YSRCP Waqf Bill: వక్ఫ్ బిల్లు విషయంలో తాము బీజేపీని వ్యతిరేకించామని వైసీపీ ప్రకటించింది. బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా పార్లమెంట్ ప్రసంగాల్లో ఆ పార్టీ ఎంపీలు చెప్పారు. రాజ్యసభలో జరిగిన ఓటింగ్ లో వైసీపీ ఎంపీలు ఓటు వేశారా .. ఓటు వేస్తే ఎవరికి వేశారు.. అన్నది సస్పెన్స్ గా మారింది. రాజీనామా చేసిన వాళ్లు పోగా ఏడుగురు వైసీపీ ఎంపీలు ఉన్నారు. వారు వక్ఫ్ బిల్లుకు మద్దతుగా ఓటేశారని టీడీపీ ఆరోపించారు. వక్ఫ్ బిల్లు విషయంలో కనీసం సవరణలు కూడా ప్రతిపాదించకుండా మద్దతు ఇచ్చి ముస్లింలను మోసం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. [
టీడీపీ ఆరోపణలపై వైవీ సుబ్బారెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేయాలని మా పార్టీ విప్ జారీచేసింది. మేం వ్యతిరేకించాము అనడానికి లోక్‌సభ, రాజ్యసభల్లో రికార్డయిన ఉభయసభల కార్యకలాపాలే సాక్ష్యం. రాజ్యసభలో వక్ఫ్ బిల్లు పై నేను చేసిన ప్రసంగం మరొక ప్రత్యక్ష సాక్ష్యం.బిల్లును మేం వ్యతిరేకించలేదు అని నిరూపించే దమ్ము మీకు ఉందా అని సవాల్ విసిరారు.
అయితే వైవీ సుబ్బారెడ్డి బిల్లును వ్యతిరేకించినట్లుగా ప్రకటించింది నిజమే కానీ.. ఓటింగ్ ఎలా చేశారన్నది మాత్రం స్పష్టత లేదు. పార్లమెంట్ రికార్డులు కూడా వెలుగులోకి రాలేదు. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. అంటే 236 మంది ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ 223 మంది పాల్గొన్నారు. వైసీపీ సభ్యులు కొంత మంది వక్ఫ్ కు మద్దతుగా ఓటేశారు.. లేకపోతే బీజేపీకి ఇబ్బంది లేకుండా ఓటింగ్ కు దూరంగా ఉన్నారని ఓటింగ్ ను పరిశీలించిన వారు చెబుతున్నారు. బీజేడీకి ఏడు మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఒకరిద్దరు వక్ఫ్ బిల్లుకు సపోర్టు చేశారు. అన్నాడీఎంకే ముగ్గురు ఉన్నారు బాయ్ కాట్ చేశారు.ఇలా ఏ విధంగా చూసినా వైసీపీ ఎంపీల ఓట్లు మాత్రం లెక్కలోకి రావడంలేదని టీడీపీ వర్గాలంటున్నాయి. పార్లమెంట్ ప్రసంగంలో తాము వ్యతిరేకిస్తామని ప్రకటించి వక్ఫ్ బిల్లును వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఉండటంతో .. వైసీపీ తీరుపై విమర్శలు చేస్తున్నారు.