Uber Ola Charges: కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఉబర్, ఓలా లాంటి క్యాబ్‌లపై ఇటీవల ఆంక్షలు విధించారు. కొన్ని రాష్ట్రాల్లో క్యాబ్ లేనిదే నగరాలలో జర్నీ చేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో క్యాబ్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకనుంచి పీక్ అవర్స్ లో డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ఛార్జీలు అమాంతం పెంచుకునేందుకు అవకాశం  కల్పించింది. 

క్యాబ్ సంస్థల డిమాండ్ కు అంగీకరించిన కేంద్రం

ఓలా, ఊబర్, రాపిడో, ఇన్‌డ్రైవ్ వంటి క్యాబ్ కంపెనీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. వారి డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం క్యాబ్ కంపెనీలకు భారీ ఉపశమనం కలిగించింది. ఇప్పుడు పీక్ అవర్స్ సమయంలో బేస్ ఫేర్ (Base Fare)ను రెట్టింపు చేసేందుకు క్యాబ్ సంస్థలకు అనుమతించింది. ఇంతకుముందు ఈ కంపెనీలు కేవలం ఒకటిన్నర రెట్లు మాత్రమే ధర పెంచడానికి వీలుండేది. కానీ ప్రభుత్వం తాజా నిర్ణయంతో బేస్ ధరను రెట్టింపు వరకు పెంచుకోవడానికి క్యాబ్ సంస్థలకు అనుమతి ఇచ్చింది.

జూలై 1న రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ (MVAG) 2025ని క్యాబ్ సంస్థల కోసం విడుదల చేసింది. వచ్చే మూడు నెలల్లో అన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేయాలని ఇందులో కేంద్ర ప్రభుత్వం సూచించింది.

అడ్డగోలుగా ఛార్జీలు పెంచకుండా కేంద్రం చర్యలు

అయితే, రద్దీ తక్కువగా ఉన్నప్పుడు, అద్దె బేస్ ధరలో సగానికి తగ్గించడం లాంటివి ఉందు. వాస్తవానికి, పీక్ అవర్స్ సమయంలో క్యాబ్ ఛార్జీలను రెట్టింపు చేయడానికి అనుమతించడానికి ప్రభుత్వం ఆలోచన ఏమిటంటే, ఈ సమయంలో ప్రయాణికులపై ఎక్కువ భారం పడకుండా చూడటం. లేకపోతే క్యాబ్ కంపెనీలు ఒకరితో ఒకరు పోటీపడి రెండింతల కన్నా అధిక ఛార్జీలను వసూలు చేసే అవకాశం ఉందని రవాణాశాఖ యోచన. మరోవైపు క్యాబ్ సంస్థలు పీక్ అవర్స్ ను టార్గెట్ చేసుకుని తప్పుడు మార్గాల్లో పోటీ పడకుండా చూసుకోవాలని కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది