2027 Kawasaki Ninja 300 Price And Features Telugu: భారత మార్కెట్లో ప్రీమియం టూవీలర్ తయారీ సంస్థ కవాసాకి, తన "2027 నింజా 300" మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ బైక్‌ను రూ.3.34 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరకు మార్కెట్లోకి తీసుకొచ్చింది. గత ఏడాది లాంచ్ అయిన "2026 మోడల్"తో పోలిస్తే ఈ కొత్త మోడల్ ధర రూ.17,000 పెరిగింది. అయితే, రేటు పెరిగినప్పటికీ ఇంజిన్, ఫీచర్లు లేదా డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.
పవర్2027 మోడల్‌లో కూడా అదే 296cc లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగించింది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 39hp శక్తిని 11,000 rpm వద్ద & 26.1Nm టార్క్‌ను 10,000 rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. పనితీరు పరంగా ఎలాంటి మార్పులు చేయకుండా ఇప్పటికే ఉన్న సెటప్‌ను కొనసాగించడం ద్వారా విశ్వసనీయతను నిలబెట్టే ప్రయత్నం చేసింది ఈ కంపెనీ.
డిజైన్2027 నింజా 300లో ఎలాంటి కొత్త మార్పులు లేవు. 2025లో (2026 మోడల్) ఈ బైక్‌కు ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్స్, ఎత్తైన విండ్‌స్క్రీన్ వంటి చిన్నపాటి అప్‌డేట్లు అందించగా, అదే రూపకల్పనను ఈ మోడల్‌లో కూడా కొనసాగించారు. దీంతో కొత్త మోడల్‌ను కొనుగోలు చేసే వారికి గత మోడల్‌తో పోలిస్తే రూపంలో ప్రత్యేకమైన తేడా కనిపించదు.
ఇది కూడా చదవండి: జులై 31 వరకే ఛాన్స్.. Kawasaki Z900పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన డీలర్
ఫీచర్లుఫీచర్ల పరంగా చూస్తే నింజా 300 ఇప్పటికీ సింపుల్ సెటప్‌తోనే అందుబాటులో ఉంది. ఇందులో డ్యూయల్ ఛానల్ ABS భద్రతా వ్యవస్థను అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక ప్రత్యర్థి బైక్‌లలో కనిపించే ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్స్, క్విక్ షిఫ్టర్ వంటి ఆధునిక ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్స్ ఇందులో లేవు. అలాగే ఈ విభాగంలో ఇప్పటికీ అనలాగ్ టాకోమీటర్‌ను కొనసాగిస్తున్న అరుదైన బైక్‌లలో నింజా 300 ఒకటిగా నిలుస్తోంది.
2027 కవాసాకి నింజా 300ను కంపెనీ ఒక్క లైమ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందిస్తోంది. ఈ రంగు కవాసాకి రేసింగ్ వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక గుర్తింపుగా అభిమానుల్లో మంచి ఆదరణ పొందింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం జులై చివరి వారంలోనే ఈ బైక్ డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో కొత్త మోడల్‌ను బుక్ చేసుకున్న వినియోగదారులు త్వరలోనే తమ బైక్‌లను అందుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Honda ADV160 Vs ప్రత్యామ్నాయాలు.. ఏ స్కూటర్ బెటర్‌గా ఉంది? పూర్తి కంపారిజన్
భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్ సూపర్‌స్పోర్ట్ బైక్ విభాగంలో 2027 నింజా 300కు గట్టి పోటీ ఉంది. ఈ బైక్‌కు ప్రధాన ప్రత్యర్థులుగా TVS Apache RR 310 & KTM RC 390 నిలుస్తున్నాయి. టీవీఎస్ అపాచీ ఆర్‌ఆర్ 310 ధర రూ.2.62 లక్షల నుంచి రూ.2.78 లక్షల వరకు ఉండగా, కేటీఎం ఆర్‌సీ 390 ధర రూ.3.32 లక్షలుగా ఉంది. ఈ నేపథ్యంలో నింజా 300 ధర కొద్దిగా ఎక్కువైనా, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అందించే స్మూత్ పనితీరు, కవాసాకి బ్రాండ్ విలువ, దీర్ఘకాలిక విశ్వసనీయత కారణంగా ఈ బైక్‌కు ప్రత్యేకమైన అభిమాన వర్గం కొనసాగుతోంది.
కొత్త ఫీచర్లు లేకపోయినా, పనితీరు పరంగా ఇప్పటికే నిరూపితమైన ఇంజిన్, సూపర్‌స్పోర్ట్ స్టైలింగ్, కవాసాకి నాణ్యతను కోరుకునే రైడర్లకు 2027 నింజా 300 ఇప్పటికీ ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది. అయితే అదే ధర పరిధిలో మరింత ఆధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లు కోరుకునే కొనుగోలుదారులు ప్రత్యర్థి మోడళ్లను కూడా పరిశీలించే అవకాశం ఉంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
