YSRCP social media activists are attacking anchor Rashmi: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ నేతలు నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనలు ఇప్పుడు ఒక కొత్త వివాదానికి తెరలేపాయి. ముఖ్యంగా తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి చేసిన నిరసనపై నటి, యాంకర్ రష్మీ గౌతమ్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో యుద్ధానికి దారితీసింది. జంతు ప్రేమికురాలిగా గుర్తింపు పొందిన రష్మీ, నిరసన పేరుతో ఎద్దులను హింసించడాన్ని తప్పుబడుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ వర్సెస్ సెలబ్రిటీ వార్‌గా మారింది.

Continues below advertisement

 నిరసనలో ఎద్దుల వేదన.. రష్మీ ఆగ్రహం!

రాష్ట్రంలో ఇంధన కొరతను నిరసిస్తూ భూమన అభినయ్ రెడ్డి ఒక ఎడ్లబండిపై ఆటోను ఎక్కించి ప్రదర్శన నిర్వహించారు. అయితే, ఆ ఎడ్లబండిపై ఆటోతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా ఎక్కడంతో ఆ బరువును మోయలేక ఎద్దు  తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. ఈ దృశ్యాలను గమనించిన రష్మీ గౌతమ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  ఆ ఎద్దు పడిన వేదన కంటే వెయ్యి రెట్లు ఎక్కువ వేదనను మీరు అనుభవించాలి అని శాపనార్ధాలు పెట్టారు.  జంతువులను హింసించే హక్కు ఎవరికీ లేదని, పెటా వంటి సంస్థలు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.  

Continues below advertisement

 వైసీపీ సోషల్ మీడియా రియాక్షన్

రష్మీ చేసిన ఈ ట్వీట్‌పై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.  ప్రజల కష్టాల గురించి మాట్లాడకుండా కేవలం జంతువుల గురించి మాట్లాడుతున్నారా అని కొందరు,  రాజకీయాల్లో తలదూర్చవద్దు అని మరికొందరు హెచ్చరించారు. రష్మీ గతాన్ని, ఆమె చేసే షోలను ప్రస్తావిస్తూ వ్యక్తిగత దూషణలకు కూడా దిగడంతో వాతావరణం వేడెక్కింది. అయితే, రష్మీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వారికి తనదైన శైలిలో సమాధానాలు ఇస్తున్నారు.

 తగ్గని రష్మీ.. కౌంటర్ల పర్వం

వైసీపీ కార్యకర్తలు చేస్తున్న విమర్శలకు రష్మీ కూడా ఘాటుగా బదులిస్తున్నారు.  రాజకీయ పార్టీలతో నాకు సంబంధం లేదు.. ఏ పార్టీ చేసినా జంతువుల పట్ల హింసను నేను ఖండిస్తాను అని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ఉనికి కోసం మూగజీవాలను అలా హింసించడం ఏ రకమైన నిరసన అని ఆమె ప్రశ్నిస్తున్నారు.  మీరు నన్ను ఎంత ట్రోల్ చేసినా నా అభిప్రాయం మారదు.. తప్పు తప్పే అని ఆమె కుండబద్దలు కొడుతున్నారు. ఆమెకు మద్దతుగా నెటిజన్లు, జంతు ప్రేమికులు కూడా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు.  

 నిబంధనల ఉల్లంఘనపై చర్చ

యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ నిబంధనల ప్రకారం.. జంతువులపై పరిమితికి మించిన బరువులు వేయడం నేరం. అభినయ్ రెడ్డి నిరసనలో ఒక ఆటోను, సుమారు ఐదుగురు మనుషులను ఎడ్లబండిపైకి ఎక్కించడం స్పష్టంగా నిబంధనల ఉల్లంఘనేనని జంతు హక్కుల కార్యకర్తలు వాదిస్తున్నారు. కేవలం ప్రచారం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని, రష్మీ చేసిన పోరాటంలో తప్పులేదని వారు మద్దతు తెలుపుతున్నారు. 

 రాజకీయ రంగు పులుముకున్న వివాదం

ఈ వివాదం ఇప్పుడు కేవలం రష్మీ , వైసీపీ కార్యకర్తల మధ్య కాకుండా.. రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ, జనసేన శ్రేణులు రష్మీకి మద్దతుగా నిలుస్తుండగా, వైసీపీ శ్రేణులు ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాయి. అధికారికంగా భూమన అభినయ్ రెడ్డి వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చ మాత్రం ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు.