Earth News: సౌర మండలంలోని కొన్ని ఇతర గ్రహాల మాదిరే భూమికి కూడా ఒకటికి మించి చందమామలు సాకారమయ్యే రోజు త్వరలోనే రానుంది. ఇప్పుడున్న మూన్‌తో పాటే భూమికి రెండో మూన్ కూడా రానుంది. అయితే ఇది రెండు నెలలు మాత్రమే ఉంటుంది. అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్‌లో ఉన్న 2024PT5 గా పిలిచే ఒక ఆస్టరాయిడ్ సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు దాదాపు రెండు నెలల పాటు భూకక్ష్యలో పరిభ్రమించనుంది. ఆ తర్వాత మళ్లీ తన దిశను మార్చుకొని తిరిగి సూర్యుడి కక్ష్యలో పరిభ్రమిస్తుంది. రెండు నెలల పాటు అతిథిగా ఉండనున్న చిన్న చందమామయ్య గురించిన విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ రెండో మామయ్య ఎక్కడి నుంచి వస్తున్నాడు..?
మినిమూన్ ఈవెంట్స్‌పై నిరంతరం పరిశోధనలు చేసే స్పెయిన్‌లోని డి మాడ్రిడ్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్త కార్లోస్ బృందం కొన్నేళ్లుగా ఈ మినీ మూన్ ఈవెంట్స్‌పై పరిశోధన చేస్తోంది. ప్రస్తుతం భూమికి దగ్గరగా వస్తున్న 2024PT5 గ్రహశకలం.. అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్‌కు చెందిందని కార్లోస్ తెలిపారు. ఈ బెల్ట్ స్పేస్‌లో ఉన్న రెండో ఆస్టరాయిడ్ బెల్ట్. ఇది సూర్యుడికి 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ఉంటుంది. అంతే కాకుండా ఈ బెల్ట్ భూ కక్ష్యకు దగ్గరగా ఉండడం వల్ల అప్పుడప్పుడూ ఈ బెల్ట్‌లోని గ్రహశకలాలు.. భూమికి దగ్గరగా వచ్చి వెళ్తుంటాయి. కొన్నాళ్లపాటు చంద్రుడితో పాటు ఇవి కూడా భూమి చుట్టూ తిరుగుతూ సెకండ్ మూన్ అనుభూతిని భూమికి కలిగిస్తుంటాయి. అయితే ప్రస్తుతం భూమికి దగ్గరగా వచ్చి భూకక్ష్యలో పరిభ్రమించనున్న ఈ 2024పీటీ5 ఆస్టరాయిడ్.. భూమి చుట్టూ పూర్తి భ్రమణం చేయకుండా మధ్యలోనే సూర్యుడి కక్ష్యలోకి వెళ్లిపోతుందని కార్లోస్ మార్కోస్ వివరించారు.
మినీ మూన్ ఈవెంట్స్ ఎన్నిరకాలు:
మినీ మూన్ ఈవెంట్స్ రెండు రకాలుగా ఉంటాయి. సుదీర్ఘ కాలం ఉండేవి, స్వల్పకాలం ఉండేవి. సుదీర్ఘ కాలం మినీ-మూన్ ఈవెంట్స్ దాదాపు ఏడాది లేదా అంతకు మించిన ఎక్కువ సమయం ఉంటాయి. స్వక్పకాలిక మినీ మూన్ ఈవెంట్స్.. వారాలు లేదా కొద్ది నెలలు మాత్రమే సంభవిస్తాయి. సుదీర్ఘకాలపు మినీ మూన్ ఈవెంట్స్ ప్రతి పదేళ్లకు లేదా ఇలవై ఏళ్లకు జరుగుతుండగా.. స్వల్పకాలిక మినీమూన్ ఈవెంట్స్ మాత్రం ఒక దశాబ్దంలో పలుమార్లు జరిగే అవకాశం ఉందని కార్లోస్ తెలిపారు. సూర్యుడి గ్రావిటేషనల్ ఫోర్స్ బలంగా ఈ ఆస్టరాయిడ్స్‌పై ఉండడం వల్ల అవి తిరిగి సూర్యుడి కక్ష్యలోకి వెళ్తుంటాయి.
రెండో మూన్‌ను చూడగలమా..?
రెండో మూన్‌ను చందమామ లాగే చూడగలమా అంటే కష్టసాధ్యం అంటున్నారు శాస్త్రవేత్తలు. అమెచ్యూర్ టెలిస్కోప్స్, బైనాక్లోర్స్ సాయంతో ఈ 2024PT5 ను చూడలేమని మార్కోస్ తెలిపారు. పెద్ద టెలిస్కోప్‌లు, ఇతర అధునాత ఎక్విప్‌మెంట్ సాయంతో స్పేస్ శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని చూడగలరు. 30 ఇంచెస్ డయామీటర్ ఉన్న CCD లేదా CMOS డిటెక్టర్ ఉన్న టెలిస్కోప్ సాయంతో ఈ రెండో చందమామను చూడగలమని కార్లోస్ చెప్పారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని 2024PT5ను ఫొటోమెట్రిక్, స్పెక్ట్రోమెట్రిక్ విశ్లేషణ చేయడం సహా శాస్త్రవేత్తలకు నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్‌మీద పరిశోధన చేసి మన సోలార్ సిస్టమ్‌లోని ప్రత్యేకతలపై అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని మార్కోస్ వివరించారు.
Also Read: టప్పర్‌వేర్ ఇంత షాక్ ఇచ్చిందేంటి గురూ, తట్టుకోవడం కాస్త కష్టమే!