2025 Maruti Dzire Review: మారుతి సుజుకి డిజైర్‌… ఈ పేరు వింటేనే భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కాంపాక్ట్‌ సెడాన్‌ గుర్తుకు వస్తుంది. 2025లో వచ్చిన కొత్త మోడల్‌ ఈ పేరుపై ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచింది. ఒక యూజర్‌, గత కొన్ని నెలలుగా, 1.2 లీటర్‌ పెట్రోల్‌ మాన్యువల్‌ డిజైర్‌తో రోజువారీ ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో 10,000 కిలోమీటర్లు నిడిపిన ఆ తర్వాత, ఆ యూజర్‌ ఇచ్చిన రిపోర్ట్‌ ఇది. 

Continues below advertisement

నగర డ్రైవింగ్‌లో అసలైన బలం

డిజైర్‌ మొదట కూర్చున్న క్షణం నుంచే కాంపాక్ట్‌గా, హ్యాండిల్‌ చేయడానికి చాలా సులభంగా అనిపిస్తుంది. ట్రాఫిక్‌తో నిండిపోయే నగర రోడ్లపై, ఇరుకైన లేన్లలో, పార్కింగ్‌ చేసే సమయంలో ఇది నిజంగా ఉపశమనం కలిగిస్తుంది. చిన్న కారులా అనిపించినా, డ్రైవ్‌లో మాత్రం ఎక్కడా తక్కువగా అనిపించదు. పక్కాగా బ్యాలెన్స్‌ అయిన ఫీలింగ్‌ ఇస్తుంది.

Continues below advertisement

ఇంటీరియర్‌ అనుభవం

డిజైర్‌ క్యాబిన్‌ చాలా ఓపెన్‌గా అనిపిస్తుంది. లైట్‌ బేజ్‌ కలర్‌ ఇంటీరియర్‌ వల్ల లోపల స్పేస్‌ ఇంకా పెద్దగా కనిపిస్తుంది. చుట్టూ విజిబిలిటీ బాగా ఉంటుంది. అయితే, భారతీయ పరిస్థితుల్లో ఈ బేజ్‌ కలర్‌ సీట్లు సులభంగా మురికి పడతాయి. తేమ, దుమ్ము, చిన్న చిన్న మరకలు త్వరగా కనిపిస్తాయి. డ్రైవింగ్‌కు ఇబ్బంది లేకపోయినా, శుభ్రతపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవాళ్లకు ఇది చిన్న మైనస్‌.

ఇంజిన్‌, గేర్‌బాక్స్‌ పనితీరు

డిజైర్‌లోని 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ రేసింగ్‌ ఫీలింగ్‌ ఇవ్వదు. కానీ, రోజువారీ అవసరాలకు ఇది చక్కగా సరిపోతుంది. స్మూత్‌గా, శబ్దం తక్కువగా పనిచేస్తుంది. తక్కువ rpm నుంచే సాఫీగా పికప్‌ ఇస్తుంది. గేర్‌బాక్స్‌ స్లీక్‌గా ఉంటుంది. ముఖ్యంగా క్లచ్‌ చాలా లైట్‌గా ఉండటం సిటీ ట్రాఫిక్‌లో పెద్ద ప్లస్‌. గంటల కొద్దీ స్టాప్‌-గో డ్రైవింగ్‌ చేసినా అలసట అనిపించదు.

రైడ్‌ కంఫర్ట్‌ అంటే ఇదే

డిజైర్‌ సస్పెన్షన్‌ను భారతీయ రోడ్లకు అద్భుతంగా సెట్‌ చేశారు. గుంతలు, పాడైపోయిన రోడ్లు వచ్చినా కారు సాఫీగా ముందుకు సాగుతుంది. ప్యాసింజర్లకు ఊగిసలాట ఎక్కువగా అనిపించదు. ఈ సెగ్మెంట్‌లో ఇది నిజంగా మెచ్చుకోదగిన విషయం.

మైలేజ్‌ నిజంగానే ఆశ్చర్యం

నగర డ్రైవింగ్‌లో కూడా డిజైర్‌ సగటున లీటర్‌కు సుమారు 15 కిలోమీటర్లు ఇచ్చింది. ఏసీ ఎప్పుడూ ఆన్‌లోనే ఉన్నా ఈ నంబర్‌ నిలబడటం విశేషం. హైవే ప్రయాణాల్లో అయితే 18 నుంచి 19 కిలోమీటర్ల వరకు వచ్చింది. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వాళ్లకు ఇది పెద్ద ప్లస్‌ పాయింట్‌.

ఫీచర్లు, రోజువారీ వినియోగం

వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే సాఫీగా పని చేశాయి. అయితే, రఫ్‌ రోడ్లపై ఫోన్‌ కదిలిపోవడం వల్ల వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ప్యాడ్‌ మాత్రం సరిగా పనిచేయదు. ఇది చిన్న లోపమే అయినా, గమనించాల్సిన విషయం.

చివరి మాట

2025 మారుతి డిజైర్‌ నెమ్మదిగా మనసు గెలుచుకునే కారు. హడావుడి లేకుండా, నమ్మకంగా, సౌకర్యంగా రోజువారీ జీవితంలో భాగమైపోతుంది. తక్కువ ఖర్చుతో, మంచి కంఫర్ట్‌తో, బెస్ట్‌ మైలేజ్‌తో భారతీయ కుటుంబాలకు ఇది ఇంకా ఎందుకు ఫేవరెట్‌ సెడాన్‌గా ఉందో ఈ 10,000 కిలోమీటర్ల అనుభవంలో తెలుసుకున్నాను.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.