YSRCP Candidates for Assembly Elections 2024: అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) భావిస్తున్నారు. ఎన్నికలపై ఫోకస్ చేసిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్.. ఇదివరకే రెండు జాబితాలలో అభ్యర్థులను ప్రకటించారు. రెండు జాబితాల్లో 38 స్థానాల్లో జగన్ అభ్యర్థుల మార్పులు చేర్పులు చేసి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాకిచ్చారు. నియోజకవర్గాల సమన్వయకర్తల మూడో జాబితా ఏ క్షణంలోనైనా విడుదల కానుంది. పార్టీ అధినేత జగన్ కీలక నేతలతో చర్చించి, అభ్యర్థులకు నచ్చజెప్పి మార్పులు చేర్పులు చేశారు. బుధవారమే మూడో జాబితా (YSRCP Third List) వస్తుందని ప్రచారం జరిగింది, దాదాపు 25 నుంచి 30 మందితో సిద్ధం చేసిన జాబితాలో రెండు, మూడు చోట్ల అభ్యర్థుల పేర్లు ఫైనల్ కాకపోవడంతో మూడో లిస్ట్ విడుదల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కొందరు సినిమా స్టార్లకు ఈ జాబితాలో చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది.


వైసీపీ నుంచి లోక్ సభ బరిలో..
రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా టాలీవుడ్ డైరెక్టర్ వి.వి. వినాయక్, కర్నూలు నుంచి గుమ్మనూరు జయరాం, విశాఖ నుంచి బొత్స ఝాన్సీ రాణి, విజయనగరం ఎంపీ అభ్యర్థిగా మజ్జి శ్రీనివాసరావు, అనకాపల్లి స్థానానికి అడారీ రమాదేవి, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.


కేశినేని నాని అసెంబ్లీకా, లోక్‌సభకా!


టీడీపీకి, ఎంపీ పదవికి బుధవారం రాజీనామా చేసిన కేశినేని నానికి వైసీపీ బాస్ జగన్ టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కేశినేని త్వరలోనే వైసీపీలో చేరతానని ప్రకటించారు. కేశినేని నానికి విజయవాడ ఎంపీగా వైసీపీ ఛాన్స్ ఇస్తుందా, లేక ఎమ్మెల్యేగా పోటీ చేయించి అసెంబ్లీకి పంపించాలా అని జగన్ ఆలోచిస్తున్నారు. ఎంపీగా అయితే విజయవాడ నుంచి కేశినేనికి టికెట్ ఇవ్వనుంది వైసీపీ. ఎమ్మెల్యేగా అయితే విజయవాడ, గుంటూరు స్థానాల నుంచి టికెట్ దక్కించుకుంటారని టాక్. టీడీపీ నుంచి బయటకు రావాలని కేశినేని నాని నిర్ణయం తీసుకున్నాక.. బుధవారం తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. అనంతరం కొన్ని గంటలకే ఎంపీ పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం తెలిసిందే. 


అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎవరంటే..
వైనాట్ 175 అంటున్న వైసీపీ అధినేత జగన్.. సిట్టింగ్ లకు దాదాపు 65 స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇందులో 20 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించే ఛాన్స్ ఉండగా, మరో 40 స్థానాల్లో అభ్యర్థులను మార్చుతున్నారు. తాను చేయించిన సర్వేల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించడమో, లేక స్థానాలు మార్చడమో చేస్తున్నారు. సామాజిక న్యాయంలో భాగంగా అభ్యర్థుల స్థానాలు మార్పు చేస్తున్నట్లు వైసీపీ చెబుతోంది. 
చింతపూడి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయరాజు, మడకశిర నుంచి పోలీస్ అధికారి శుభ కుమార్ ను, గూడూరు నుంచి మేరుగ మురళి, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రాయదుర్గం నుంచి మెట్టు గోవింద రెడ్డి, చిత్తూరు నుంచి విజయానంద రెడ్డి, ఆలూరు నుంచి విరూపాక్ష, నందికొట్కూర్ నుంచి గంగాధర, మార్కాపూరం నుంచి, జంకె వెంకట్ రెడ్డి, పెందూర్తి నుంచి ఆదుర్తి రాజు, నెల్లూరు నుంచి కృపాలక్ష్మీలను జగన్ బరిలోకి దింపుతున్నారని ప్రచారం జరుగుతోంది. పలు మీడియాలో వైసీపీ ఇంఛార్జ్‌ల మూడో జాబితా అని ఈ నేతల పేర్లు వస్తున్నాయి. వైసీపీ బాస్ జగన్ గురువారం లేక శుక్రవారం మూడో జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.