YSRCP leader Nagarjuna Yadav attacked a hotel staff in Sattenapalli: వైఎస్ఆర్‌సీపీ యువనాయకుడు నాగార్జున యాదవ్ పై సత్తెనపల్లిలో కేసు నమోదు అయింది. సత్తెనపల్లిలో గుడ్ మార్నింగ్ హోటల్‌పై దాడి చేశారు. టిఫిన్ త్వరగా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'రప్పా రప్పా' బెదిరింపులతో హల్ చల్ చేసినట్లుగా వీడియోలు వైరల్ అయ్యాయి.
పాల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నాగార్జున యాదవ్ తన అనుచరులతో కలిసి గుడ్ మార్నింగ్ హోటల్ యజమాని శేఖర్, సిబ్బందిపై దాడి చేశారని కేసు నమోదు అయిది. టిఫిన్ త్వరగా సర్వ్ చేయలేదని కోపంతో ఈ దాడి చేశారని హోటల్ యజమాని ఫిర్యాదులోపేర్కొన్నారు. 'మేము వైసీపీ.. మా వెనుక రప్పా రప్పా బ్యాచ్ ఉంది.. నరికేస్తాం' అంటూ బెదిరించి, 'కేసు పెడితే మా వైసీపీ బ్యాచ్ వస్తుంది' అని హెచ్చరించినట్లుగా ఫిర్యాదులో హోటల్ యజమాని పేర్కొన్నారు. ఈ దాడిలో ఇద్దరు హోటల్ సిబ్బందికి గాయాలు పాలయ్యాయి. ఈ ఘటనపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేత నాగార్జున యాదవ్ తన అనుచరులతో కలిసి హోటల్‌కు వచ్చారు. టిఫిన్ ఆర్డర్ చేసినా, త్వరగా సర్వ్ చేయకపోవడంపై కోపం తెచ్చుకున్నారు. హోటల్ యజమాని శేఖర్‌పై ముందుగా దాడి చేశారు. తర్వాత సిబ్బందిపై కూడా దాడి చేసి, ఇద్దరు ఉద్యోగులకు తీవ్ర గాయాలు చేశారు. "ఏమైనా మాట్లాడితే మా వాళ్లంతా వస్తారు" అంటూ బెదిరించారు. ఈ బెదిరించే మాటలు హోటల్ CCTVలో కూడా రికార్డ్ అయ్యాయి. హోటల్ సిబ్బంది ఈ దాడి ఘటనపై వెంటనే సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు.
సత్తెనపల్లి పోలీసులు హోటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు వెంటనే కేసు నమోదు చేశారు. దాడి, బెదిరింపులు, శాంతి భంగం వంటి సెక్షన్‌ల కింద ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు. CCTV ఫుటేజ్‌ను సేకరించి, సాక్షుల వాంగ్మూలాలు రికార్డ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ (TDP) నేతలు తీవ్రంగా ఖండించారు. "వైసీపీ నేతలు అధికారం కోల్పోయాక కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు. పోలీసులు త్వరగా చర్యలు తీసుకోవాలి" అని TDP జిల్లా నేతలు డిమాండ్ చేశారు.