Ycp MLA Parthasarathy Comments on CM Jagan: పెనమలూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జీగా జోగి రమేష్ (Jogi Ramesh) ను పార్టీ అధిష్టానం నియమించడంపై వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy) తన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ మారాలని నిర్ణయించుకున్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, వారిపై అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా.? అంటూ ప్రశ్నించారు. వైసీపీలో బీసీలకు అగ్ర తాంబూలం అనేది నేతి బీరకాయలో నెయ్యి చందమే అని మండిపడ్డారు. 'గన్నవరంలో పార్టీ గెలిచే పరిస్థితి లేదు. అందుకే నన్ను అక్కడికి వెళ్లమన్నారు. బీసీ నేతను కాబట్టి అక్కడ ఓడినా పర్వాలేదని భావించారు. నేను అక్కడికి వెళ్లేందుకు విభేదించడం పార్టీ అధిష్టానానికి నచ్చలేదు. బలహీన వర్గాలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని గతంలో చెప్పాను. అది తప్పని తెలుసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. బీసీ, ఎస్సీలు, ఎవరి కాళ్లపై వారు నిలబడాలనుకుంటారు. మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే మాత్రం అభిమానం చంపుకోరు.' అని వ్యాఖ్యానించారు. తనకు అర్హత ఉన్నా.. మంత్రి పదవి దక్కలేదని, ఇప్పుడు టికెట్ విషయంలోనూ పక్కన పెట్టారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ కష్టపడ్డానని.. అయినా తగిన గుర్తింపు లేదని వాపోయారు. పెనమలూరు నియోజకవర్గంతో 30 ఏళ్ల అనుబంధం ఉంది. తనతో ఉన్న వారందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
ఎన్నికల వేళ నియోజకవర్గాల్లో వైసీపీ ఇంఛార్జీల మార్పులతో పలువురు కీలక నేతలు తమ అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి ఫలితం లేదని.. సర్వేల పేరుతో తమను పక్కన పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి వైసీపీ ఇంఛార్జీల మూడో జాబితాను అధిష్టానం రిలీజ్ చేసింది. మంత్రి జోగి రమేష్ కు పెడన నుంచి కాకుండా పెనమలూరు నుంచి టికెట్ ఇచ్చింది. సీఎం జగన్ ఆయన పేరను ఫైనల్ చేశారు. దీనిపై స్పందించిన పార్థసారథి.. పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.
ఈ నెల 18న టీడీపీలోకి!
మరోవైపు, పార్థసారథి టీడీపీలోకి చేరడం ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో ఆయన చర్చించారు. వారు టీడీపీలోకి ఆహ్వానించగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నెల 18న కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు 'రా.. కదలిరా' బహిరంగ సభలో పార్థసారథి టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ మూడో జాబితా ఇదే
ఎమ్మెల్యే అభ్యర్థులు
- ఇచ్ఛాపురం - పిరియా విజయ
- టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్
- చింతలపూడి (ఎస్సీ) - కంభం విజయరాజు
- రాయదుర్గం - మెట్టు గోవింద్ రెడ్డి
- దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
- పూతలపట్టు (ఎస్సీ) - మూతిరేవుల సునీల్ కుమార్
- చిత్తూరు - విజయానంద రెడ్డి
- మదనపల్లె - నిస్సార్ అహ్మద్
- రాజంపేట - ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
- ఆలూరు - బూసినే విరూపాక్షి
- కోడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సతీష్
- గూడూరు (ఎస్సీ) - మేరిగ మురళి
- సత్యవేడు (ఎస్సీ) - మద్దిల గురుమూర్తి
- పెనమలూరు - జోగి రమేశ్
- పెడన - ఉప్పాల రాము
ఎంపీ అభ్యర్థులు వీరే
- విశాఖపట్నం ఎంపీ - బొత్స ఝాన్సీ
- విజయవాడ - కేశినేని నాని
- శ్రీకాకుళం - పేరాడ తిలక్
- కర్నూల్ ఎంపీ - గుమ్మనూరి జయరాం
- తిరుపతి ఎంపీ - కోనేటి ఆదిమూలం
- ఏలూరు - కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
Also Read: పార్లమెంటుకు వెళ్లమంటున్న సీఎం-మంత్రి పదవిపై ఆశ పడుతున్న లీడర్..!