Hyundai Exter Price India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai), భారత మార్కెట్లో తన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ 'ఎక్స్టర్' (Exter) 2026 వెర్షన్‌ను తాజాగా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 5.80 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 9.42 లక్షల వరకు ఉంది. టాటా పంచ్‌కు గట్టి పోటీనిచ్చే ఈ కారులో డిజైన్, ఇంటీరియర్ పరంగా కంపెనీ పలు కీలక మార్పులు చేసింది. మెకానికల్ గా చూస్తే పాత ఇంజిన్ నే కొనసాగించినప్పటికీ, ఫీచర్ల విషయంలో మాత్రం ఈ కారు మరింత అప్‌డేట్ అయ్యింది.

Continues below advertisement

కొత్త డిజైన్ హైలైట్స్

2026 హ్యుందాయ్ ఎక్స్టర్ ఎక్స్ టీరీయ‌ర్ రూపంలో కొన్ని మార్పులు జరిగాయి. ముందు భాగంలో డార్క్ ఫినిషింగ్ ఉన్న సరికొత్త గ్రిల్ డిజైన్ ఆకట్టుకుంటుంది. బంపర్ మధ్యలో కొత్త గార్నిష్ అమర్చారు. 15-అంగుళాల అలాయ్ వీల్స్‌కు కొత్త డిజైన్ ఇవ్వడంతో పాటు వెనుక వైపు పెద్ద స్పాయిలర్‌ను చేర్చారు. టెయిల్ గేట్, సి-పిల్లర్ వద్ద కొత్త గార్నిష్ వర్క్ కనిపిస్తుంది. 1,643 మిమీ ఎత్తుతో తన సెగ్మెంట్‌లోనే అత్యంత ఎత్తైన కారుగా ఇది నిలిచింది. ఇందులో గోల్డెన్ బ్రాంజ్, టైటానియం బ్లాక్ మ్యాట్ వంటి రెండు కొత్త రంగులతో కలిపి మొత్తం 8 కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రీమియం ఇంటీరియర్

కారు లోపలి భాగం ఇప్పుడు నేవీ, గ్రే కలర్ డ్యూయల్-టోన్ థీమ్‌తో మరింత ప్రీమియం లుక్ ఇస్తుంది. డ్యాష్‌బోర్డ్‌పై కార్బన్ ప్యాటర్న్ ఉన్న 3D ఫినిషింగ్, డి-కట్ (D-cut) స్టీరింగ్ వీల్ ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. స్పోర్టీ లుక్ కోసం మెటల్ పెడల్స్ అమర్చారు. ప్రయాణీకుల సౌకర్యం కోసం ఫోల్డింగ్ డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్ సౌకర్యం కల్పించారు. కారులో 391 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్ ఉండటం వల్ల లగేజీకి ఇబ్బంది ఉండదు.

Continues below advertisement

అత్యాధునిక ఫీచర్లు

ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా డ్యాష్‌క్యామ్ (Dashcam) ఫీచర్‌ను హ్యుందాయ్ పరిచయం చేసింది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సదుపాయం ఉంది. వెనుక సీటు ప్రయాణీకుల కోసం టైప్-సి యూఎస్‌బీ పోర్ట్ ఇచ్చారు. బ్లూలింక్ (Bluelink) టెక్నాలజీ ద్వారా 60కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు వాడుకోవచ్చు. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే 300 వాయిస్ కమాండ్స్ ఈ కారు ప్రత్యేకత.

ఇంజిన్, పర్ఫార్మెన్స్

ఇందులో 1.2 లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది మాన్యువల్ (MT), ఏఎంటీ (AMT) గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. పొదుపుగా ప్రయాణించాలనుకునే వారి కోసం సీఎన్‌జీ (CNG) వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. సీఎన్‌జీ మోడల్‌లో 225 లీటర్ల డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని వాడటం వల్ల డిక్కీలో కొంత స్పేస్ లభిస్తుంది. తక్కువ ధరలో మంచి ఎస్‌యూవీ ఫీచర్లు కోరుకునే వారికి 2026 ఎక్స్టర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్ప‌వ‌చ్చు.