Rs 2000 notes still in circulation | ముంబై: కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోట్లను ఉపసంహరించుకుని రెండు సంవత్సరాలు గడిచినా వేలకోట్ల విలువ చేసే పెద్ద నోట్లు చెలామణిలో ఉన్నాయి. రూ.6,099 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆర్బీఐ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లలో జూన్ నెలాఖరు నాటికి 98.29 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంకు తెలిపింది.
రూ.2000 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటురిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు మే 19, 2023న ప్రకటించింది. ఈ పెద్ద నోటును ఉపంసంహరణ ప్రకటన సమయంలో రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రెండు వేల నోట్లు చెలామణిలో ఉన్నాయి. జూన్ 30, 2025 నాటికి వాటి విలువ రూ.6,099 కోట్లకు తగ్గిందని ఆర్‌బిఐ తాజా ప్రకటనలో తెలిపింది.
2000 నోట్లను ఎక్కడ డిపాజిట్ చేయాలి?ఈ 2 వేల రూపాయల నోట్లను డిపాజిట్, మార్పిడి చేసుకునే సౌకర్యం అన్ని బ్యాంకు శాఖలలో 7 అక్టోబర్ 2023 వరకు అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఈ సౌకర్యం భారతీయ రిజర్వ్ బ్యాంక్ కు చెందిన 19 కార్యాలయాలలో మాత్రమే అందుబాటులో ఉంది. RBI ఆఫీసులలో 9 అక్టోబర్ 2023 నుండి ప్రజలు లేదా సంస్థల నుండి 2000 రూపాయల నోట్లను వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. దాంతోపాటు దేశంలోని ఏ పోస్టాఫీసు నుండి అయినా ఇండియా పోస్ట్ ద్వారా ఏ RBI ఆఫీసులకు 2000 రూపాయల నోట్లను పంపి తమ బ్యాంకు ఖాతాలలో జమ చేసుకునే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది.
100 శాతం నోట్లు రిటర్న్ రావడం వీలుపడదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొన్నినోట్లు ఎక్కడైనా భద్రపరిచి మరిచిపోవడం జరుగుతుంది. బ్లాక్ మనీ ఉన్నా కూడా వాటిని వైట్ మనీగా మార్చలేని కారణంగా డిపాజిట్ చేసి మార్చుకోకపోవచ్చు. కొన్ని నోట్లు మిస్సయ్యే అవకాశాలు లేకపోలేదు.