YCP Counter To  Purandeswari: ఏపీ మద్యం దుకాణాలు, విక్రయాలపై విమర్శలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి అధికార పార్టీ వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సోషల్ మీడియా ట్విటర్ వేదికగా వైసీపీ ఆదివారం రిప్లై ఇచ్చింది. పురందేశ్వరి తీరుపై వ్యంగ్యంగా స్పందించింది. నరసాపురం మద్యం దుకాణానికి చెందిన చలానా రసీదులు, సెప్టెంబర్ 1 నుంచి 22 వ తేదీ వరకు రోజు వారీగా బ్యాంకులో జమ చేసిన నగదు వివరాలను పొందు పరుస్తూ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా పురందేశ్వరిపై ఘాటుగానే స్పందించింది వైసీపీ.


‘జోరు ఎక్కువ, అవగాహన తక్కువ అయితే ఎలా చిన్నమ్మా..? మీరు మద్యం షాపు దగ్గరకు వెళ్లిన సమయానికి రూ.700 మాత్రమే డిజిటల్ పేమెంట్స్ వచ్చాయి. మిగతాది నగదు రూపంలో వచ్చింది. అయినా రోజువారీ వ్యాపారంలో వచ్చిన నగదు మొత్తం చలానా రూపంలో ఖజానాకు జమ చేస్తారు. ఈనెల 21న వచ్చిన మొత్తం కూడా ఖజానాకు జమచేసింది మీకు తెలియదా? ఇది నిత్యం జరిగే ప్రక్రియ. క్యాష్ రూపంలో వచ్చిన కలెక్షన్ అంతా సొంతానికి వాడుకోవడం ఎక్కడైనా ఉంటుందా?  మీ అక్కగారి హెరిటేజ్‌లో వస్తున్న నగదు మొత్తం ఇంటికి తీసుకుపోతున్నారా? ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? మీ తెలివి తెల్లారినట్లే ఉంది!’ అంటూ సటైర్లు వేసింది. చివరగా చిన్నమ్మ4టీడీపీ అంటూ హ్యాష్ ట్యాగ్ తగిలించింది. 






వైన్ షాప్‌లో పురందేశ్వరి తనిఖీలు
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని ప్రభుత్వ వైన్ షాప్‌లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు సెప్టెంబర్ 21న పురందేశ్వరి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. దుకాణంలో ఆరోజు జరిగిన మద్యం అమ్మకాలు, అందుకు సంబంధించిన బిల్లుల గురించి ఆరా తీశారు. లక్షల రూపాయల మద్యం అమ్మి కేవలం రూ.7 వందలకు మాత్రమే బిల్లు ఇచ్చినట్లు గుర్తించామని బీజేపీ అధ్యక్షురాలు తెలిపారు. ఇలా మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడటమే కాకుండా, కల్తీ మద్యం అమ్మకాలు చేపడుతున్నట్లు ఆరోపించారు. మద్యం దుకాణం నుంచి మందు బాటిళ్లు తీసుకుని రోడ్డుపై పగలగొట్టి పురందేశ్వరి  నిరసన తెలిపారు.


నకిలీ మద్యం సరఫరా చేస్తున్న సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ దుకాణం వద్ద ఆందోళన నిర్వహించారు. గుర్ర బల్ల సెంటర్ లోని మద్యం దుకాణాన్ని సందర్శించి అమ్మక వివరాలపై ఆరా తీశారు. లక్ష రూపాయలు అమ్మి 7 వందల రూపాయలకే బిల్లు ఇవ్వడంపై పురందేశ్వరి విస్మయం వ్యక్తం చేశారు. ఏపీలో మద్యం మాఫియా చెలరేగిపోతోందని, నకిలీ మద్యం ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై జగన్‌రెడ్డి పూర్తి నిషేధం విధిస్తామని చెప్పి ఇప్పుడు తుంగలో తొక్కారని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా పురంధేశ్వరి మాట్లాడుతూ.. నకిలీ మద్యాన్ని వెంటనే అరికట్టాలని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.