YSRCP MP meeting with Congress President Kharge: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన రాధాకృష్ణన్‌కు మద్దతు ఇస్తున్నామని ఆయనకే ఓటు వేస్తామని విశాఖలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. వైసీపీ విధానాన్ని ప్రకటించారు. దానికి ఆయన ఏ కారణం చెప్పినా.. సాయంత్రానికి వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో సమావేశం అయ్యారు. ఇదేమీ సాధారణ సమావేశం కాదు. చక్కగా బోకేతో పాటు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీలాగా ఆయనతో సమావేశం అయ్యారు. ఇది రాజకీయవర్గాలను ఆశ్చర్య పరిచింది.
ఎంపీ కాంగ్రెస్‌లో చేరరు - కానీ సీక్రెట్ ఎజెండా ?
మేఢా రఘునాథ్ రెడ్డి వైసీపీ రాజ్యసభ ఎంపీ. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బలం లేదు. అందుకే వెంటనే వివరణ ఇచ్చారు. తనకు ఖర్గే..కర్ణాటకలో హోంమంత్రిగా ఉన్నప్పటి నుండి పరిచయం ఉందని.. అందుకే మర్యాదపూర్వకంగా కలిశానన్నారు. పార్టీ మార్పు ప్రచారాలు ఉత్తవేనన్నారు. కానీ ఆయన కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరగలేదు. గతంలో బీజేపీలో చేరుతారని మాత్రం ప్రచారం జరిగింది.కానీ ఆయన సైలెంట్ గా ఉన్నారు. మరి ఎందుకు సమావేశం అయ్యారు.
కాంగ్రెస్‌కు వైసీపీ నుంచి సందేశం పంపించారా ?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏడాది కిందట ఢిల్లీలో ధర్నాలు చేపట్టినప్పుడు ఇండీ కూటమి పార్టీలు మద్దతు పలికాయి. ఎన్డీఏ కూటమి పార్టీలు, ఏపీలో ఎన్డీఏ పాలనను విమర్శించాయి. కానీ జగన్మోహన్ రెడ్డి క్లిష్టసమయాల్లో.. బీజేపీ ప్రభుత్వానికే అండగా నిలిచారు. ఎన్డీఏ ప్రవేశ పెట్టిన బిల్లులకే మద్దతు తెలిపారు.తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ అదే చేశారు. దీంతో ఇక ముందు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ.. వైసీపీని సమర్థించ అవకాశం ఉండదు. బీజేపీతో ఎలాగూ జగన్ కలవలేరు. అందుకే..తనకు ఢిల్లీ స్థాయిలో మద్దతు ఉండాలంటే.. కాంగ్రెస్ కూటమి సపోర్టు అవసరమని జగన్ భావిస్తున్నారని.. ఆ సందేశాన్ని.. మేడా రఘునాథ్ రెడ్డి ద్వారా పంపించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సేఫ్ గేమ్ ఆడటం ప్రారంభించారా ?
ఎన్డీఏ కూటమి చాలా బలంగా ఉంది. టీడీపీ, జనసేనలను బీజేపీ వదులుకునే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో.. రాను రాను వైసీపీ బలం తగ్గిపోతుంది. మరో రెండు, మూడేళ్లలో రాజ్యసభ స భ్యుల పదవి కాలం అయిపోతుంది. ఖాళీ అయ్యే సీట్లన్నీ ఎన్డీఏ ఖాతాలో పడిపోతాయి. అప్పుడు వైసీపీ అవసరం బీజేపీకి అసలు ఉండదు. ఇప్పుడు కూడా ఉండదు కానీ.. అవసరం లేకపోయినా.. వైసీపీ మద్దతు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతోంది. దీని వల్ల రాజకీయంగా సమస్యలు వస్తాయని తెలిసినా తప్పడం లేదు. ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ కూటమితోనూ సంబంధాలు కొనసాగించే ప్రయత్నాలను తమ ఎంపీల ద్వారా ప్రారంభించారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.