News Channels in AP: ఏపీలో ఏపీ కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ బ్లాక్ చేసిన న్యూస్ ఛానల్స్ విషయంలో జోక్యం చేసుకోవాలని.. ట్రాయ్  ఛైర్మన్ కు వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి లేఖ రాశారు. ఏపీలో కొత్తగా ఏర్పడబోతున్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ అక్రమంగా ఈ నిర్ణయం తీసుకుందని లేఖలో ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా ఏపీలో టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ, సాక్షి టీవీలను పూర్తిగా నిలిపివేశారని లేఖలో పేర్కొన్నారు.


ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పును నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. ‘‘ఏ ఛానెల్‌ అయినా, ప్రసారాలనైనా వీక్షించే సంపూర్ణ హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ప్రముఖ మీడియా సంస్థల నుంచి వచ్చే ప్రసారాలను తమకు నచ్చిన విధంగా ప్రజలు ఎంపిక చేసుకొని చూడవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు వీటిపై ఆంక్షలు విధించవచ్చు.. కానీ, పూర్తిగా ఛానెళ్లు రాకుండా నిలిపివేయడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది.


‘‘కేబుల్ ఆపరేటర్లు ఏపీలో నిలిపివేసిన న్యూస్ ఛానెళ్ల విషయంలో కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ పై సమగ్రమైన విచారణ జరిపించండి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోండి. ప్రభుత్వాల జోక్యం మీడియాపై ఉండకుండా ఆయా సంస్థలు స్వేచ్ఛగా తమ ప్రసారాలు చేసుకొనేలా వీలు కల్పించండి’’ అని నిరంజన్ రెడ్డి ట్రాయ్ ఛైర్మన్ కు సూచించారు.