Andhra Pradesh: వాళ్లంతా చిన్న పిల్లలు, రాజకీయం అంటే ఏమిటో తెలియదు. కానీ వారందర్నీ స్కూల్ నుంచి తీసుకెళ్లారు వైసీపీ నేతలు. తమ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారిని తీసుకెళ్లారు. కానీ అక్కడ వారికి ప్రమాదం జరిగింది. ఏడుగురు పిల్లలు గాయపడ్డారు. ఈ ఘటనపై నారా లోకష్ కు ట్విట్టర్ లో ఫిర్యాదు అందింది.
పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గం,బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని MPP స్కూల్ కు చెందిన పిల్లలను రాజకీయ కార్యక్రమానికి వైసీపీ నేతలు తీసుకెళ్లారు. స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న విద్యార్థులను మాజీ MLA జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసనకు తీసుకెళ్లారు. MEO , యు HM ఈ రాజకీయ నిరసనకు విద్యార్థులను అనుమతించారు.తిరిగి వస్తుండగా జరిగిన ఒక దుర్ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయపడి ఆసుపత్రిలో చేరారు.
వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది.MEO , HM బాధ్యతారహిత ప్రవర్తనపై తీవ్ర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యార్థుల భద్రతను పణంగా పెట్టి, స్కూల్ సమయంలో రాజకీయ నిరసనకు అనుమతించడం చట్ట విరుద్ధమని శ్యామ్ అనే నెటిజన్ విద్యా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంఘటనను వెంటనే విచారణ జరిపి బాధ్యులైన MEO మరియు HMపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భద్రతతో రాజీ పడే ఇటువంటి నిర్లక్ష్యాన్ని సహించలేము.త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాననని ట్వీట్ చేశాడు. ఫోటోలు వీడియోలు అన్నీ షేర్ చేశారు.
నారా లోకేష్ ఈ ఘటనపై వెంటనే స్పందించారు. ఇది చాలా తీవ్రమైన విషయమని.. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఉన్నతాధికారుల్ని నివేదిక అడిగారు. పాఠశాలల్లో దురదృష్టకరమైన ఈ జోక్యం రాజకీయ పార్టీల నేతలు- అధికారులకు హెచ్చరిక కావాలి. ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి మీ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
వైసీపీ నేతల తీరు రాష్ట్రంలో వివాదాస్పదమవుతున్న సమయంలో యువత పోరు అంటూ.. స్కూల్ పిల్లల్ని ఊరేగింపుగా తీసుకెళ్లడం దుమారం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యేపైకేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.