దేశంలో సామాజిక న్యాయాన్ని పాటించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. అక్టోబర్ 26వ తేదీ (గురువారం) నుంచి మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికార యాత్ర ప్రారంభం కానుంది. ఆ వివరాలను మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి వివరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో సామాజిక సాధికార యాత్ర వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. 


175 నియోజకవర్గాల్లో సామాజిక భేరి: మంత్రి జోగి రమేష్
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సామాజిక ధర్మం పాటించిన ఏకైక సీఎం జగన్‌ అని మంత్రి జోగి రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వాన్ని పటిష్టపరుస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి పేదలకు – పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధంలో అంతా జగనన్నకు అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు. జగనన్న పాలనలో కేబినెట్‌ కూర్పు దగ్గర నుంచి 68 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. 


టీడీపీ హయాంలో బీసీ అంటే బిజినెస్‌క్లాస్‌.. జగన్ పాలనలో బీసీలను సమాజానికి బ్యాక్‌బోన్‌ క్లాస్‌గా మార్చారు. మూడు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ఉంటుందన్నారు. మొదటి విడత ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమల మూడు చోట్ల కూడా రణభేరి మోగించబోతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలమంతా సంఘటితంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. నిజం గెలవాలని చంద్రబాబు సతీమణి యాత్ర చేపడుతున్నారని, అవినీతి బయటపడింది కాబట్టే బాబు రాజమండ్రి జైల్లో ఉన్నాడని అన్నారు. చంద్రబాబు చేసిన పాపాలన్నీ పండాయి కాబట్టే అరెస్టు అయ్యాడని, కనుక పాప పరిహార యాత్ర అని పేరుతో భువనేశ్వరి యాత్ర చేస్తే బాగుంటుందని సూచించారు.


మాది పేదల యాత్ర, వారిది జైల్లోని వ్యక్తి కోసం యాత్ర
బస్సు యాత్ర ప్రచారం మూడు దశల్లో జరుగుతుందని, బసు యాత్ర మొదటి దశ ప్రచారం అక్టోబర్ 26న ప్రారంభమై నవంబర్ 9 నాటికి ముగుస్తుందని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. మొదటి యాత్ర 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనుంది. రాష్ట్రాన్ని ఉత్తర, మధ్య, దక్షిణ ఆంధ్రాగా మూడు ప్రాంతాలుగా విభజించి మూడు దశలలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో నియోజకవర్గం చొప్పున అలా మూడు చోట్ల యాత్ర ఉంటుందన్నారు. చంద్రబాబు హయాంలో జరిగినన్ని దాడులు దళితుల మీద మరెప్పుడూ జరగలేదని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గిందని, వైయస్ఆర్సీపీ పేదల ప్రభుత్వమని ఉద్ఘాటించారు.


బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు ఈ యాత్ర ద్వారా వివరిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పేదల పిల్లలకు ఇంగ్లీషు మీడియం వద్దని, ఇళ్ల పట్టాలు వద్దనీ, అమరావతిలో పేదలు ఉండడానికి వీల్లేదని చంద్రబాబు ప్రయత్నించారని, వారిని ఆలయాల్లోకి కూడా రానివ్వలేదని అన్నారు. జగన్ సీఎం అయ్యాకే పేదలకు అవే ఆలయ కమిటీలలో పదవులు ఇచ్చారని చెప్పారు. నారా భువనేశ్వరి చేస్తున్న యాత్రలో చంద్రబాబు ఎన్టీఆర్ ను ఎలాంటి వేధింపులకు గురి చేశారో చెప్పాలని, ఇప్పటికైనా నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులతో పవన్‌ ఇంగ్లీష్‌లో మాట్లాడగలరా? అని ప్రశ్నించారు.


