Upcoming Electric Cars With 500 km Range: పెట్రోల్ & డీజిల్ కార్లకు క్రమంగా దూరమవుతున్న ప్రజలు, ఎలక్ట్రిక్ కార్‌లపై మోజు చూపిస్తున్నారు. ప్రజావాక్కుకు తగ్గట్లుగా విద్యుత్ వాహనాల నాణ్యతలో కీలక మార్పులను మనం చూస్తున్నాం. నిన్న, పర్‌ఫెక్ట్ అంటూ పొగడ్తలు అందుకున్న ఫీచర్లు ఈ రోజు పాతబడుతున్నాయి, వాటిని తలదన్నే తలదన్నే ఆధునిక మార్పులు అందుబాటులోకి వస్తున్నాయి. లాంగ్ రేంజ్ & పవర్‌ఫుల్ ఫీచర్లు ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVs) ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది.
ప్రజాభీష్టానికి అనుగుణంగా పలు కంపెనీలు 2025లో శక్తిమంతమైన ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి, ఇవి 500 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ రేంజ్‌ను అందించగలవు. అప్‌కమింగ్స్ లిస్ట్‌లో.. టాటా మోటార్స్, మారుతి సుజుకి & మహీంద్రా వంటి పెద్ద బ్రాండ్‌ల పేర్లు ఉన్నాయి.
1. మహీంద్రా ఎక్స్‌ఈవీ 7ఇ (Mahindra XEV 7e)మహీంద్రా XEV 7e అనేది ఈ కంపెనీ పాపులర్ SUV XUV700 కి ఎలక్ట్రిక్ వెర్షన్. ఈ మోడల్‌లో అమర్చిన బ్యాటరీ ప్యాక్ వివరాలను కంపెనీ ఇంకా బహిరంగపరచనప్పటికీ, రిపోర్ట్స్ ప్రకారం, ఫుల్ ఛార్జ్‌తో ఈ EV 500 కి.మీ.కు పైగా రేంజ్ ఇవ్వగలదు. ఈ కారు కంపెనీ Born Electric సిరీస్‌లో భాగంగా రానుంది & 2025 మధ్య నాటికి భారతదేశంలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయి.
2. ఎంజీ ఎం9 (MG M9)MG మోటార్ భారతదేశంలో తన ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా, త్వరలో MG M9 EV MPV ని విడుదల చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లోకి 90 kWh బ్యాటరీతో ప్రవేశించింది. ఈ బ్యాటరీ 430 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలదని సమాచారం. భారతదేశంలో, ప్రీమియం MG సెలెక్ట్ అవుట్‌లెట్స్‌లో ఈ కార్ విక్రయాలు జరుగుతాయి.
3. మహీంద్రా ఎక్స్‌యూవీ 3X0 EV (Mahindra XUV 3X0 EV)టెస్టింగ్ సమయంలో, మహీంద్రా XUV 3X0 EV భారతీయ రోడ్లపై చాలాసార్లు కనిపించింది. ఈ కారును XUV300 ఆధారంగా తయారు చేశారు & దీని ద్వారా కాంపాక్ట్ SUV విభాగంలో అడుగు పెట్టబోతున్నారు. రిపోర్ట్స్ ప్రకారం, ఈ EV 400 నుంచి 450 కిలోమీటర్ల పరిధిని ఇవ్వగలదు. కంపెనీ, అడ్వాన్స్‌డ్ కనెక్టివిటీ ఫీచర్లు & అత్యాధునిక భద్రత సాంకేతికతను ఈ కార్‌లో చేర్చవచ్చు.
4. మారుతి సుజుకి ఇ-విటారా (Maruti Suzuki e-Vitara)మారుతి సుజుకి బ్రాండ్ నుంచి భారతదేశంలో విడుదల కానున్న తొలి ఎలక్ట్రిక్ SUV ఇదే అవుతుంది. దీనిని మొదటిసారిగా 'ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024'లో ప్రదర్శించారు. ఇ-విటారా రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఆప్షన్స్‌తో రాబోతోంది, హై-రేంజ్ బ్యాటరీ వేరియంట్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఈ కార్, ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో మారుతి సుజుకికి కీలక షేర్ అందించగలదని భావిస్తున్నారు.
5. టాటా హారియర్ EV (Tata Harrier EV)టాటా మోటార్స్, తన SUV హారియర్‌కు ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా హారియర్ EV కూడా పరీక్ష సమయంలో చాలాసార్లు కనిపించింది. ఫుల్ ఛార్జ్‌తో ఈ EV 500 కి.మీ. పైగా డ్రైవింగ్ రేంజ్ అందించగలదని సమాచారం. ADAS, డిజిటల్ క్లస్టర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ కార్ రూపొందిందని రిపోర్ట్స్ నివేదికలు సూచిస్తున్నాయి.