YS Jagan Odarpu Yatra: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) మళ్లీ ఓదార్పు యాత్ర (Odarpu Yatra 2.0) చేపట్టనున్నారు. గురువారం తాడేపల్లిలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ దాడుల్లో గాయపడ్డవారిని ఆయన పరామర్శించనున్నారు. ఈ సమావేశంలో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలాగే, వైసీపీ ఓటమితో కుంగిపోయి మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది డిసెంబర్ నుంచి లేదా వచ్చే ఏడాది జనవరి నుంచి ఆయన ఓదార్పు యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 


'మళ్లీ అధికారంలోకి వస్తాం'


రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి, ప్రతి గడపకూ మనం చేసిన మంచిని ప్రజలు మరిచిపోరని వైఎస్ జగన్ పార్టీ నేతలతో అన్నారు. 'ఇదే ప్రజలు 2029 నాటికి చంద్రబాబు మోసాలు, ప్రలోభాలు గుర్తించి రెట్టించిన ఉత్సాహంతో వైసీపీని అధికారంలోకి తెచ్చుకుంటారు. ఈసారి ఎన్నికల్లో 40 శాతం ఓట్లు షేర్ అంటే 2019తో పోలిస్తే కేవలం 10 శాతం ఓట్లు తగ్గాయి. ఈ 10 శాతం ప్రజలు కూడా చంద్రబాబు మోసాలు, ప్రలోభాలను గుర్తిస్తారు. ప్రతీ కుటుంబానికి మనం చేసిన మంచి ఏంటో ప్రజలకు తెలుసు. విశ్వసనీయతకు మనం చిరునామా. మనం చేసిన మంచే మనకు శ్రీరామరక్ష. ఈ రోజుకీ జగన్ అబద్దాలు చెప్పడు. మోసాలు చేయడు అని ప్రజలకు తెలుసు. ప్రజలతో కలిసి చేసే పోరాటాల్లో వైసీపీకి, జగన్‌కు ఎవ్వరూ సాటిరారు. ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజల తరఫున పోరాటాలు చేస్తాం. ఏకంగా స్పీకర్ పదవి తీసుకోబోయే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇలాంటి కౌరవులు ఉండే సభకు మనం వెళ్లాల్సి ఉంటుంది.' అని జగన్ పేర్కొన్నారు.


'కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి'


ఎన్నికల్లో ఓడిపోయామన్న భావనను మనసులోంచి తీసేయాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. 'న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదు. ప్రతీ ఇంట్లోనూ మనం చేసిన మంచి ఉంది. మళ్లీ రికార్డు మెజార్టీతో గెలుస్తాం. మన కార్యకర్తలకు మనం తోడుగా ఉండాలి. ఎప్పుడూ చూడని విధంగా మన కార్యకర్తలపై, పార్టీ సానుభూతిపరులపై దాడులు చేస్తున్నారు. కొన్నిచోట్ల అవమానాలు, ఆస్తుల నష్టం కలిగిస్తున్నారు. వీళ్లందరికీ భరోసా ఇవ్వాలి. రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలను కలుసుకుంటాను. పార్టీ జెండాలు మోసి కష్టాలు పడ్డ వారికి తోడుగా ఉంటాను. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ స్థానిక నేతలు అంతా అందరికీ భరోసా ఇవ్వాలి. మనలో నిరాశకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వకూడదు. ప్రతి అభిమాని, కార్యకర్తకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనది.' అని జగన్ పిలుపునిచ్చారు.


'శకుని పాచికలా మాదిరిగా'


'మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేసినా ఎన్నికల ఫలితాలు ఇలా రావడం ఆశ్చర్యం కలిగించింది. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తుకువచ్చింది. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కానీ ఆధారాలు లేకుండా ఏమీ మాట్లాడలేం. ఇప్పుడు కేవలం ఇంటర్వెల్ మాత్రమే. శ్రీకృష్ణుడు తోడుగా ఉన్నా పాండవులు ఓడిపోతారు. ధర్మం, విశ్వసనీయత, నిజాయతీ తప్పకుండా గెలుస్తాయి. ప్రతి ఒక్కరూ ఒక అర్జునుని మాదిరిగా తిరిగి విజయం సాధిస్తారు.' అని జగన్ పేర్కొన్నారు.