Andhra Pradesh News: వైసీపీ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. ఒకటీ అరా స్థానాలు మినహా మిగతావన్నీ యథాతథంగానే ఉన్నాయి. అయితే అత్యధిక సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేసి జగన్ (YS Jagan) రికార్డ్ సృష్టించారనే చెప్పాలి. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు కూడా. 


వైసీపీ ప్రకటించిన అసెంబ్లీ స్థానాలు 175
ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులు 81
వైసీపీ ప్రకటించిన ఎంపీ స్థానాలు 25
మార్పులు జరిగిన స్థాలు 18


ఎంపీ, ఎమ్మెల్యే కలిపి ఏపీలోని మొత్తం 200 స్థానాలకు గాను వైసీపీ 99 స్థానాల్లో అభ్యర్థులను మార్చేసింది. అంటే దాదాపు 50శాతం మార్పులు చేర్పులు జరిగాయన్నమాట. గతంలో ఏ పార్టీ కూడా ఈ స్థాయిలో మార్పులు చేయలేదు, కానీ తొలిసారి జగన్, ఎమ్మెల్యేల స్థానిక బలం కంటే.. తనపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకంపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. అందుకే ఇక్కడివారిని అక్కడ అక్కడివారిని ఇక్కడ అంటూ విపరీతమైన ప్రయోగాలు చేశారు. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ షాక్ ఇచ్చారు. 14 మంది సిట్టింగ్ ఎంపీలను కూడా పక్కనపెట్టారు. 


మంత్రిగా పనిచేసినా, నెల్లూరు జిల్లా రాజకీయాలతో మాత్రమే తలమునకలై ఉన్న అనిల్ కుమార్ యాదవన్ ని రెండు జిల్లాలు దాటించేసి నర్సరావు పేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక ఎక్కడో చిత్తూరు జిల్లాలో బిజీగా ఉండే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏరికోరి ఒంగోలు తెప్పించారు. తొలిసారి విజయసాయిరెడ్డికి ప్రత్యక్ష రాజకీయాలు పరిచయం చేస్తున్నారు. ఇలా సీఎం జగన్ ఎంపీ స్థానాల్లో చాలా ప్రయోగాలే చేశారు. 


ఎమ్మెల్యే స్థానాల విషయానికొచ్చేసరికి ఏకంగా మంత్రులకు కూడా స్థాన చలనం తప్పలేదు. గుడివాడ అమర్నాథ్ ని అనకాపల్లికి దూరం చేశారు, చెల్లుబోయిన గోపాల కృష్ణ, జోగి రమేష్, విడదల రజిని, ఆదిమూలపు సురేష్.. ఇలా కొందరికి స్థాన చలనం కలిగింది. అదే సమయంలో పెద్దిరెడ్డి, రోజా, కాకాణి గోవర్దన్ రెడ్డి వంటి మంత్రులు మాత్రం తమ తమ స్థానాలను వదిలిపెట్టలేదు. మంత్రి గుమ్మనూరు జయరాంకి జగన్ చీటీ చింపేసే సరికి ఆయన చంద్రబాబు జట్టులో చేరారు. 


వలస నేతల పరిస్థితి ఏంటి..?
టీడీపీని కాదని వైసీపీలోకి వెళ్లినవారిలో మద్దాలి గిరికి మినహా మిగతా అందరికీ సీటు దక్కింది. ఇక జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కి ఎంపీగా ప్రమోషన్ ఇచ్చి రాజోలు నుంచి అమలాపురం పంపించారు జగన్. చివర్లో పార్టీలో చేరిన గొల్లపల్లి సూర్యారావు లాంటి వారికి సైతం టికెట్ ఆఫర్ చేశారు జగన్. 


గతంలో నందిగం సురేష్, గోరంట్ల మాధవ్ వంటి ఎంట్రీలు ఈసారి పెద్దగా లేవు. 2019లో సామాన్యులకు పెద్దపీట వేసి ప్రతిపక్షాలకు షాకిచ్చిన జగన్, ఈసారి మాత్రం సేఫ్ గేమ్ ఆడారు. వారసులకు అవకాశాలిచ్చారు, బొత్స లాంటి సీనియర్లకు ఫ్యామిలీ ప్యాక్ ముట్టజెప్పారు. కొత్త మొహాలు ఉన్నా కూడా.. రాజకీయ నేపథ్యం ఉన్నవారికే ఎక్కువగా అవకాశాలిచ్చి ప్రోత్సహించారు జగన్. 


వైనాట్ 175 అంటూ బరిలో దిగుతున్న సీఎం జగన్ ఏకంగా 32మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టడం విశేషం. వీరిలో కొందరు పక్క పార్టీల్లో చేరిపోయినా, మిగతా వారికి మాత్రం అభ్యర్థుల ప్రకటన సమయంలో గట్టి హామీలే ఇచ్చారు. అందరికీ సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. 50 శాతం మార్పులు చేర్పులతో వైసీపీ అధినేత జగన్ చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా, లేక ఫెయిలవుతుందా వేచి చూడాలి.