YSRCP News: ‘నీటి కేటాయింపులపై మొన్న నేను ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడాను.. స్థానిక అధికారులు సమస్యల పరిష్కారంపై సక్రమంగా స్పందించడం లేదనే ఆవేదనతో మాట్లాడాను. అయితే, ఎల్లోమీడియా పూర్తిగా నా మాటల్ని పూర్తిగా వక్రీకరించి హైలెట్ చేసిందని’ శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి (Jonnalagadda Padmavathy) అన్నారు. సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కు తాను వ్యతిరేకంగా మాట్లాడినట్లు చిత్రీకరించారని, ఆ వార్తలను పూర్తిగా ఖండించారు. అదే వీడియోలో ‘జగనన్న స్ఫూర్తితోనే మేము ముందుకెళ్తున్నాం..’ అని చెప్పానని, ఆ విషయాన్ని ఎందుకు హైలెట్ చేయలేదు అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP) కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. తాను సరైన మార్గంలోనే నడుస్తున్నానని, ఊపిరున్నంత వరకు జగన్ నాయకత్వంలోనే వైఎస్‌ఆర్‌సీపీలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. సీఎం జగన్ కు తనను దూరం చేయాలనే కుట్రబుద్ధితో ఎవడైనా తన జోలికొస్తే.. ఏ స్థాయి వ్యక్తినైనా కోర్టుకీడ్చి బుద్ధిచెబుతాను అంటూ వార్నింగ్ ఇచ్చారు.
అధికారుల తీరుపై ఆవేదనతో మాట్లాడానని క్లారిటీ
‘శింగనమల నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారానికి సంబంధించి స్థానిక అధికారులతో చాన్నాళ్ల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. పరిష్కారం దొరకలేదని.. సీఎం జగన్ కి చెబితేనే ఏ పనైనా అవుతోందని.. మా మాటల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులను ప్రశ్నించాను. కానీ నేనేదో సీఎం జగనన్నను తూలనాడినట్లు.. ఆయన్ను ప్రశ్నించినట్లుగా కథనాలు రాశారు. ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడి దాన్ని ఎవరు మార్చే వీలు ఉండదు కదా..? మరి, ఆ లైవ్‌లో నేనేం మాట్లాడానో.. ఎవరి గురించి ఏం మాట్లాడానో అందరికీ తెలుసు కదా..? ఒక రాజకీయ పార్టీ నేతగా మాట్లాడిన నేను ఎవరిని ప్రశ్నించానో.. ఏ అంశంపై నిలదీశాననేది స్పష్టంగా రాయాలి’ అన్నారు ఎమ్మెల్యే పద్మావతి.
సొంతచెల్లెలుగా చూసుకున్న జగన్..
ఒక వారం రోజుల నీళ్ల కేటాయింపునకూ అధికారులు కుదరదనప్పుడు బాధ కలిగిందన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎవరికి వారు తమ ప్రాంతాల్లోని సమస్యలు వేగవంతంగా పరిష్కారం కావాలనే తొందరలో అధికారులపైనా కొన్నిసార్లు వత్తిళ్లు చేయడం సాధారణం అన్నారు. భారీస్థాయిలో భవిష్యత్తును ఊహించి రాజకీయాల్లోకి రాలేదన్నారు. 2014 ఎన్నికల ముందు జగన్ ను కలిసినప్పుడు.. ప్రజలకు సేవ చేసేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తే ఖచ్చితంగా అలాంటి నాయకుడితోనే కలిసి పనిచేయాలనుకున్నానని తెలిపారు. ఇప్పటి వరకు కూడా జగనన్న తన కుటుంబ సభ్యుల్లాగా.. సొంతచెల్లెలుగా చూసుకున్నారని పేర్కొన్నారు.
పదవి లేకున్నా పార్టీ కోసం పనిచేస్తా
తన రాజకీయ భవితవ్యం సీఎం జగన్ చేతుల్లోనే ఉందన్నారు. ఇక్కడినుంచే ఎన్నికల్లో పోటీచేయమన్నా చేస్తాను. లేదంటే, వేరొకరికి అక్కడ అవకాశమిస్తానన్నా .. నేను అసెంబ్లీ సీటు వదులుకుని పార్టీకి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అలాంటి తాను వైఎస్‌ఆర్‌సీపీని వీడిపోతున్నట్లు.. జగన్ ను వ్యతిరేకిస్తున్నట్లు కథనాలు రావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా పదవులు, పనుల్లో 50 శాతం వాటా పొందుతూ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిలోకి రావడాన్ని జనం చూస్తున్నారని చెప్పారు.
సమస్యలపై దళిత మహిళ పోరాడకూడదా..?
ఎమ్మెల్యేలు వారి నియోజక వర్గాల సమస్యల పరిష్కారం కోసం పనిచేయకూడదు అనుకుంటున్నారా..? మా నియోజకవర్గం సమస్యలపై నేను దళిత మహిళగా పోరాడకూడదా.. అధికారుల్ని ప్రశ్నిస్తేనే.. తనమీద లేనిపోని కబుర్లు అల్లి విషప్రచారం చేశారంటూ ఎమ్మెల్యే పద్మావతి మండిపడ్డారు. ఎల్లోమీడియా కట్ట గట్టుకుని వచ్చి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులుపై, జగనన్న మీద ఎంత విషప్రచారం చేసినా.. మీరు ఆశించేది జరగనే జరగదు. మీరెంత తొక్కాలనుకుంటే అంతకంతకు పైస్థాయిలో ఎదుగుతామని దీమా వ్యక్తం చేశారు.