కర్నూలు జిల్లాలో స్కూలు నడవక అప్పుల పాలైన ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు ఆత్మహత్య చేసుకున్న  పరిస్థితులకు కారణమైన వారిని దేవుడు శిక్షిస్తాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు ప్రైవేటు స్కూల్ ఓనర్లు అయిన దంపతులు తీసుకున్న సెల్ఫీ వీడియోను ప్రదర్శించారు. ప్రభుత్వ స్కూళ్లకు రంగులేస్తున్నారు కానీ ఉపాధ్యాయులు ఉండటం లేదని.. అందుకే ప్రైవేటు స్కూల్ టీచర్లందరినీ ప్రభుత్వ స్కూళ్లలో పాఠాలు చెప్పేందుకు ఉద్యోగంలోకి తీసుకోవాలని రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్‌కు సూచించారు. ప్రైవేట్ టీచర్లకు స్కూల్స్‌లో జీతాలు కూడా ఇవ్వడం లేదని... ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడే పరిస్థితులో ఉన్నాయని వారిని ఆదుకునే మానవత్వం సీఎం జగన్‌కు లేదా అని ప్రశ్నించారు. 


విచిత్ర పథకాలు పెట్టడం ద్వారానే విద్యా సంస్థలకు కష్టాలు ఎదురవుతున్నాయన్నారు.  స్కూళ్లకు రంగులేయండ కన్నా ఉపాధ్యాయుల్ని నియమించడం ముఖ్యమని.. కానీ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరన్నారు.అమ్మఒడి పేరుతో  ఇచ్చిన డబ్బులు నాన్న బుడ్డికి వెళ్తున్నాయని, రకరకాల స్కీమ్‌లు తీసుకొచ్చి ఇలాంటి వారి జీవితాలతో ఆడుకోవద్దని ముఖ్యమంత్రికి సూచించారు. ఇతర సమస్యలపైనా రఘురామకృష్ణరాజు స్పందించారు. పట్టపగలు విద్యార్థిని రమ్యశ్రీని ఒక ఉన్మాది అందరూ చూస్తుండగానే చంపేశాడని... సిగ్గుపడాలన్నారు. ఒక్క సారిగా వరద వచ్చి కృష్ణా జిల్లా చెవిటికల్లు వద్ద ఒకే సారి 150 లారీలు ఇరక్కుపోయిన ఘటనపైనా స్పందించారు. 


ఇసుక అక్రమ తరలింపులు జరుగుతున్నాయని.. కృష్ణానదిలో ఇరుక్కుపోయిన 150 లారీలు నేరుగా తెలంగాణకు వెళ్ళడానికి అర్థరాత్రి పూట ఇసుక కోసం వచ్చాయన్నారు.  సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకడం లేదని... ఉచితంగా దొరికే ఇసుకను రూ. 25 వేలు చేశారని... ఇది ప్రభుత్వ వైఫల్యమని, ఇసుక అంశంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని  సీఎం దృష్టికి తీసుకెళ్లారు.  ఉపాధి హామీ నిధులు వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాశానని స్పష్టం చేశారు. ఈ అంశంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించామని కోర్టుకు చెప్పిన అధికారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కోర్టులకు అబద్దాలు చెబుతున్నారని .. వారిని ప్రోత్సహించిన వారిని కూడా జైల్లో పెట్టాలన్నారు 


ఓ ప్రైవేటు సంస్థ ప్రకటించిన ర్యాంకులపైనా స్పందించారు. సీఎం జగన్ టాప్ ర్యాంకింగ్‌లో లేకుండా పోయారని... మూడు నెలల్లో జరిగిన సంఘటనలతో ర్యాంకింగ్ పడిపోయిందని విశ్లేషించారు. వీటన్నింటినీ చూసుకుని ముందుకెళ్లాలని ఆయన జగన్‌కు సూచించారు. రఘురామకృష్ణరాజు ప్రతీ రోజు రచ్చబండ పేరుతో ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రభుత్వంపై రోజువారీగా విమర్శలు చేస్తున్నారు.