Batukamma 2023: తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ పండుగ. ఆడబిడ్డ‌ల‌ పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. 


బతుకమ్మ సంబరాల్లో ఆరో రోజు ‘ఆశ్వయుజ పంచమి’ ‘అలిగిన బతుకమ్మ, అర్రెం’ అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు. అందుకే పూలతో బతుకమ్మను తయారుచేయరు. గౌరమ్మకు ఎలాంటి నైవేద్యం ఉండదు. కానీ, ఆడపడుచులంతా అమ్మవారి అలక తీరాలని, ఇంటి ముందు పాటలుపాడుతూ బతుకమ్మ ఆడుతూ పూజిస్తారు. పూర్వకాలంలో బతుకమ్మ పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో బతుకమ్మ అలిగి వెళ్లిపోయిందట. అందుకే ఆరో రోజు బతుకమ్మను పేర్చరు. నైవేద్యం పెట్టరు.


ఆరో రోజు: అలిగిన బతుకమ్మ
నైవేద్యం: ఈ రోజు ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించరు.


మొద‌టి రోజు : ఎంగిలిపూల బతుకమ్మ
నైవేద్యం - నువ్వుల పిండి, బియ్యం పిండితో చేసే ప్రసాదం
తయారీ విధానం: కప్పు నువ్వులు తీసుకుని కడాయిలో వేయించాలి. గోధుమ‌ రంగులోకి వచ్చాక తీసి పంచదార వేసి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో బియ్యంపిండి, నూకలు కూడా కలుపుకోవచ్చు. ఇదే ఎంగిలిపూల బతుకమ్మకు సమర్పించే నైవేద్యం.


Also Read : మానసిక సమస్యలు తగ్గించే కౌరవ-పాండవ పూలు, బతుకమ్మ అలంకరణలో వినియోగిస్తారు!


రెండో రోజు: అటుకుల‌ బతుకమ్మ
నైవేద్యం: స‌ప్పిడి పప్పుతో పాటు బెల్లం - అటుకులు     
తయారీ: ముందుగా స‌ప్పిడి పప్పు తయారుచేసుకోవాలి. కందిపప్పుకు కాస్త పసుపు కలిపి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. నెయ్యితో ఆ పప్పును తాళింపు వేసుకోవాలి. ఎండు మిర్చి, పచ్చిమిర్చి వేయకూడదు. ఇది చప్పిడి పప్పు కాబట్టి కారం ఉండకూడదు. 


ఇక బెల్లం-అటుకుల రెసిపీ కోసం ముందుగా కడాయిలో నెయ్యివేసి  జీడిపప్పులు, కిస్మిస్, బాదం వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో బెల్లం వేసి కరిగించుకోవాలి. అవి కరిగాక అటుకులను శుభ్రం చేసి మరీ మెత్తగా నానిపోకుండా తీసి బెల్లంలో వేసి కలిపేయాలి. పైన ముందుగా వేయించిన డ్రైఫ్రూట్స్‌ను చల్లుకోవాలి. అంతే బెల్లం-అటుకుల ప్రసాదం రెడీ. 


మూడో రోజు: ముద్దపప్పు బతుకమ్మ
నైవేద్యం: ముద్దపప్పు
తయారీ: కుక్కర్లో కందిపప్పు, పసుపు, కరివేపాకులు, దంచిన జీలకర్ర, ఒక స్పూను నూనె, నీళ్లు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికాక ఉప్పు కలుపుకోవాలి. ముద్దప‌ప్పు ప్రసాదం సిద్ధమైనట్టే.


నాలుగో రోజు: నానబియ్యం బతుకమ్మ
నైవేద్యం: బెల్లం అన్నం లేదా పరమాన్నం
తయారీ విధానం: ఒక కప్పు బియ్యాన్ని మూడు కప్పుల పాలలో ఉడికించాలి. పాలలో బియ్యం ఉడకవు అనుకుంటే రెండు ఒకటిన్నర కప్పు పాలు, ఒక కప్పు నీళ్లు పోయచ్చు. మరో పక్క కడాయిలో బెల్లాన్ని కరిగించుకోవాలి. అలాగే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అన్నం ఉడికాక చివర్లో కరిగించిన బెల్లం పాకాన్ని వేసి కలపాలి. స్టవ్ ఆపేయాలి. బెల్లంగా బాగా కలిశాక పైన ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేయాలి. అంతే బెల్లం అన్నం సిద్ధం.


ఏడో రోజు: వేపకాయల బతుకమ్మ
నైవేద్యం: బియ్యంపిండితో చేసే వేపకాయలు ప్రసాదం
తయారీ: ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యంపిండి, రెండు స్పూన్ల నువ్వులు, తగినంత ఉప్పు వేసి కలపాలి. అందులో గోరువెచ్చని నీళ్లు వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఆ ముద్దను వేపకాయల్లా చేతితో నొక్కుకుని నూనెలో వేయించాలి. అంతే వేపకాయల ప్రసాదం సిద్ధం.


Also Read : బతుకమ్మలో వినియోగించే ఈ పువ్వు విషపూరితమే కానీ ఉపయోగాలున్నాయి!


ఎనిమిదో రోజు: వెన్నముద్దల బతుకమ్మ
నైవేద్యం: వెన్నముద్దలు
తయారీ: వెన్నముద్దలు చేసేందుకు గిన్నెలో అరకప్పు బియ్యంపిండి వేయాలి. అందులో రెండు స్పూన్ల వెన్న‌, కాస్త వేడి నీళ్లు పోసి చపాతీ పిండిలా వచ్చే వరకు క‌లపాలి. ఇప్పుడు చిన్న ముద్ద తీసి గులాబ్ జాముల్లా గుండ్రంగా చుట్టుకోవాలి. అలా గుండ్రని ముద్దలు త‌యార‌య్యాక వాటిని నూనెలో వేయించాలి. మరో పక్క పంచదార పాకం త‌యారుచేసుకుని, వేయించిన వెన్నముద్దలను తీసి ఆ పాకంలో వేయాలి. అంతే.. అమ్మవారికి తీయని వెన్నముద్దల నైవేద్యం సిద్ధ‌మైనట్టే. 


తొమ్మిదో రోజు - సద్దుల బతుకమ్మ
నైవేద్యం : కొబ్బరన్నం, నువ్వుల సద్ది, నిమ్మకాయ పులిహోర‌, చింతపండు పులిహోర, దద్దోజనం... ఇలా ఐదు రకాల నైవేద్యాలను తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.