కరోనా సమయంలో తిండిలేక అనేక రాష్ట్రాల్లో ప్రజలు చనిపోయారని, కానీ జగన్ పుణ్యమా అని ఏపీలో ఆ పరిస్థితి రాకుండా సంక్షేమ కార్యక్రమాలు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి  అన్నారు. పక్షపాతం చూడకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంక్షేమం అందించారని చెప్పారు. ఏపీలో సుమారు 70% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారున్నారని, వారి అవసరాలను గుర్తించడం ప్రాథమిక కర్తవ్యమని ఎస్టీ సెల్‌ ఛైర్మన్‌ హనుమంత్‌ నాయక్‌ అన్నారు. 
వైసీపీ బస్సు యాత్ర షెడ్యూల్
అక్టోబ‌ర్ 26 – ఇచ్చాపురం, తెనాలి, శింగ‌న‌మ‌ల‌
అక్టోబ‌ర్ 27 – గ‌జ‌ప‌తిన‌గ‌రం, న‌ర‌సాపురం, తిరుప‌తి
అక్టోబ‌ర్ 28 – భీమిలి, చీరాల, పొద్దుటూరు
అక్టోబ‌ర్ 30 – పాడేరు, దెందులూరు, ఉద‌య‌గిరి
అక్టోబ‌ర్ 31 – ఆముదాల‌వ‌ల‌స, నందిగామ, ఆదోని
న‌వంబ‌ర్ 1 – పార్వతీపురం, కొత్తపేట, క‌నిగిరి
న‌వంబ‌ర్ 2 – మాడుగుల, అవ‌నిగ‌డ్డ, చిత్తూరు
న‌వంబ‌ర్ 3 – న‌ర‌స‌న్నపేట, కాకినాడ రూర‌ల్, శ్రీకాళ‌హ‌స్తి
న‌వంబ‌ర్ 4 – శృంగ‌వ‌ర‌పుకోట, గుంటూరు ఈస్ట్, ధ‌ర్మవ‌రం
న‌వంబ‌ర్ 6 – గాజువాక, రాజ‌మండ్రి రూర‌ల్, మార్కాపురం
న‌వంబ‌ర్ 7 – రాజాం, వినుకొండ, ఆళ్లగ‌డ్డ
న‌వంబ‌ర్ 8 – సాలూరు, పాల‌కొల్లు, నెల్లూరు రూర‌ల్
న‌వంబ‌ర్ 9 – అన‌కాప‌ల్లి, పామ‌ర్రు, తంబ‌ళ్లప‌ల్లె


బస్సు యాత్ర ఎలా సాగుతుందంటే?
బస్సు యాత్ర ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో జరుగుతుంది. ఈ యాత్ర అమలు కోసం, రాష్ట్రాన్ని ఉత్తర, మధ్య, దక్షిణ ఆంధ్రాలో ప్రతి రోజు ఒక్కో ప్రాంతంలో ఒక్కో నియోజకవర్గం చొప్పున అలా మూడు చోట్ల యాత్ర సాగుతుంది. SC, ST, BC, మైనారిటీ నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ యాత్ర మధ్యాహ్న భోజన సమావేశంతో ప్రారంభమవుతుంది. నియెజకవర్గంలోని ఓ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహిస్తారు.


మధ్యాహ్న భోజన సమావేశాలు: ప్రతి నియోజకవర్గంలో బస్సు యాత్ర భోజనంతో ప్రారంభమవుతుంది. అందులో ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు (RCలు), ముఖ్య నేతలు... షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 200 మంది నాయకులతో కలిసి భోజనం చేస్తారు. అనంతరం మీడియాకు యాత్ర గురించి వివరిస్తారు. బస్సు యాత్ర వెళ్లే మార్గంలో నాయకులు ముందుగా నిర్ణయించిన స్టాప్‌లలో ప్రజలతో మమేకమయ్యే విధంగా కొన్ని స్టాప్ లను పెడతారు. అక్కడ ఆగి బస్సుపై ఏర్పాటు చేసిన వేదికపై నుంచి నేతలు మాట్లాడతారు. 


పబ్లిక్ మీటింగ్‌లు: ప్రతి నియోజకవర్గంలో బస్సు యాత్ర చివరిగా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. అక్కడి స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా మైనార్టీ నాయకులు పాల్గొని వారి సంఘలను ఉద్దేశించి మాట్లాడతారు. ఇందులో స్థానికంగా ఉండే ఏ సంఘం అయినా పాల్గొనవచ్చు.