2026 Toyota Hilux Price And Features Telugu: 2026 టయోటా హైలక్స్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది టయోటా. తొమ్మిదో తరం హైలక్స్ ప్రారంభ ధర రూ.31.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించారు. గత మోడల్‌తో పోలిస్తే పూర్తిగా కొత్త డిజైన్, మరింత ఆధునిక క్యాబిన్, అదనపు టెక్నాలజీ ఫీచర్లతో ఈ పికప్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే హైలక్స్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన IMV బాడీ ఆన్ ఫ్రేమ్ ఫ్లాట్‌ఫామ్‌ను అలాగే కొనసాగించింది. ప్రస్తుతం బుకింగ్‌లు ప్రారంభం కాగా, ఆగస్టు రెండో వారంలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
వేరియంట్లు - ధరలుభారత్‌లో కొత్త హైలక్స్‌ను మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. GX 4x2 AT ధర రూ.31.99 లక్షలు కాగా, GX 4x4 AT ధర రూ.33.69 లక్షలు. టాప్ ఎండ్ VX 4x4 AT ధర రూ.36.69 లక్షలు. ఈ లైఫ్‌స్టైల్ పికప్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఇసుజు వి క్రాస్ ( Isuzu V-Cross) నిలవనుంది. పాత హైలక్స్‌తో పోలిస్తే ఎంట్రీ ధర రూ.3.47 లక్షలు పెరిగినా, టాప్ వేరియంట్ ధర కేవలం రూ.69 వేల మాత్రమే పెరగడం గమనార్హం.
ఎక్స్‌టీరియర్‌కొత్త హైలక్స్ ముందు భాగం పూర్తిగా మారిపోయింది. సాంప్రదాయ టయోటా లోగో స్థానంలో పెద్ద అక్షరాలతో TOYOTA లెటరింగ్‌ను అమర్చారు. స్లిమ్ LED హెడ్‌ల్యాంప్స్, LED DRLs, హనీకాంబ్ గ్రిల్, వెడల్పైన ఎయిర్ ఇంటేక్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్, LED ఫాగ్ ల్యాంప్స్‌తో ముందు భాగం మరింత దృఢంగా కనిపిస్తుంది. పక్క భాగంలో బ్లాక్ వీల్ ఆర్చ్ క్లాడింగ్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, రోల్ బార్స్, ఫుట్‌బోర్డ్, ఎలక్ట్రిక్‌గా అడ్జస్ట్ అయ్యే & మడతపడే ORVMలు, షార్క్ ఫిన్ యాంటెన్నా ఉన్నాయి.
వెనుక భాగంలో C ఆకార LED టెయిల్ ల్యాంప్స్, టెయిల్‌గేట్‌పై TOYOTA లెటరింగ్, సరుకులు ఎక్కించేందుకు సులభంగా ఉండే ఇంటిగ్రేటెడ్ స్టెప్‌తో కొత్త బంపర్‌ను అందించారు.
ఇది కూడా చదవండి: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
రంగులుఈ పికప్‌ను సల్ఫర్ మెటాలిక్, ప్లాటినం పెర్ల్ వైట్ మెటాలిక్, ఆటిట్యూడ్ బ్లాక్, యాష్, ఎమోషనల్ రెడ్, సూపర్ వైట్ కలిపి మొత్తం ఆరు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
ఇంటీరియర్‌క్యాబిన్‌లో పూర్తిగా కొత్త డ్యాష్‌బోర్డ్‌ను అందించారు. ఇందులో 7 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త మూడు స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. వైర్‌లెస్ Apple CarPlay & Android Auto, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెనుక సీటు ఆర్మ్‌రెస్ట్, కప్ హోల్డర్స్, PM2.5 ఎయిర్ ఫిల్టర్, 8 స్పీకర్ ఆడియో సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే Eco, Normal & Sport అనే మూడు డ్రైవ్ మోడ్‌లను కూడా అందించారు.
భద్రతసేఫ్టీ విషయంలో కూడా టయోటా రాజీ పడలేదు. ఏడు ఎయిర్‌బ్యాగ్స్, VSC, ABS, బ్రేక్ అసిస్ట్, ముందు & వెనుక పార్కింగ్ సెన్సర్లు, TPMS, Isofix చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో లభించే ADAS, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు భారత మోడల్‌లో అందుబాటులో లేవు.
ఇది కూడా చదవండి: Honda ADV160 Vs ప్రత్యామ్నాయాలు.. ఏ స్కూటర్ బెటర్‌గా ఉంది? పూర్తి కంపారిజన్
పవర్ & టార్క్‌కొత్త హైలక్స్‌లో, ఇప్పటికే పరిచయమైన 2.8 లీటర్ నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఇది 204 హెచ్‌పీ శక్తి & 500 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను మాత్రమే అందిస్తున్నారు. ఈసారి మాన్యువల్ గేర్‌బాక్స్‌ను పూర్తిగా తొలగించారు. అలాగే తొలిసారిగా 4x2 ఆటోమేటిక్ వేరియంట్‌ను కూడా పరిచయం చేశారు. 4x4 వేరియంట్లలో లో రేంజ్ ట్రాన్స్‌ఫర్ కేస్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, మల్టిపుల్ టెర్రెయిన్ మోడ్‌లు, డౌన్‌హిల్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఆటో లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ వంటి ఆఫ్‌రోడ్ ఫీచర్లు ఉండటంతో కఠినమైన రోడ్లపైనా ఈ పికప్ సమర్థంగా దూసుకెళ్లగలదు. మొత్తంగా చూస్తే.. కొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లు & శక్తిమంతమైన డీజిల్ ఇంజిన్‌తో 2026 టయోటా హైలక్స్ భారత మార్కెట్‌లోకి వచ్చింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
