దేశంలో కాంట్రాక్ట్ పద్దతిపై టీచర్ల నియామకం తీవ్ర సమస్యగా మారుతోందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మొదట్లో ఉపాధ్యాయుల కొరత అధిగమించేందుకు ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ఇప్పుడు ప్రాక్టీస్‌గా మారిపోయిందన్నారు. ఇప్పటికైనా దీన్ని పరిష్కరించకుంటే మరింత ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారాయన.
కాంట్రాక్ట్ పద్దతిపై టీచర్లను నియమించే ప్రక్రియ అరికట్టేందుకు రెగ్యులర్ నియామకాలు చేపట్టాలన్నారు విజయసాయిరెడ్డి. ప్రస్తుతం దేశంలో 6.5 లక్షల మంది కాంట్రాక్ట్ టీచర్లు ఉన్నారని గుర్తు చేశారు. దేశంలోని మొత్తం టీచర్ల సంఖ్యలో 13 శాతం మంది కాంట్రాక్ట్ టీచర్లే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు, బడుగు బలహీనవర్గాల విద్యార్ధులు అధిక శాతం చదివే స్కూళ్ళలో కాంట్రాక్ట్ టీచర్ల సంఖ్య 41 శాతానికి చేరుకుందన్నారు. కేవలం అయిదేళ్ళ వ్యవధిలో దేశ విద్యా రంగంలో లక్ష మంది కాంట్రాక్ట్ టీచర్ల నియామకం జరిగిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ టీచర్ల నియామకం తాత్కాలిక ప్రాతిపదికపైన జరుగుతుందని.. రెగ్యులర్ టీచర్ల మాదిరిగా వారికి సర్వీసు ప్రయోజనాలు ఉండవన్నారు విజయసాయిరెడ్డి. ఉద్యోగ భద్రత లేదన్నారు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తుంటారని ఆయన చెప్పారు. ఈ కారణాల వలన కాంట్రాక్ట్ టీచర్లలో నానాటికీ అసంతృప్తి పెరుగుతుందన్నారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి కారణంగా బోధన పట్ల వారిలో ప్రేరణ కొరవడుతుందని అభిప్రాయపడ్డారు.
దేశంలో టీచర్ల సంక్షేమం నిర్లక్ష్యానికి గురవుతున్నకారణంగా విద్యారంగంలోకి ప్రతిభావంతులైన టీచర్లను ఆకర్షించలేకపోతున్నామన్నారు వైసీపీ ఎంపీ. ఫలితంగా విద్యా బోధనలో నాణ్యత సన్నగిల్లుతోందన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో అంటూ భారతీయ సంస్కృతిలో గురువును దైవంతో సమానంగా పరిగణిస్తాం కానీ టీచర్లందరినీ సమదృష్టితో చూడలేకపోతున్నామని ఆవేదన చెందారు. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో టీచర్ల సంక్షేమం కోసం కూడా చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.