Chintada Ravikumar Non Bailable Cases AP Police:  వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రదర్శించిన హంగామా, అరాచక ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు అత్యంత సీరియస్‌గా స్పందించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శ ముసుగులో విధి నిర్వహణలో ఉన్న బూర్జ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్‌ఐ ఎం. ప్రవళ్లికపై ఆమదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జ్ చింతాడ రవికుమార్, ఆయన అనుచరులు తీవ్ర దుర్భాషలాడుతూ, వికృతంగా ప్రవర్తిస్తూ భౌతిక దాడికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మహిళా అధికారి అని కూడా చూడకుండా చుట్టుముట్టి తోసివేయడం, అడ్డుకోబోయిన సీఐ సన్యాసి నాయుడితో పాటు ఇతర కానిస్టేబుళ్లపై దాడి చేసి గాయపరచడాన్ని హోంశాఖ, పోలీస్ బాస్ తీవ్రంగా పరిగణించారు.

Continues below advertisement

రాజకీయ పర్యటనల నెపంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, పోలీస్ వ్యవస్థపైనే దాడులకు తెగబడే అల్లరిమూకలను ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారుల స్థానంలో ఉన్న మహిళా పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించడం, చట్టబద్ధమైన విధులకు భంగం కలిగించడం, కుట్రపూరితంగా గుమిగూడి దాడులకు పాల్పడటం వంటి తీవ్రమైన నేరాల ఆధారంగా శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితులందరిపై నాన్-బెయిలబుల్  సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలను వేగవంతం చేశారు.

ఈ అరాచక ఘటనకు బాధ్యులైన ప్రధాన సూత్రధారులు, పాత్రధారులను  అరెస్ట్ చేయడానికి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. సంఘటనా స్థలంలో నమోదైన సీసీటీవీ దృశ్యాలు, విజువల్ మీడియా కెమెరా ఫుటేజీలు మరియు సోషల్ మీడియా రీల్స్‌లోని డిజిటల్ ఆధారాలను ప్రత్యేక విభాగం జల్లెడ పడుతోంది. ముఖ్యంగా ప్రధాని, సీఎంల పర్యటనల ముందు పోలీసులు అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ  సెక్యూరిటీ బందోబస్తు ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘిస్తూ, మహిళా అధికారిపైకి రౌడీల్లా దూసుకెళ్లిన ప్రవర్తన ఆధారంగా ప్రతి ఒక్కరినీ స్పష్టంగా గుర్తించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Continues below advertisement

మహిళా అధికారిపై జరిగిన ఈ భౌతిక దాడి ఉదంతంపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సుమోటోగా కేసు స్వీకరించి పోలీసుల నుంచి సమగ్ర నివేదిక కోరారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పరామర్శల పేరుతో రోడ్లపై రచ్చ చేయడం, విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసుల పట్ల వికృతంగా ప్రవర్తించడాన్ని ఏమాత్రం సహించేది లేదని కమిషన్ హెచ్చరించింది. మహిళా అధికారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన వారిపై కఠిన చట్టాల కింద విచారణ జరిపించాలని ఆమె ఆదేశించారు.

 దాడికి పాల్పడిన నిందితులను వెంటనే కోర్టు ముందు హాజరుపరిచేందుకు జిల్లా పోలీసులు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, పోలీసుల పట్లే దౌర్జన్యానికి దిగిన వైఎస్సార్‌సీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రాజకీయ అరాచకాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.