YSRCP MP writes to PM over harassment on police officers in AP:   ఆంధ్రప్రదేశ్‌లోని 199 మంది సీనియర్ పోలీసు అధికారులపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని  వైసీపీ ఎంపీ గురుమార్తి  ప్రధాని సహా పలువురికి ఫిర్యాదు చేశారు.   భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. విజయానంద్ , డిజిపి హరీష్ కుమార్ గుప్తాలకు  లేఖ  పంపారు.  జూన్ 2024 నుండి పోస్టింగ్‌లు లేదా జీతాలు లేకుండా  199 మంది సీనియర్ పోలీసు అధికారులు ఉన్నారన్నారు.                        

Continues below advertisement


ఈ 199 మంది అధికారులలో 4 మంది ఐపీఎస్ అధికారులు, 4 మంది నాన్-క్యాడర్ పోలీసు సూపరింటెండెంట్లు, 1 ఏపీఎస్పీ కమాండెంట్, 27 మంది అదనపు ఎస్పీలు, 42 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లు (డీఎస్పీలు) (సివిల్ , ఏపీఎస్పీ),   119 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారని తెలిపారు.  . వారందరినీ వేకెన్సీ రిజర్వ్ (VR) జాబితాలో ఉంచారని..  ఎటువంటి అధికారిక పోస్టింగ్‌లు, బాధ్యతలు  వేతనం లేకుండా మంగళగిరిలోని DGP కార్యాలయానికి ఏకపక్షంగా అటాచ్ చేశారని  ఆరోపించారు.                   


ఈ అధికారులు రోజుకు రెండుసార్లు ఆఫీసులో పంచ్చేస్తున్నారని..  వారి స్వంత ఖర్చుతో అద్దె వసతి గృహాలలో నివసిస్తున్నారని తెలిపారు.   ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలంగా జీతం చెల్లించలేదని డాక్టర్ గురుమూర్తి  ఆవేదన వ్యక్తం చేశారు.  వారిపై ఎటువంటి శాఖాపరమైన లేదా చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో లేవని అయినప్పటికీ వారికి జీతాలు చెల్లించడం లేదన్నారు.  అదే సమయంలో వారికి  బందోబస్తు విధులు కేటాయిస్తున్నారని.. కానీ    ఎటువంటి వాహనాలు, భత్యాలు  ఇవ్వడం లేదన్నారు.  రాజకీయ బందోబస్తు, VIP విధులు , ప్రజా కార్యక్రమాలకు అనధికారికంగా  ఉపయోగించుకుంటున్నారని  దీనివల్ల అవమానాలు , తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు.  



ఏపీ ప్రభుత్వం ఇలా చేయడం ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16, 21 ప్రకారం విరుద్ధమన్నారు.  ప్రకాష్ సింగ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా (2006)లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించిదని  ఆరోపించారు.  పోస్టింగ్‌లను పునరుద్ధరించడానికి, పెండింగ్‌లో ఉన్న జీతాలు , ప్రయోజనాలను విడుదల చేయించాలని బాధిత అధికారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.