New ABS Rule For All Bikes And Scooters: భారత ప్రభుత్వం ద్విచక్ర వాహన భద్రతకు సంబంధించి కీలక ప్రతిపాదన చేసింది. ఇప్పటివరకు, 125cc కంటే ఎక్కువ కెపాసిటీ బైక్‌లకు మాత్రమే తప్పనిసరిగా ఉన్న ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) రూల్‌ను ఇకపై అన్ని ఇంజిన్‌ సైజ్‌ల్లోని టూవీలర్లకు (బైక్‌లు, స్కూటర్లు) వర్తింపజేస్తోంది. అంటే హీరో స్ల్పెండర్‌, స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా & TVS స్పోర్ట్ వంటి చిన్న ఇంజిన్ బైక్‌లలో కూడా ABS తప్పనిసరి అవుతుంది.

ABS లేదా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఒక ముఖ్యమైన భద్రత కవచం. ఆకస్మిక పరిస్థితుల్లో బైక్ బ్రేకులు& టైర్లు లాక్ అవ్వకుండా నిరోధిస్తుంది. ఈ వ్యవస్థ, బ్రేకింగ్ సమయంలో చక్రాల వేగాన్ని పర్యవేక్షిస్తుంది & అవసరమైనప్పుడు బ్రేక్ ఒత్తిడిని నియంత్రించి రైడర్‌ బ్యాలెన్స్‌ను కాపాడుతుంది. తద్వారా బైక్‌ జారిపోవడం, పల్టీలు కొట్టడం వంటి ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుంది.

ABS రెండు రకాలునిజానికి, ABS రెండు రకాలు - మొదటిది సింగిల్ ఛానల్ ABS, ఇది ముందు టైర్‌ను మాత్రమే ప్రభావితం చేస్తుంది. రెండోది డ్యూయల్ ఛానల్ ABS - ఇది ముందు & వెనుక టైర్లలో పని చేస్తుంది. అందుకే దీనిని సురక్షితమైనదిగా భావిస్తారు.

ఇప్పటి వరకు ఉన్న రూల్‌ ఏంటి?ప్రస్తుతం, దేశంలో 125cc కంటే తక్కువ ఇంజిన్లు కలిగిన బైక్‌లకు ABS తప్పనిసరి కాదు, దీని కారణంగా 45% పైగా ద్విచక్ర వాహనాలు ఈ సేఫ్టీ ఫీచర్‌ను కోల్పోతున్నాయి. భారతదేశంలో చిన్న ఇంజిన్ కలిగిన కమ్యూటర్ బైక్‌లు అత్యధికంగా అమ్ముడవుతున్నందున, కేంద్ర తీసుకురానున్న కొత్త నియమం కోట్లాది మంది రైడర్‌లకు భద్రత కల్పించగలదు.

ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన రూపంలోనే ఉన్నప్పటికీ, త్వరలోనే, కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.

ధర పెరిగే అవకాశంబైకులు, స్కూటర్లలో ABS ఏర్పాటు వల్ల టూవీలర్ల ధర రూ. 2,500 నుంచి రూ. 5,000 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

హెల్మెట్ విషయంలోనూ పెద్ద నిర్ణయంకేంద్ర ప్రభుత్వం మరో కీలక రూల్‌ తీసుకురావడానికి కూడా సన్నాహాలు చేస్తోంది. త్వరలో, ప్రతి ద్విచక్ర వాహనంతో రెండు BIS-సర్టిఫైడ్ హెల్మెట్‌లను అందించడం తప్పనిసరి చేయనున్నారు. మన దేశంలో జరుగుతున్న మొత్తం రోడ్డు ప్రమాద మరణాల్లో ద్విచక్ర వాహన రైడర్లు 44% మంది ఉన్నారు & ఈ మరణాలలో ఎక్కువ భాగం తలకు తీవ్రమైన గాయాల కారణంగా సంభవిస్తున్నాయి. బైక్ కొనుగోలు చేసే సమయంలో హెల్మెట్‌లను అందిస్తే అవగాహన పెరుగుతుంది & ప్రాణాలను కాపాడవచ్చు. ఈ కొత్త మార్పులతో ప్రతి రైడర్‌ భద్రత ప్రయోజనాన్ని పొందుతాడు. బడ్జెట్ బైక్‌ను కొనుగోలు చేసినా, ప్రీమియం స్కూటర్‌ను కొనుగోలు చేసినా ABS & హెల్మెట్‌ను తప్పనిసరిగా ఉపయోగించడం వల్ల ప్రతి రైడర్‌కు మెరుగైన రక్షణ లభిస్తుంది.