AdBlue In Diesel Cars: డీజిల్ కారు కొనుగోలు చేసినవాళ్లు ఇంజిన్ ఆయిల్, కూలెంట్, డీజిల్ వంటి అంశాలపై శ్రద్ధ పెడుతుంటారు. కొన్ని డీజిల్ కార్లలో మరో ముఖ్యమైన ద్రవం కూడా ఉంటుంది, అదే.. AdBlue. ఇది వాహనం నుంచి వచ్చే కాలుష్య ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యేకంగా, సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్ (Selective Catalytic Reduction - SCR) టెక్నాలజీ ఉన్న డీజిల్ కార్లలో AdBlue అవసరం. దీనిని ఎప్పటికప్పుడు నింపకపోతే కొన్ని కార్లలో ఇంజిన్ మళ్లీ స్టార్ట్ కాకపోవచ్చు. AdBlue అంటే ఏమిటి? ఎప్పుడు నింపాలి? తెలుసుకుందాం.
AdBlue అంటే ఏమిటి? ఎందుకు ఉపయోగిస్తారు?
AdBlueను డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (DEF) లేదా AUS 32 అని కూడా పిలుస్తారు. ఇది రంగులేని ద్రవం. ఇందులో 32.5 శాతం అధిక స్వచ్ఛత కలిగిన యూరియా, 67.5 శాతం డీ-అయోనైజ్డ్ వాటర్ ఉంటాయి.
AdBlue అనేది డీజిల్‌లో కలిపే ద్రవం కాదు. దీనికి ప్రత్యేకమైన ట్యాంక్ ఉంటుంది. SCR అనే ఎగ్జాస్ట్ ట్రీట్‌మెంట్ వ్యవస్థ ఉన్న కార్లలో మాత్రమే దీనిని ఉపయోగిస్తారు. వాహనం నుంచి వెలువడే ఎగ్జాస్ట్ వాయువుల్లోకి AdBlueను ఇంజెక్ట్ చేస్తారు. అప్పుడు హానికరమైన నైట్రోజన్ ఆక్సైడ్స్ (NOx) వాయువులు నైట్రోజన్ & నీటి ఆవిరిగా మారతాయి. దీంతో వాహనం నుంచి వెలువడే హానికర ఉద్గారాలు తగ్గుతాయి.
ప్రతి డీజిల్ కారులో AdBlue ఉండదు. కొన్ని వాహనాల్లో Lean NOx Trap వంటి వేరే ఉద్గార నియంత్రణ వ్యవస్థలను ఉపయోగిస్తారు. అలాంటి కార్లకు AdBlue అవసరం లేదు. మీ కారు SCR వ్యవస్థతో వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఓనర్స్ మాన్యువల్ లేదా వాహన స్పెసిఫికేషన్లను పరిశీలించాలి.
ఇది కూడా చదవండి: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్ కార్లు ఇవే!
AdBlue ట్యాంక్ ఎక్కడ ఉంటుంది?
సాధారణంగా AdBlue కోసం ప్రత్యేక ట్యాంక్ ఉంటుంది. చాలా కార్లలో ఇది డీజిల్ ఫ్యూయల్ ఫిల్లర్ దగ్గరే ఉంటుంది. కొన్ని మోడళ్లలో డీజిల్ ట్యాంక్ మూత ఉన్న ఫ్లాప్ వెనుకనే AdBlue ఫిల్లింగ్ క్యాప్ ఉంటుంది. మరికొన్ని కార్లలో ప్రత్యేక ప్రదేశంలో అమరుస్తారు. సాధారణంగా ఈ ట్యాంక్ క్యాప్ నీలం (బ్లూ) రంగులో ఉంటుంది.
AdBlue ట్యాంక్ సామర్థ్యం ఒక్కో కారులో ఒక్కోలా ఉంటుంది. డాష్‌బోర్డ్‌లోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా ద్రవం ఎంత మిగిలి ఉందో తెలుసుకోవచ్చు.
ట్యాంక్ సామర్థ్యం, ఫిల్లింగ్ క్యాప్ స్థానం, రీఫిల్ చేసే విధానం వంటి వివరాలు కారుతో ఇచ్చే ఓనర్స్ మాన్యువల్‌లో ఉంటాయి. కొత్తగా నింపే AdBlueను కారు సిస్టమ్ గుర్తించాలంటే కనీసం ఎంత పరిమాణంలో నింపాలో కూడా అందులో పేర్కొంటారు.
AdBlue అయిపోతే ఏమవుతుంది?
AdBlue స్థాయి తగ్గుతున్నప్పుడు చాలా కార్లు ముందుగానే హెచ్చరికలు ఇస్తాయి. ట్యాంక్ ఖాళీకి చేరువవుతున్న కొద్దీ ఈ అలర్ట్స్ మరింత స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని కార్లు రీఫిల్ చేయడానికి ముందు ఇంకా ఎంత దూరం ప్రయాణించవచ్చో కౌంట్‌డౌన్ రూపంలో చూపిస్తాయి.
ఇది కూడా చదవండి: పాత కారు ఇచ్చి కొత్త కారు కొంటున్నారా? ఈ ఒక్క సర్టిఫికెట్‌తో రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించుకోవచ్చు!
ఈ హెచ్చరికలను పట్టించుకోకపోతే కొన్ని వాహనాల్లో ఇంజిన్ పనితీరును పరిమితం చేయవచ్చు. మరికొన్ని కార్లలో ఇంజిన్‌ను ఆఫ్ చేసిన తర్వాత తిరిగి స్టార్ట్ కాకుండా వ్యవస్థ నిరోధించవచ్చు. అయితే ఈ హెచ్చరికల విధానం, పరిమితులు తయారీ సంస్థను బట్టి, మోడల్‌ను బట్టి మారుతాయి.
AdBlue అయిపోయిన వెంటనే కారు నడవడం ఆగిపోతుందని కాదు. కానీ ఇంజిన్ ఆఫ్ చేసిన తర్వాత తిరిగి స్టార్ట్ చేయలేని పరిస్థితి రావచ్చు. అందుకే డాష్‌బోర్డ్‌లో తక్కువ స్థాయి హెచ్చరిక కనిపించగానే AdBlue నింపడం మంచిది.
రీఫిల్ చేసిన తర్వాత కూడా హెచ్చరిక తొలగకపోతే సమస్య కేవలం ద్రవం స్థాయికి సంబంధించినది కాకపోవచ్చు. నాణ్యత లేని లేదా కలుషితమైన AdBlue, ఎగ్జాస్ట్ ట్రీట్‌మెంట్ వ్యవస్థలో లోపం కూడా హెచ్చరికకు కారణం కావచ్చు. అలాంటప్పుడు పదేపదే ద్రవాన్ని నింపకుండా సర్వీస్ సెంటర్‌లో కారును తనిఖీ చేయించాలి.
ఎప్పుడెప్పుడు నింపాలి, ఎంత నింపాలి?
AdBlue రీఫిల్‌కు నిర్దిష్ట కిలోమీటర్ల విరామం అంటూ ఏమీ లేదు. కారు మోడల్, డ్రైవింగ్ పరిస్థితులను బట్టి దీని వినియోగం మారుతుంది. అందువల్ల ఒకసారి నింపిన తర్వాత ఎంత దూరం ప్రయాణించవచ్చనేది అన్ని కార్లకూ ఒకే విధంగా చెప్పలేం. కొన్ని సందర్భాల్లో షెడ్యూల్డ్ సర్వీసుల మధ్య కూడా AdBlue నింపాల్సి రావచ్చు.
డాష్‌బోర్డ్‌లో వచ్చే లో-లెవల్ వార్నింగ్‌ను బట్టి రీఫిల్ సమయాన్ని తెలుసుకోవాలి. ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయ్యే వరకు వేచి చూడకూడదు. ముఖ్యంగా సుదీర్ఘ ప్రయాణానికి వెళ్లే ముందు AdBlue స్థాయిని చెక్ చేసుకోవడం ఉపయోగకరం.
ఎంత పరిమాణంలో నింపాలనేది కూడా మోడల్‌ను బట్టి మారుతుంది.
ఇది కూడా చదవండి: CODని చూపిస్తే కొత్త కారుపై గ్యారెంటీ బెనిఫిట్స్! తెలంగాణలో రోడ్ ట్యాక్స్ రాయితీ ఎంతంటే?
ఎలాంటి AdBlue వాడాలి?
AdBlue నాణ్యత చాలా ముఖ్యం. ఇందులో ఉండే మలినాలు ఎగ్జాస్ట్ ట్రీట్‌మెంట్ వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. అందుకే కార్ల తయారీ సంస్థ సూచించిన స్పెసిఫికేషన్‌కు అనుగుణంగా ఉన్న ఆటోమోటివ్ గ్రేడ్ AdBlue మాత్రమే ఉపయోగించాలి.
భారత్‌లో AUS 32కు సంబంధించిన నాణ్యత ప్రమాణం IS 17042. కొనుగోలు చేసే సమయంలో ఉత్పత్తి లేబుల్‌పై సంబంధిత స్పెసిఫికేషన్, సర్టిఫికేషన్ వివరాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి.
వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించే యూరియాను నీటిలో కలిపి AdBlueకు ప్రత్యామ్నాయంగా వాడకూడదు. అది నాణ్యత ప్రమాణాలను అందుకోదు, పైగా కారులోని వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. AdBlue నింపేటప్పుడు ఫిల్లింగ్ ప్రాంతం శుభ్రంగా ఉంచాలి. పొరపాటున డీజిల్ ట్యాంక్‌లో కాకుండా AdBlue కోసం కేటాయించిన ట్యాంక్‌లోనే ద్రవాన్ని పోయాలి.
ధర ఎంత?
మన దేశంలో, AdBlue ధర లీటరుకు రూ.85 నుంచి రూ.100 వరకు ఉంటుంది. అయితే బ్రాండ్, ప్యాక్ సైజ్, సెల్లర్‌ను బట్టి ధర మారవచ్చు. ప్రాంతాన్ని బట్టి కూడా ధరల్లో తేడా ఉండొచ్చు.
మొత్తంగా చూస్తే.. SCR టెక్నాలజీ ఉన్న డీజిల్ కార్లలో AdBlue ఒక సాధారణ నిర్వహణ అవసరం. డాష్‌బోర్డ్ హెచ్చరికలను గమనిస్తూ, సరైన నాణ్యత కలిగిన ద్రవాన్ని అవసరమైనప్పుడు నింపుకుంటే మీ ప్రయాణం మధ్యలో అనవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
