగత వినియోగం కోసం రూపొందించారు. ఇది కేవలం మార్పులు చేర్పులు చేసిన కారు కాదు, లెవెల్-4 సెల్ఫ్ డ్రైవింగ్ కారుగా తయారు చేయడానికి దీన్ని మొదట రూపొందించారు. అంటే డ్రైవర్ లేకుండానే కొన్ని పరిస్థితులలో ఇది సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటుంది.

అద్భుతమైన హార్డ్‌వేర్‌తో కారు

టెన్సర్ రోబోకార్ హై-టెక్ హార్డ్‌వేర్‌తో రూపొందించారు. దాంతో ఇది ఎలాంటి పరిస్థితిలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో 37 కెమెరాలు, 11 రాడార్లు, 5 LiDAR సెన్సార్లు, 22 మైక్రోఫోన్‌లు, 10 అల్ట్రాసోనిక్ సెన్సార్లు ఉన్నాయి. ఇవన్నీ కలిసి కారు చుట్టుపక్కల పరిస్థితులను అర్థం చేసుకోవడం, సరైన మార్గాన్ని గుర్తించడానికి.. సురక్షితంగా డ్రైవింగ్ చేయడానికి సహాయపడతాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఒక సిస్టమ్ విఫలమైతే, మరొక సిస్టమ్ వెంటనే యాక్టివేట్ అయి పని చేయడం ప్రారంభిస్తుంది. ఈ కారణంగా కారు FMVSS, IIHS టాప్ సేఫ్టీ పిక్+ వంటి గ్లోబల్ సేఫ్టీ ప్రమాణాలను అందుకోవడానికి వీలవుతుంది. 

కష్టతరమైన పరిస్థితుల్లో కూడా నావిగేట్ చేస్తుంది

టెన్సర్ రోబోకార్ యొక్క అతిపెద్ద ఆకర్షణ దాని అధునాతన AI వ్యవస్థ. ఇది నిజ సమయంలో డ్రైవింగ్ నిర్ణయాలు తీసుకునేలా శిక్షణ పొందింది. కంపెనీ ఇందులో నిపుణులైన డ్రైవర్ల డేటాను ఉపయోగించింది, తద్వారా ఇది రోడ్డుపై తక్షణమే స్పందించగలదు. మరోవైపు, ఇందులో విజువల్-లాంగ్వేజ్ మోడల్ కూడా ఉంది, ఇది క్లిష్ట పరిస్థితులను నిర్వహించగలదు. అందుకే పొగమంచు, వర్షం లేదా తక్కువ దృశ్యమానత వంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఈ కారు బాగా నడవగలదు. అలాగే, ఇందులో సెల్ఫ్-డయాగ్నోసిస్, ఆటో-పార్కింగ్, ఆటో-ఛార్జింగ్ మరియు సెన్సార్-క్లీనింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంటే కారు నడపడానికి లేదా నిర్వహించడానికి సాంకేతిక నిపుణుడి అవసరం ఉండదు.

భద్రతతో పాటు వ్యక్తిగత గోప్యతపై స్పెషల్ ఫోకస్ 

నేటి కాలంలో డేటా ప్రైవసీ చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని, టెన్సర్ రోబోకార్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇందులో మీ వ్యక్తిగత డేటా, అంటే లొకేషన్, డ్రైవింగ్ మాడ్యుల్స్ క్లౌడ్‌లో సేవ్ అవ్వవు. కానీ కారులోనే ప్రాసెస్ అవుతాయి. దీనివల్ల డేటా లీక్ అయ్యే అవకాశం లేదు. అదనంగా, కారులో అమర్చిన కెమెరాలకు ఫిజికల్ కవర్లు, మైక్రోఫోన్‌లకు ఆన్-ఆఫ్ స్విచ్‌లు ఇచ్చారు. ఈ ఫీచర్లు వినియోగదారుల ప్రైవసీపై పూర్తి నియంత్రణ చేస్తాయి.  AI సిస్టమ్ కాలక్రమేణా యజమాని ప్రాధాన్యతలు, డ్రైవింగ్ శైలిని అర్థం చేసుకుని మరింత మెరుగ్గా పని చేస్తుంది.

కారు లాంచ్ వివరాలు

టెన్సర్ రోబోకార్ డెలివరీ 2026 సెకండాఫ్ టైంలో ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. మొదటగా ఈ కారు అమెరికా, యూరప్ లతో పాటు UAEలోని కస్టమర్‌లకు అందుబాటులోకి వస్తుంది. డిజైన్ విషయానికి వస్తే.. ఇందులో మడతపెట్టే స్టీరింగ్ వీల్ (Foldable Steering wheel),  స్లైడింగ్ డిస్‌ప్లే ఉన్నాయి. అంటే కావాలనుకుంటే డ్రైవర్, ఓనర్ ఈ కారును నడపవచ్చు లేక పూర్తిగా డ్రైవర్ లేని మోడ్‌లో వదిలేసినా ఆటోమేటెడ్‌గా వెళ్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.