Madakasira YSRCP Candidate Name: పుట్టపర్తి: ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇదివరకే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) రెండు జాబితాలలో ఇంఛార్జ్‌లను నియమించారు. మూడో జాబితా (YSRCP Third List)పై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలు, ఎంపీల మూడవ లిస్టులో సత్యసాయి జిల్లా నుంచి భారీగా మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గమైన మడకశిరలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు అనివార్యమైనట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి డాక్టర్ తిప్పేస్వామికి అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈరన్న పై వైసీపీ అభ్యర్థి అయిన డాక్టర్ తిప్పేస్వామి గెలుపొందారు. ఈ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. 
తిప్పేస్వామిపై నియోజకవర్గంలో వ్యతిరేకత !
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వైఎస్ఆర్ సీపీకి సహకరించినట్లు అప్పట్లో నియోజకవర్గంలో బాగా ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతం సామాజిక సమీకరణాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న డాక్టర్ తిప్పేస్వామిపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతకు అనుగుణంగా తిప్పే స్వామికి టికెట్ లేదని ముందుగానే పార్టీ అధిష్టానం తెలియజేసింనట్లు సమాచారం. అనంతరం ఈ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి కోసం వైసిపి అధిష్టానం వేట మొదలుపెట్టింది. 
మడకశిర నుంచి సీఐకి అవకాశం!
మడకశిర నియోజకవర్గం నుంచి ఎస్సీ అభ్యర్థిగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీఐగా పనిచేసిన శుభకుమార్ వైసీపీ టికెట్ కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా వైసిపి టికెట్ ఆశించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో పార్టీ అధిష్టానం శుభకుమార్ కు టికెట్ కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శుభ కుమార్ కు ఉమ్మడి అనంతపురం జిల్లా సుపరిచితం. జిల్లాలో పలు మండలాల్లోనూ పోలీసు అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఒక మంచి ఆఫీసర్ గా కూడా శుభకుమార్ కు గుర్తింపు ఉంది. వివాదాలకు దూరంగా ఉండే ఈయన అందర్నీ కలుపుకొని పోయే మనస్తత్వం కల వ్యక్తి. శుభ కుమార్ ఎస్సీ నియోజకవర్గమైన మడకశిర నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నాడు. 


గతంలో పలువురు ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున టికెట్ ఆశించిన వారు ఎవరికి టికెట్ దక్కేలా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే రెండు దఫాలుగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. వైసీపీ మూడవ లిస్ట్ రిలీజ్ చేయనున్న క్రమంలో మడకశిర నియోజకవర్గం నుంచి పోలీస్ అధికారైన శుభకుమార్ పేరు ఖరారు చేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోలీసు అధికారులకు అవకాశం కల్పించారు. హిందూపురం ఎంపీగా గోరంట్ల మాధవ్ కి, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ dig మహమ్మద్ ఎక్బాల్ కి అవకాశం కల్పించారు. అదే కోవలోనే 2024 ఎన్నికలకు ఎస్సీ నియోజకవర్గం అయిన మడకశిర నుంచి మరో పోలీసు అధికారి శుభకుమార్ కి అవకాశం కల్పిస్తున్నారని జిల్లా వైసీపీ నేతల్లో చర్చ జరుగుతోంది.