MP Madhav: సంచలనం సృష్టించిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇష్యూ మరో టర్న్‌ తీసుకుంది. ఆ విషయంలో మొదలైన రచ్చ ఇంకా సమసిపోలేదు. వీడియోలో ఉన్న మహిళ ఈమెనంటూ చాలా ఫొటోలను మాధవ్‌ ప్రత్యర్థులు ప్రచారం చేశారు. ఇందులో తనకు సంబంధం లేదంటూ ఓ మహిళ బయటకు వచ్చి మొరపెట్టుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి, జగన్‌కు మద్దతుగా ఉన్నామన్న కక్షతోనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 


గోరంట్ల వీడియోలో ఉన్నది తాను కాదని.. కావాలనే తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించారు.  తన ఫొటోలను మార్ఫింగ్ చేసి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారామె. సత్యసాయి జిల్లా గండ్లపెంట పోలీసులకు తన ఫిర్యాదు అందజేశారు. ఎలాంటి భయం లేకుండా తనకు జరిగిన అన్యాయాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె తన అభిమానులతో పంచుకున్నారు. కావాలనే తన పరువు పోయేలా చేస్తున్నారని... వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌ నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ డైరెక్షన్ లొనే జరుగుతుందని ఆరోపించారు. అంతే కాకుండా జనసేన పార్టీకి చెందిన కొంత మంది నాయకులు కూడా తనను టార్గెట్ చేశారని వాపోతున్నారు ఆ మహిళ.  


నాలుగేళ్లుగా పనిచేస్తున్నా.. అందుకే టార్గెట్ చేశారు!


తాను నాలుగేళ్లుగా వైసీపీ సోషల్ మీడియాలో వైఎస్సార్ సీపీ కోసం స్వచ్చంధంగా పని చేస్తున్నానని, అప్పటి నుంచి టీడీపీకి చెందిన కొంత మంది తనను టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. తనను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, ఇప్పడు మరీ నీచంగా ఎంపీ మాధవ్ పక్కన ఫొటో పెట్టి మార్ఫింగ్ చేశారు అన్నారు. ఇదంతా టీడీపీ కుట్ర అని ఆ పార్టీ కార్యాలయం నుంచే ఇదంతా జరుగుతుందని వివరించారు. లోకోష్ డైరక్షన్ లోనే కుట్ర జరిగిందని మహిళలను ఇంతలా వేధించడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. 


ఎంపీ రఘు రామ కృష్ణం రాజు కూడా ఇబ్బందులు పెడుతున్నాడు..!


వైఎస్‌ఆర్‌సీపీ రెబల్ లీడర్, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు కూడా రెండేళ్లుగా తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు ఆమె. తన భర్త ఫొటోను మార్ఫింగ్ చేసి వ్యక్తిగతంగా దూషించారన్నారు. అవన్నీ ఎవరు చేశారో తెలిసినా భరించానని తెలిపారు. ఇప్పుడు ఎంపీ మాధవ్ వ్యవహారంలో ఆయన పక్కన, తన ఫొటోను పెట్టి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారని... ఇది చాలా ఇబ్బందిగా ఉందని మండిపడ్డారామె.


టీడీపీ లీడర్లు చేస్తున్న ప్రచారానికి కొంతమంది జనసేన పార్టీ వాళ్లు కూడా తోడ్పాటు ఇస్తున్నారని... వాళ్లు కూడా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారామె. కరీమ్, వేణు, చందు, నవీన్ కుమార్, రమణ అనే ఐదుగురు తనను సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన ఫొటో మార్ఫింగ్ చేసిన, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.