Election code violation case On Jagan: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 19, 2025న గుంటూరు మిర్చియార్డులో జగన్ పర్యటించారు. అయితే ఆ పర్యటనకు అనుమతి తీసుకోలేదు. అప్పట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయినప్పటికీ ఈ పర్యటనకు అనుమతి తీసుకోకుండా.. పర్యటించారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపణలపై నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ పర్యటనలో అనుమతి లేకుండా వైసీపీ నేతలు హంగామా సృష్టించారని, నిబంధనలకు విరుద్ధంగా పర్యటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టని వైసీపీ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు. అయినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో జగన్ మిర్చి రైతులను పరామర్శించేందుకు యార్డుకు వచ్చారని, అనుమతి లేకుండా ఈ పర్యటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. జగన్‌తో పాటు వైసీపీ నేతలు కావటి మనోహర్, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వెంకటరమణ, కొడాలి నాని, అంబటి రాంబాబు, నందిగం సురేశ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులపై కేసు నమోదైంది. నల్లపాడు పోలీసులు పై నేతలందరికీ నోటీసులు జారీ చేశారు. పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని సూచించారు.
వైసీపీ ఎన్నికల్లో పాల్గొనకపోయినా, మైక్‌లు వాడకపోయినా కేసు నమోదు చేశారని అంబటి రాంబాబు అప్పట్లో ఆరోపించారు. ఎన్నికల్లో పోటీతో సంబంధం లేకుండా.. రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తే అనుమతి తీసుకోవాల్సి ఉంటుదని పోలీసులు చెబుతున్నారు.
అభ్యర్థిని నిలబెట్టలేదు కాబట్టి కోడ్ వర్తించదని వైసీపీ నేతల వాదన
జగన్ మిర్చియార్డు పర్యటనకు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదు. మిర్చియార్డులో రైతులను పరామర్శించే సమయంలో జగన్ కూడా ఇబ్బంది పడ్డారు.మిర్చికోరు వల్ల మాట్లాడలేకపోయారు. తాను కేవలం రైతుల్ని పరామర్శించానని.. మైక్ తో మాట్లాడలేదని కేవలం వ్యక్తిగత పర్యటనే అని.. దీనికి పోలీసు అనుమతి అవసరం లేదని వైసీపీ నేతలు వాదించారు. కానీ పెద్ద ర్యాలీ నిర్వహించడంతో.. పోలీసులు ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని చెప్పి కేసులు పెట్టారు.
ఇక నిబంధనలు అతిక్రమించిన కేసుల్లో కఠిన చర్యలు తీసుకోనున్న పోలీసులు
అప్పట్లో కేసులు పెట్టి సైలెంట్ గా ఉండిపోయారు. కానీ ఇటీవలి కాలంలో వైఎస్ జగన్.. పదే పదే పోలీసులకు ఇచ్చిన అనుమతుల్ని ఉల్లంఘిస్తూ పర్యటనలు చేస్తున్నారు. ఫలితంగా మరణాలుకూడా సంభవిస్తున్నాయి. మళ్లీ ఆయన ప్రభుత్వాన్నే నిందిస్తున్నారు. అందుకే నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. పాత కేసుల విషయంలోనూ అలాగే చర్యలు ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు