2026 MG Hector Facelift Price Features: MG మోటార్ ఇండియా, తన పాపులర్ మిడ్-సైజ్ SUVకి మరోసారి అప్‌డేట్ ఇచ్చింది. 2026 MG హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రారంభ ధరను రూ.11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ప్రకటించింది, ఇది పరిచయ ఆఫర్. ఔగోయింగ్ మోడల్‌తో పోలిస్తే ఇది దాదాపు రూ.2.1 లక్షలు తక్కువ కావడం విశేషం. MG Hector Plus 7-seater ధర రూ.17.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే 6-seater వేరియంట్ల ధరలను ఇంకా ప్రకటించలేదు.
వేరియంట్ల వారీగా ధరలు:
| వేరియంట్ | హెక్టర్ ధర (రూ. లక్షల్లో) | హెక్టర్ ప్లస్ ధర (రూ. లక్షల్లో) |
| Style MT | 11.99 | వర్తించదు |
| Select Pro MT | 13.99 | వర్తించదు |
| Smart Pro MT | 14.99 | వర్తించదు |
| Smart Pro CVT | 16.29 | వర్తించదు |
| Sharp Pro MT | 16.79 | 17.29 |
| Sharp Pro CVT | 18.09 | 18.59 |
| Savvy Pro CVT | 18.99 | 19.49 |
ఎక్స్‌టీరియర్ అప్‌డేట్స్: గ్రిల్, అలాయ్ వీల్స్ కొత్తగా
2026 హెక్టర్‌లో ముందు భాగం స్వల్పంగా మారినా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది. భారీ గ్రిల్ సైజ్ మార్చకపోయినా, ఇప్పుడు డైమండ్ ప్యాటర్న్ స్థానంలో హనీకాంబ్ డిజైన్ స్లాట్స్ వచ్చాయి. లోయర్ ఎయిర్ డ్యామ్ కూడా కొత్త డిజైన్‌తో కనిపిస్తుంది. 18 అంగుళాల అలాయ్ వీల్స్, వెనుక బంపర్ రీడిజైన్ చేశారు. అయితే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, వెనుక వైపు టెయిల్ ల్యాంప్స్‌ను కలిపే LED లైట్ స్ట్రిప్ వంటి అంశాలను కొనసాగించారు.
కలర్ ఆప్షన్లలో... కొత్తగా సెలడాన్ బ్లూ, పెర్ల్ వైట్ రంగులను జోడించారు. ఇప్పటికే ఉన్న అరోరా సిల్వర్, స్టారీ బ్లాక్, గ్లేజ్ రెడ్‌తో కలిపి మొత్తం 5 కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఇంటీరియర్, ఫీచర్లు: 14 అంగుళాల టచ్‌స్క్రీన్ హైలైట్
కొత్త 5-సీటర్ హెక్టర్‌లో డ్యూయల్-టోన్ ఐస్ గ్రే ఇంటీరియర్ ఇచ్చారు. 6, 7-సీటర్ హెక్టర్ ప్లస్ వేరియంట్లలో డ్యూయల్-టోన్ ట్యాన్ కేబిన్ కనిపిస్తుంది. ఇందులో ప్రధాన ఆకర్షణ పోర్ట్రెయిట్ స్టైల్ 14 అంగుళాల టచ్‌స్క్రీన్. ఇందులో MG అందిస్తున్న iSwipe టచ్ జెశ్చర్ కంట్రోల్ టెక్నాలజీ ద్వారా రెండు వేళ్లతో క్లైమేట్ కంట్రోల్, మూడు వేళ్లతో ఆడియో సిస్టమ్‌ను కంట్రోల్ చేయవచ్చు.
ఇతర ఫీచర్లలో... 7 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ముందు సీట్లు, డ్రైవర్ సీటుకు 6-వే పవర్ అడ్జస్ట్‌మెంట్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పానోరమిక్ సన్‌రూఫ్, అంబియంట్ లైట్స్, PM 2.5 ఎయిర్ ఫిల్టర్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు కొనసాగుతాయి.
ఇంజిన్ ఆప్షన్లు: మెకానికల్ మార్పుల్లేవు
కొత్త హెక్టర్, హెక్టర్ ప్లస్ మోడళ్లలో పాత మోడళ్లలోని ఇంజిన్లనే కొనసాగిస్తున్నారు. పెట్రోల్ వేరియంట్లలో.. 1.5 లీటర్ నాలుగు సిలిండర్ల ఇంజిన్, 143 హెచ్‌పీ శక్తి, 250 ఎన్‌ఎం టార్క్ ఇస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది.
డీజిల్ వేరియంట్‌లో 2.0 లీటర్ ఇంజిన్, 170 హెచ్‌పీ, 350 ఎన్‌ఎం టార్క్ ఇస్తుంది. ప్రస్తుతం డీజిల్ ధరలను ప్రకటించలేదు. ఆటోమేటిక్ డీజిల్ వస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఏయే కార్లతో పోటీ?
2026 MG హెక్టర్ ఫేస్‌లిఫ్ట్... Tata Harrier, Jeep Compass వంటి SUVలకు పోటీగా నిలుస్తుంది. ఇక హెక్టర్ ప్లస్... Mahindra XUV 7XO, Hyundai Alcazar, Tata Safari వంటి 7-సీటర్ SUVలతో పోటీ పడనుంది.
మొత్తంగా చూస్తే... తక్కువ ప్రారంభ ధర, కొత్త డిజైన్ టచ్‌లు, పెద్ద టచ్‌స్క్రీన్, ఫీచర్లతో 2026 MG హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ తెలుగు రాష్ట్రాల కుటుంబాలకు ఆకర్షణీయమైన SUV ఎంపికగా నిలుస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.