జ్యోతిష్యం భారతీయ సనాతన శాస్త్రాలలో ముఖ్యమైంది. ఇది పుట్టిన సంవత్సరం, తేది, సమయాన్ని అనుసరించి పూర్తి జీవిత చక్రం, మనిషి గుణగణాలన్నీంటిని గురించి చర్చిస్తుంది. స్వభావ వ్యక్తిత్వాలన్నీంటి గురించి కూడా వివరాలు అందిస్తుంది. పూర్తి మానవాళి మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ఏదో ఒక దానికి చెంది ఉంటారని జ్యోతిష్యం చెబుతుంది. ఈ పన్నెండు రాశుల్లో 27 నక్షత్రాల్లో పుట్టిన అందరూ ఉంటారు. వీటి మీద తొమ్మిది గ్రహాల ప్రభావం ఉంటుంది. ఈ గ్రహ గమనాల ఆధారంగా వారి వారి అదృష్ట దురదృష్టాలు, శుభాశుభాలు ఆధారపడి ఉంటాయి.


ఈరాశి చక్రంలోని 12 రాశులలో కొన్న రాశుల వారు మాటలు చెప్పటంలో దిట్టలుగా ఉంటారు. ఎలాంటి  వారినైనా తమ మాటల మాయాజాలంలో బంధించగలుగుతారు. ఇలువంటివారు మంచి మార్కెటింగ్ పర్సన్స్ గా, సేల్స్ మెన్ గా, కమ్యూనికేషన్ రంగంలోనూ బాగా రాణించగలుగుతారు.


మిథున రాశి


గ్రహ రాజకుమారుడు బుధుడు మిథున రాశి రాశ్యాధిపతి. జ్యోతిష్యంలో బుధుడు వాణీ కారకుడు. బుధుడు వ్యాపారానికి, తర్కానికి అధినేత. జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటే అలాంటి వారి మాట చాలా మధురంగా ఉంటుంది. వారు మాట్లాడే భాష ఇతరులను ఆకర్షిస్తుంది. వీరి మాట మంత్రంగా చెల్లుబాటవుతుంది. అమ్మాయిలు ఇటువంటి అబ్బాయిలను త్వరగా ఆకర్షితులవుతారు. వీరు ప్రమోటర్లుగా, మార్కెటింగ్ పర్సన్స్ గా చాలా బాగా రాణించగలుగుతారు.


కన్యారాశి


రాశిచక్రంలో కన్యారాశికి చెందిన వారు చాలా తెలివైన వారు. మాట్లాడే ప్రతి మాట ఆచీతూచీ మాట్లాడుతారు. వీరు మాట్లాడే మాట చాలా విలువైందిగా, ప్రభావవంతమైందిగా ఉంటుంది. వీరి మాటను చాలా మంది వినటమే కాదు అనుసరిస్తారు కూడా. వీరి తెలివితేటలతో త్వరగా లక్ష్యాలను సాధిస్తారు. వీరి ప్రతిభ, క్రియేటివిటి కారణంగా ఆఫీసులో వీరి మాటకు తిరుగుండదు. బాస్ కు చాలా ప్రియమైన వారిగా చలామణిలో ఉంటారు. చదువులో కూడా బాగా రాణిస్తారు. ఆకర్శణీయమైన వ్యక్తిత్వం వీరి సొంతం. సమూహంలో ప్రత్యేక వ్యక్తులుగా అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. అంతేకాదు ప్రభావశీల వ్యక్తులుగా చెప్పుకోవచ్చు.


మీన రాశి


రాశిచక్రంలో కట్టకడపటి రాశి మీన రాశి. బృహస్పతి అంటే దేవగురువు ఈ రాశ్యాధిపతి. గురు గ్రహం అత్యంత శుభగ్రహం. జ్ఞానానికి ప్రతీక బృహస్పతి. బుధ గ్రహ ప్రభావంలో ఉన్నపుడు వీరిని తర్కంలో ఓడించగలిగే వారు లోకంలో ఉండరు. వీరిలో చాలామంది నడిచే ఎన్సైక్లోపీడియా గా ఉంటారు. వీరికి తెలియని విషయాలుండవు. ఏ అంశాన్ని వీరి దగ్గర ప్రస్తావించినా ఎంతో కొంత సమాచారాన్ని వీరు ఇవ్వగలుగుతారు. అన్ని తెలివితేటలు వీరి సొంతం. సమాధానం చెప్పలేని సమస్యలు దాదాపు వీరికి ఉండవు. తర్కప్రావీణ్యం కలిగి మంచి బుధ్ధి కుశలతతో ఉంటారు. మార్కెటింగ్, టీచింగ్, కౌన్సెలింగ్ వంటి రంగాల్లో బాగా రాణించగలుగుతారు. పరిస్థితులను విశ్లేషించడంలో వీరిని ఓడించడం ఎవరితరం కాదు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ఏబీపీ దేశం ఎలాంటి భాధ్యత తీసుకోవదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి విరాలు తెలుసుకోగలు. ఏబీపీ దేశం ఈ విషయాలను దృవీకరించడం లేదు.