Bangalore Traffic Police Pending Challans Detection: మీ కారు, బైక్‌ లేదా ఏదైనా మోటార్‌ వెహికల్‌ను రోడ్డు మీదకు తీసుకురావడానికి ఇప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ట్రాఫిక్‌ పోలీసుల చేతిలోకి కొత్తగా హైటెక్‌ అస్త్రం వచ్చింది. మీ బండి రోడ్డు మీదకు రాగానే, అది మీ పెండింగ్‌ చలాన్ల మొత్తం చరిత్రను అందరికీ బహిర్గతం చేస్తుంది. కాబట్టి, ట్రాఫిక్‌ చలాన్లు ఉన్న వాళ్లు వెంటనే క్లియర్‌ చేసుకోవడం మంచిది. ప్రస్తుతం ఈ వ్యవస్థను బెంగళూరులో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు కాబట్టి, ఇప్పటికైతే తెలుగు ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు.

Continues below advertisement

ట్రాఫిక్ ఉల్లంఘనదారులను అప్రమత్తం చేయడానికి, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు, రోడ్డు పక్కన పెద్ద ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) స్క్రీన్‌లను ఉపయోగించడం ప్రారంభించారు. ఈ AI వ్యవస్థ, వాహనం నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసి, పెండింగ్‌లో ఉన్న చలాన్ల సంఖ్య, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ వ్యాలిడిటీ & ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘనల సమాచారాన్ని తక్షణమే పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శిస్తుంది. 

AI స్క్రీన్ ఎలా పనిచేస్తుంది?ట్రాఫిక్ పోలీసులు, ఈ AI స్క్రీన్‌ వ్యవస్థ 100 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన కెమెరాలకు అనుసంధానించారు. ఒక వాహనం అటుగా వెళుతున్నప్పుడు, ఈ కెమెరా, వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్లేట్‌ (లైసెన్స్ ప్లేట్‌) ను స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత, వాహనం నంబరు సహా ఆ వెహికల్‌పై ఏవైనా ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉంటే వెంటనే ప్రదర్శిస్తుంది. ఇదంతా సెకన్లలో జరిగిపోతుంది.

Continues below advertisement

డ్రైవర్లకు కూడా ప్రయోజనమే!నిజానికి, ఈ వ్యవస్థ కారు ఓనర్లు లేదా డ్రైవర్లకు కూడా ఉపయోగమే. ఓనర్లు లేదా డ్రైవర్లు, తమకు తెలీకుండా తమ వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలాన్ల సంఖ్యను & చలాన్‌కు గల కారణం గురించి రియల్‌ టైమ్‌లో తెలుసుకుంటారు. దీనివల్ల, వెంటనే ఆ చలాన్/ చలాన్లను చెల్లించడానికి & భవిష్యత్తులో ఉల్లంఘనలను నివారించడానికి వీలు కలుగుతుంది.

ఈ పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభమైంది?ప్రస్తుతం, ఈ AI స్క్రీన్‌ను బెంగళూరులోని ట్రినిటీ చౌక్‌లో ఏర్పాటు చేశారు & దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా పరిశీలిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో బెంగళూరులోని ఇతర ప్రధాన ట్రాఫిక్ పాయింట్లలో కూడా ఇలాంటి స్క్రీన్‌లను ఏర్పాటు చేయవచ్చు. కొంతమంది ఈ AI స్క్రీన్ గురించి సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ట్రాఫిక్ మెరుగుదలకు ఇది ఒక మంచి అడుగు అని కొందరు చెబుతుండగా, డ్రోన్లను ఏర్పాటు చేసి గుంతలు & ట్రాఫిక్ జామ్‌ల గురించి కూడా సమాచారాన్ని అందించగలిగితే ఇంకా బాగుంటుందని మరికొందరు వ్యాఖ్యానించారు.

బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ AI-ఆధారిత స్క్రీన్ ప్రయోగం ట్రాఫిక్ నిర్వహణలో పెద్ద మార్పును తీసుకురాగలదని భావిస్తున్నారు. ఇది చలాన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా చేస్తుంది & డ్రైవర్లకు తక్షణ సమాచారాన్ని అందిస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, బెంగళూరులోనే కాదు, మన హైదరాబాద్‌ & విజయవాడ వంటి నగరాల్లోకీ ఇది రావొచ్చేమో.