YSRCP leader Gautham Reddy is absconding: విజయవాడ వైఎస్ఆర్‌సీపీ నేత పూనూరు గౌతం రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఉమామహేశ్వర శాస్త్రి అనే వ్యక్తిని సుపారీ హత్య చేయించేందుకు గౌతంరెడ్డి కుట్ర పన్నారని కేసు నమోదు అయింది. ఉమామమహేశ్వర శాస్త్రి ఇంటిని కబ్జా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఆయనను చంపేయాలని గౌతంరెడ్డి కుట్ర పన్నారని పోలీసులు గుర్తించారు. రెక్కీ నిర్వహించిన ఇద్దరిని పట్టుకున్నారు. ఇద్దరూ ఆయన దగ్గర పని చేసేవారు.
విజయవాడలో అనేక నేరాల్లో నిందితుడు గౌతం రెడ్డి
పూనూరు గౌతంరెడ్డి విజయవాడలో కార్మిక సంఘం నేత అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆయన రౌడీయిజం, దందాలు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఆయనకు నేర చరిత్ర ఉంది. దాదాపుగా 42 కేసులు ఆయనపై ఉన్నాయి. అందులో హత్య కేసులు కూడా ఉన్నాయి. రౌడీషీట్ కూడా ఉండేది. ఇన్ని కేసులు ఉన్నప్పటికీ వైసీపీ హయాంలో అనూహ్యంగా రౌడీషీట్ ఎత్తేశారు. దీనిపై పోలీసు శాఖలోనే విస్మయం వ్యక్తమవుతోంది. విజయవాడ కమిషనర్ రాజశేఖర బాబు ఈ అంశం తెలిసిన తర్వాత ఏ కారణాలతో రౌడీషీట్ ఎత్తేశారో విచాణ చేయిస్తున్నామని తెలిపారు.
Also Read: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
గత ప్రభుత్వంలో అనూహ్యంగా రౌడీషీట్ ఎత్తివేత
గౌతంరెడ్డి గతంలోనూ ఉమామహేశ్వర శాస్త్రిపై దాడులు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఉన్న సమయంలో ఆయన పోలీసులను ఆశ్రయించినా ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. దాంతో బిక్కు బిక్కుమంటూ గడుతున్నారు. తాజాగా ఆయన మరోసారి తన అనుచరులతో అదే పని చేయడంతో పోలీసుల్నిఆశ్రయించారు. పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
ప్రస్తుతం హత్యాయత్నం కేసులో పరారీ
గౌతం రెడ్డి గతంలో వంగవీటి రంగాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై ఓ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గలేదు. వైసీపీ ప్రభుత్వంలోనూ ఆయనకు పదవులు లభించాయి. ఓ సారి వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన జగన్, అవినాష్ రెడ్డిలకు సమీప బంధువుగా ప్రచారం ఉంది. జగన్‌తో ఉన్న బంధుత్వం కారణంగానే ఆయన కు వైసీపీలో పదవులు దక్కుతాయని అంటున్నారు.