YSR Kapu Nestam Scheme : ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్సార్ కాపు నేస్తం పథకం లబ్దిదారులకు రేపు(జులై 29న) నగదు వారి ఖాతాల్లో జమచేయనుంది. వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత నగదును బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 45 ఏళ్ల పై బడిన కాపు మహిళలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది.
వైఎస్సార్ కాపు నేస్తం
వైఎస్సార్ కాపు నేస్తం పథకం (YSR KAPU Nestam Scheme) లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం ద్వారా మూడో విడత పంపిణీ ఆర్థిక సాయాన్ని రేపు సీఎం జగన్ అందించనున్నారు. రేపు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సీఎం జగన్ కాపు నేస్తం లబ్ధిదారులకు అందించనున్నారు. పిఠాపురం నియోజక వర్గంలోని గొల్లప్రోలులో కాపు నేస్తం లబ్ధిదారులకు సాయాన్ని విడుదల చేయనున్నారు. కాపు సామాజిక వర్గంలోని కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలకు చెందిన, 45 ఏళ్లు నుంచి 60 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా సుమారు 3.2 లక్షల మందికి మహిళలు లబ్ధిపొందనున్నారు. ఈ పథకానికి ఏటా సుమారు రూ.490 కోట్లు కేటాయిస్తున్నారు.
ఏటా రూ.15 వేలు
ఏటా రూ. 15 వేలు చొప్పున ఐదేళ్ల పాలనలో రూ. 75 వేలను ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్న మహిళల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు(నెలకు), పట్టణ ప్రాంతంలో రూ.12 వేల(నెలకు) లోపు ఉండాలి. కుటుంబానికి గరిష్టంగా మూడు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట భూమి, మాగాణి మెట్ట రెండూ కలిపి పది ఎకరాలకు మించకూడదు. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు, అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారికి, ఆటో, టాటాఏస్, ట్రాక్టర్ వంటి వాహనాలను జీవనోపాధి కోసం కలిగి ఉండవచ్చు. కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య వికలాంగ పెన్సన్ తీసుకుంటున్నప్పుటికీ ఈ పథకానికి అర్హులు అవుతారు.
సీఎం జగన్ గొల్లప్రోలు పర్యటన
వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత ఆర్థిక సాయం అందించేందుకు సీఎం రేపు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకోనున్నారు. ఉదయం 10.45 – 12.15 గంటల వరకు బహిరంగ సభా ప్రాంగణంలో సీఎం ప్రసంగిస్తారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకం ఆర్థిక సాయం విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు అక్కడి నుంచి తిరుగు పయనమై గం.1.30 లకు తాడేపల్లి చేరుకోనున్నారు.
కాపు నేస్తం మూడో విడతలో రూ.508.18 కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38,792 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 508.18 కోట్ల ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అర్హులైన పేద కాపు అక్కచెల్లెమ్మలకు రేపు అందిస్తున్న రూ. 508.18 కోట్లతో కలిపి ఇప్పటివరకు కేవలం వైఎస్సార్ కాపు నేస్తం కింద రూ. 1,491.93 కోట్లు అందించినట్లు వెల్లడించింది. తద్వారా ఒక్కో పేద కాపు అక్క,చెల్లెమ్మకు ఈ మూడేళ్లలో అందించిన ఆర్థిక సాయం అక్షరాలా రూ. 45,000 అని తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో ఇచ్చింది సగటున ఏడాదికి కేవలం రూ. 400 కోట్లు కూడా ఇవ్వలేదని, కానీ వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలోనే వివిధ పథకాల ద్వారా 70,94,881 మంది కాపు అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు దాదాపు 27 రెట్లు ఎక్కువగా అంటే మొత్తం రూ. 32,296.37 కోట్ల లబ్ది చేకూర్చిందని స్పష్టంచేసింది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కాపుల బలోపేతం కోసం విశేష కృషి, సామాజిక సమతుల్యత పాటిస్తూ కాపులకు ఒక డిప్యూటీ సీఎంతో సహా, ఏకంగా 4 మంత్రి పదవులు కేటాయించామని సీఎం జగన్ తెలిపారు.
మూడేళ్లలో రూ. 32 వేల కోట్లు
మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కాపుల సంక్షేమం కోసం ఇప్పటివరకూ కేవలం మూడేళ్లలో రూ. 32,296 కోట్ల లబ్ధి చేకూర్చినట్లు సీఎం జగన్ తెలిపారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా మూడేళ్లలో లబ్ధిదారుల సంఖ్య 57,69,237 మందికి గాను రూ. 16,256.44 కోట్లు లబ్ధి చేకూర్చామన్నారు. నాన్ డీబీటీ ద్వారా మూడేళ్లలో లబ్ధిపొందిన లబ్ధిదారుల సంఖ్య 13,25,644 మంది అని, వారికి రూ. 16,039.93 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. మొత్తం డీబీటీ, నాన్ డీబీటీ కలిపి లబ్ధిదారుల సంఖ్య 70,94,881 కు గాను రూ. 32,296.37 కోట్ల లబ్ధి చేకూరిందని తెలిపారు.