Characteristics of Ashwini Nakshatra: 27 నక్షత్రాలలో మొదటిది అశ్విని. అశ్వినీ నక్షత్ర జాతకులు అశ్వం (గుర్రం)లా ఉరిమే ఉత్సాహంతో ఉంటారు. అద్భుతమైన తెలివితేటలుంటాయి. క్రీడలపై ఆసక్తి ఉంటుంది. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదం వంటి వైద్యం యందు ఆసక్తితో ఉంటారు. వీరికి ధైర్యసాహసాలు అధికం..ఎలాంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల సలహాలు స్వీకరించినా చివరకు తమకు నచ్చినట్లు నిర్ణయం తీసుకుంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక రాజకీయనాయకులుగా, అధికారులుగా చక్కగా రాణిస్తారు. ఇతరులకు కింద పనిచేయడం వీరికి నచ్చదు..అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ నక్షత్రానికి చెందిన స్త్రీ-పురుషుల గుణగణాలు ఇలా ఉంటాయి
Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!
అశ్విని నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. ఈ నక్షత్రంలో ఉన్న నాలుగు పాదాలు మేషరాశికే చెందుతాయి.
మొదటి పాదం
అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతి కుజుడు. వీరు శక్తికి మించిన సామర్థ్యం ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు. కొన్ని సార్లు అనవసర విషయాలపై దృష్టి సారిస్తారు. పనికి రాని ఆలోచనలు బుర్రను తొలుస్తుంటాయి. సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం పొందాలన్న తాపత్రయపడతారు.
రెండో పాదం
అశ్విని నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాశ్యధిపతి శుక్రుడు. దీంతో వీరు పట్టుదల గల వారు. ఎదుటి వ్యక్తుల స్వభావాన్ని త్వరగా గ్రహిస్తారు. చాలా విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. తలపెట్టిన కార్యాన్ని సాధించడంలో అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుంటారు. మంచి ఆత్మవిశ్వాసం గలవారై ఉంటారు.
మూడో పాదం
అశ్విని మూడో పాదంలో జన్మించిన వారు ప్రాచీన శాస్త్రాలను ఇష్టపడతారు. ముఖ్యంగా జ్యోతిష్యం, తర్క శాస్త్రాలపై మక్కువ ఉంటుంది. చక్కటి సలహాలు ఇవ్వడంలో నేర్పరులు.
నాలుగో పాదం
అశ్వని నాలుగో పాదంలో జన్మించిన వారు కళాత్మకంగాను, అలంకార ప్రియులుగానూ, నిదానమైన ప్రవర్తనతోనూ ఉంటారు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. నిరంతరం కొత్త విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. లక్ష్యసాధనలో వెనుకడుగు వేయరు. అయితే వీరికి కష్టపడితేనే ఫలితం దక్కుతుంది.
Also Read: ఇంటి ద్వారం ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి
అశ్విని నక్షత్ర పురుషుల గుణగణాలు
- అశ్వినీ నక్షత్రంలో జన్మించిన పురుషులు ప్రకాశవంతమైన కళ్ళు, విశాలమైన నుదురుతో ఆకర్షణీయంగా ఉంటారు
- దయగలవారు, తమ గురించి శ్రద్ధ వహించే వ్యక్తుల కోసం ఎంతదూరమైనా వెళతారు
- వారు జీవితంలో ఎదుర్కొన్న సమస్యల ద్వారా ఇతరులకు మార్గనిర్ధేశం చేసే సామర్థ్యం కలిగి ఉంటారు
- అశ్విని నక్షత్రంలో జన్మించిన మగవారు విమర్శలకు భయపడతారు, ఇది కొన్ని సార్లు లేనిపోని ఇబ్బందులకు గురిచేస్తుంది
- వీరు తమకి తామే యజమానులుగా ఉండేందుకు ఇష్టపడతారు
- సంగీతం, సాహిత్యం, ప్రకటనలు మొదలైన సృజనాత్మక రంగాల్లో బాగా రాణిస్తారు
- అనుకూలవతిఅయన భార్య, మంచి స్నేహితులను పొందుతారు
- వీరికి 26 నుంచి 30 సంవత్సరాల మధ్య వివాహం జరగాలి లేదంటే చాలా ఆలస్యం అవుతుంది
- సోమరితనం, అజాగ్రత్త వల్ల నష్టపోతారు
- ఈ నక్షత్రానికి చెందిన వారు శరీర నొప్పులు, దంతాల బాధలు, మధుమేహం వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది
అశ్విని నక్షత్ర స్త్రీ గుణగణాలు
- అశ్వినీ నక్షత్రంలో జన్మించిన స్త్రీ ప్రకాశవంతమైన కళ్ళు, విశాలమైన నుదురు కలిగి ఉంటుంది
- ఆధునిక , సంప్రదాయిక లక్షణాల కలగలపి ఉంటుంది
- ఈ నక్షత్రానికి చెందిన స్త్రీలు స్వభావరీత్యా చాలా ఓపిక కలిగి ఉంటారు, అయితే, కొన్నిసార్లు అపరిపక్వంగా ప్రవర్తిస్తారు
- కొత్త గా నేర్చుకునేందుకు, కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు
- అశ్వినీ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు పరిపాలనా విభాగంలో రాణిస్తారు
- డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు బాగా పొదుపుచేయగలుగుతారు
- ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించడంపై ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటారు
- ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీ సాధారణంగా 23 నుంచి 26 సంవత్సరాల మధ్య వివాహం చేసుకోవడం మంచిది
- ఋతు సమస్యలతో బాధపడవలసి ఉంటుంది
ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది.ఆ తర్వాత కొన్ని ఒడిదొడుకులుంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. జాతకచక్రం, లగ్నం, పుట్టిన సమయం, మాసాన్ని బట్టి కూడా గుణగణాలలో కొద్దికొద్దిగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.